చంద్ర‘గృహ’ణం!
- ∙యూనిట్ కాస్ట్ భారీగా తగ్గింపు
‘ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం’కు సంబంధించి గత నెల 20న ప్రభుత్వం జీవో నంబర్ 90 జారీ చేసింది. ఇందులో ఇంటి నిర్మాణానికి యూనిట్ కాస్ట్‌ను రూ.2,25,000గా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేలు సబ్సిడీ ఇవ్వనుండగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద కేంద్ర ప్రభుత్వం రూ.52434 (90 శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.5826 (10 శాతం) కేటాయించారు. ఐఎస్‌ఎల్ (వ్యక్తిగత మరుగుదొడ్డి) సబ్సిడీ రూ.3 వేలు, బ్యాంక్ రుణం రూ.43740గా నిర్ణయించారు. మొత్తంగా 300 చదరపు అడుగుల్లో (మరుగుదొడ్డితో కలిపి) ఇంటి నిర్మాణం చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేశారు.
తాజాగా సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ దినేశ్‌కుమార్ జీవో నంబర్ 103 జారీ చేశారు. ఇందులో యూనిట్ కాస్ట్‌తో పాటు విస్తీర్ణం గణనీయంగా తగ్గించారు. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి హామీ నిధులు రూ.55 వేలుగా పేర్కొంటూ యూనిట్ కాస్ట్‌ను రూ.1.50 లక్షలకే పరిమితం చేశారు. పైగా 200 చదరపు అడుగుల్లోనే లబ్ధిదారుడు నిర్మాణం చేపట్టాలని అందులో పేర్కొన్నారు.
‘ఉపాధి’ నిధుల ఖర్చుపై సందేహాలు : ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉపాధిహామీ పథకం కింద విడుదలయ్యే నిధుల ఖర్చుపై అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో నిధులు విడుదల కాకుంటే నిర్మాణాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పథకం కింద విడుదలయ్యే నిధుల్లో 90 రోజుల పనికి గాను రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి 17,460, ఇటుకల తయారీకి 25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 ఖర్చు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇళ్ల కేటాయింపుల్లోనూ కోత : జిల్లాకు ఇప్పటికే మంజూరైన ఇళ్లలోనూ ప్రభుత్వం కోత పెట్టింది. గతంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 50, హిందూపురానికి 500, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పుట్టపర్తి, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాలకు 1,150 ఇళ్లు చొప్పున కేటాయించారు. పెనుకొండకు 1,450, రాప్తాడు, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలకు 1,250 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 14,950 ఇళ్లను కేటాయించగా ఇప్పటికే 7925 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే తాజా ఉత్తర్వుల్లో ఇళ్ల సంఖ్యను 11,500కు కుదించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాలు నాలుగు, 50 శాతం.. అంతకంటే ఎక్కువగా గ్రామీణులున్న నియోజకవర్గాలు 8 ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం వీటి పరిధిలో 10,800 (నియోజకవర్గానికి 900) ఇళ్లు మంజూరు చేసింది. పట్టణ ప్రజలున్న రెండు నియోజకవర్గాలకు గాను 700 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంగా 11,500 ఇళ్లను జిల్లాకు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు 1967, ఎస్టీలకు 613, మైనార్టీలకు 688, జనరల్ కేటగిరీకి 8232 ఇళ్లను కేటాయించారు.
జన్మభూమి కమిటీలకే పెత్తనం : గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీ సభ్యులు సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సభల్లో చదివి ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫైనల్ జాబితాను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిని సంప్రదించాక జిల్లా కలెక్టర్ తయారు చేయనున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతి కూడా కలెక్టరే ఇవ్వనున్నారు. ప్రక్రియ అంతా ముగిశాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల వివరాలను ఉంచనున్నారు.