unit cost
-
చంద్ర‘గృహ’ణం!
∙యూనిట్ కాస్ట్ భారీగా తగ్గింపు ‘ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం’కు సంబంధించి గత నెల 20న ప్రభుత్వం జీవో నంబర్ 90 జారీ చేసింది. ఇందులో ఇంటి నిర్మాణానికి యూనిట్ కాస్ట్‌ను రూ.2,25,000గా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేలు సబ్సిడీ ఇవ్వనుండగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద కేంద్ర ప్రభుత్వం రూ.52434 (90 శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.5826 (10 శాతం) కేటాయించారు. ఐఎస్ఎల్ (వ్యక్తిగత మరుగుదొడ్డి) సబ్సిడీ రూ.3 వేలు, బ్యాంక్ రుణం రూ.43740గా నిర్ణయించారు. మొత్తంగా 300 చదరపు అడుగుల్లో (మరుగుదొడ్డితో కలిపి) ఇంటి నిర్మాణం చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ దినేశ్‌కుమార్ జీవో నంబర్ 103 జారీ చేశారు. ఇందులో యూనిట్ కాస్ట్‌తో పాటు విస్తీర్ణం గణనీయంగా తగ్గించారు. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి హామీ నిధులు రూ.55 వేలుగా పేర్కొంటూ యూనిట్ కాస్ట్‌ను రూ.1.50 లక్షలకే పరిమితం చేశారు. పైగా 200 చదరపు అడుగుల్లోనే లబ్ధిదారుడు నిర్మాణం చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ‘ఉపాధి’ నిధుల ఖర్చుపై సందేహాలు : ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉపాధిహామీ పథకం కింద విడుదలయ్యే నిధుల ఖర్చుపై అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో నిధులు విడుదల కాకుంటే నిర్మాణాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పథకం కింద విడుదలయ్యే నిధుల్లో 90 రోజుల పనికి గాను రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి 17,460, ఇటుకల తయారీకి 25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 ఖర్చు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపుల్లోనూ కోత : జిల్లాకు ఇప్పటికే మంజూరైన ఇళ్లలోనూ ప్రభుత్వం కోత పెట్టింది. గతంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 50, హిందూపురానికి 500, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పుట్టపర్తి, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాలకు 1,150 ఇళ్లు చొప్పున కేటాయించారు. పెనుకొండకు 1,450, రాప్తాడు, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలకు 1,250 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 14,950 ఇళ్లను కేటాయించగా ఇప్పటికే 7925 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే తాజా ఉత్తర్వుల్లో ఇళ్ల సంఖ్యను 11,500కు కుదించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాలు నాలుగు, 50 శాతం.. అంతకంటే ఎక్కువగా గ్రామీణులున్న నియోజకవర్గాలు 8 ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం వీటి పరిధిలో 10,800 (నియోజకవర్గానికి 900) ఇళ్లు మంజూరు చేసింది. పట్టణ ప్రజలున్న రెండు నియోజకవర్గాలకు గాను 700 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంగా 11,500 ఇళ్లను జిల్లాకు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు 1967, ఎస్టీలకు 613, మైనార్టీలకు 688, జనరల్ కేటగిరీకి 8232 ఇళ్లను కేటాయించారు. జన్మభూమి కమిటీలకే పెత్తనం : గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీ సభ్యులు సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సభల్లో చదివి ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫైనల్ జాబితాను జిల్లా ఇన్చార్జ్ మంత్రిని సంప్రదించాక జిల్లా కలెక్టర్ తయారు చేయనున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతి కూడా కలెక్టరే ఇవ్వనున్నారు. ప్రక్రియ అంతా ముగిశాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలను ఉంచనున్నారు. -
పాడిగేదె రాదాయె!
కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన ఎన్.శివన్నకు ఎకరా భూమి ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో వేసిన పంటలు దెబ్బతింటున్నాయి. ఆయన కుటుంబ పరిస్థితిని గమనించిన పశువైద్యులు ఆయన చేత పాడిగేదెల కోసం దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసి రెండు నెలలు అవుతున్నా అతీగతీ లేదు. ఎస్సీ రైతు అయిన శివన్న ప్రతి మూడు రోజులకోసారి పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వచ్చి సబ్సిడీపై పాడిగేదె ఎప్పుడొస్తుందని అధికారులను అడుగుతున్నారు. చివరికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి అధికారులకు ఏర్పడింది. కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన మహేష్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. కుటుంబ పోషణకు ఈ భూమి సరిపోకపోతుండటంతో చిన్నటేకూరు పశువైద్యుడిని ఆశ్రయించారు. 50 శాతం సబ్సిడీతో పాడిగేదె ఇస్తాం.. దరఖాస్తు చేసుకొమ్మని డాక్టర్ సూచించారు. పాడిగేదె వస్తుందని పశుగ్రాసం సిద్ధం చేసుకున్న ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: కరువుకోరల్లో చిక్కుకున్న రైతాంగానికి పాడిపరిశ్రమను చేయూతనిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇందుకు తగిన ప్రోత్సాహం కొరవడింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మినీ డెయిరీల ఏర్పాటునే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పథకం కింద జిల్లాకు 2011-12, 2012-13 సంవత్సరాలకు గాను 168 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారునికి ఐదు పాడిగేదెలు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెల చివరిలోగా వీటిని పంపిణీ చేయాలి. మినీ డెయిరీల ఏర్పాటుకు విధిగా బ్యాంకు రుణం రూ.2.90 లక్షలు ఇవ్వాల్సి ఉంది. యూనిట్ కాస్ట్లో 25 శాతం సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ తక్కువగా ఉండటం, బ్యాంకులు సహకరించకపోతుండటంతో ఈ ఏడాది కూడా ఇవి పంపిణీ కాలేదు. రాజకీయ నాయకుల సిఫారసులతో 20 మినీ డెయిరీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. త్వరలో వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇంకా 148 మినీ డెయిరీలు మిగిలి ఉండటంతో సబ్సిడీ వృథా అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల జిల్లాకు వచ్చిన పశుసంవర్థక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లు ఈ విషయమై అధికారులతో చర్చించారు. పథకంలో మార్పు చేసి 50 శాతం సబ్సిడీతో ఒక్కో లబ్ధిదారునికి ఒక పాడి గేదె పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఒక్కో లబ్ధిదారునికి యూనిట్ కాస్ట్ కింద రూ. 71వేలు ఇవ్వాల్సి ఉంది. సబ్సిడీ పెరగడంతో జిల్లా మొత్తం మీద వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పశుసంవర్థక శాఖ నుంచి మినీ డెయిరీల స్థానంలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో పాడి పశువులను పంపిణీ చేసేందుకు సబ్సిడీని 50 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు రాలేదు. దీంతో జిల్లా అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పాడిగేదెల కోసం దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధుల కొరత: ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గొర్రెలు, పొట్టేళ్ల యూనిట్లు 50 శాతం సబ్సిడీతో మంజూరు అయ్యాయి. వీటికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం సబ్సిడీ మొత్తం విడుదల చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెల యూనిట్లు 106 మంజూరయ్యాయి. ఇందులో 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తారు. పొట్టేళ్ల పిల్లల యూనిట్ల 50 మంజూరు అయ్యాయి. ఇందులో 50 పొట్టేళ్ల పిల్లలు ఇస్తారు. మినీ పొట్టేళ్ల యూనిట్లు మంజూరు అయ్యాయి. వీటిలో ఆరు పొట్టేళ్ల పిల్లలు ఇస్తారు. వీటికి 50 శాతం సబ్సిడీ ఉంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల లబ్ధిదారులు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. -
సిమెంటు ధర సరే.. యూనిట్ వ్యయం పెంచరేం?
మడకశిర, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సిమెంట్ ధరను పెంచింది. అయితే యూనిట్ వ్యయాన్ని మాత్రం పెంచలేదు. దీంతో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం భారంగా పరిణమిస్తోంది. ఇదివరకు సిమెంట్ బస్తాను రూ.185 చొప్పున సరఫరా చేసింది. అయితే ఈ ధర గిట్టుబాటు కావడం లేదని సిమెంటు కంపెనీలు సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అంతరాయం ఏర్పడింది. కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం బస్తాపై రూ.45 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బస్తా రూ.230కు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ (యూనిట్) వ్యయం రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.80 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.లక్ష, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.05 లక్షలు చెల్లిస్తారు. ఇంటి నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ అవసరమవుతుంది. ప్రస్తుతం సిమెంట్ ధర బస్తాపై రూ.45 పెరగడంతో ఒక్కో లబ్ధిదారుపై రూ.2,250 అదనపు భారం పడింది. యూనిట్ వ్యయంలో ఆ మేరకు పెంపు లేనందున లబ్ధిదారుడే ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. అసలే బిల్లులు సకాలంలో రాక అప్పోసప్పో చేసి కట్టుకుంటుంటే.. ఇప్పుడు మరింత భారం మోపడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మడక శిర నియోజకవర్గంలో ఇటీవల రచ్చబండలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. సిమెంట్ ధర పెంచడం అన్యాయం ప్రభుత్వం సిమెంట్ ధరను పెంచడం చాలా అన్యాయం. ఈ ధరను భరించలేం. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబ్బు సరిపోవడంలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితిలో ధర పెంచడం మా లాంటి పేదలకు భారమే. ప్రభుత్వం స్పందించి ధరను తగ్గించాలి.. లేదా యూనిట్ వ్యయమైనా పెంచాలి. -హనుమక్క, లబ్దిదారురాలు,మడకశిర ధర పెరిగింది ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తున్నసిమెంట్ ధరను ప్రభుత్వం పెంచింది. బస్తాపై రూ.45 పెరిగింది. ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి. ఇకపై సిమెంటు కొరత సమస్య ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. లబ్ధిదారులు కూడా సహకరించాలి. -శ్రీనాథ్, ఏఈ, గృహనిర్మాణ శాఖ, మడకశిర