కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన ఎన్.శివన్నకు ఎకరా భూమి ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో వేసిన పంటలు దెబ్బతింటున్నాయి. ఆయన కుటుంబ పరిస్థితిని గమనించిన పశువైద్యులు ఆయన చేత పాడిగేదెల కోసం దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసి రెండు నెలలు అవుతున్నా అతీగతీ లేదు. ఎస్సీ రైతు అయిన శివన్న ప్రతి మూడు రోజులకోసారి పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వచ్చి సబ్సిడీపై పాడిగేదె ఎప్పుడొస్తుందని అధికారులను అడుగుతున్నారు. చివరికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి అధికారులకు ఏర్పడింది.
కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన మహేష్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. కుటుంబ పోషణకు ఈ భూమి సరిపోకపోతుండటంతో చిన్నటేకూరు పశువైద్యుడిని ఆశ్రయించారు. 50 శాతం సబ్సిడీతో పాడిగేదె ఇస్తాం.. దరఖాస్తు చేసుకొమ్మని డాక్టర్ సూచించారు. పాడిగేదె వస్తుందని పశుగ్రాసం సిద్ధం చేసుకున్న ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: కరువుకోరల్లో చిక్కుకున్న రైతాంగానికి పాడిపరిశ్రమను చేయూతనిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇందుకు తగిన ప్రోత్సాహం కొరవడింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మినీ డెయిరీల ఏర్పాటునే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పథకం కింద జిల్లాకు 2011-12, 2012-13 సంవత్సరాలకు గాను 168 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారునికి ఐదు పాడిగేదెలు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెల చివరిలోగా వీటిని పంపిణీ చేయాలి. మినీ డెయిరీల ఏర్పాటుకు విధిగా బ్యాంకు రుణం రూ.2.90 లక్షలు ఇవ్వాల్సి ఉంది.
యూనిట్ కాస్ట్‌లో 25 శాతం సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ తక్కువగా ఉండటం, బ్యాంకులు సహకరించకపోతుండటంతో ఈ ఏడాది కూడా ఇవి పంపిణీ కాలేదు. రాజకీయ నాయకుల సిఫారసులతో 20 మినీ డెయిరీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. త్వరలో వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇంకా 148 మినీ డెయిరీలు మిగిలి ఉండటంతో సబ్సిడీ వృథా అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల జిల్లాకు వచ్చిన పశుసంవర్థక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లు ఈ విషయమై అధికారులతో చర్చించారు.
పథకంలో మార్పు చేసి 50 శాతం సబ్సిడీతో ఒక్కో లబ్ధిదారునికి ఒక పాడి గేదె పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఒక్కో లబ్ధిదారునికి యూనిట్ కాస్ట్ కింద రూ. 71వేలు ఇవ్వాల్సి ఉంది. సబ్సిడీ పెరగడంతో జిల్లా మొత్తం మీద వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పశుసంవర్థక శాఖ నుంచి మినీ డెయిరీల స్థానంలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో పాడి పశువులను పంపిణీ చేసేందుకు సబ్సిడీని 50 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు రాలేదు. దీంతో జిల్లా అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పాడిగేదెల కోసం దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధుల కొరత:
ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గొర్రెలు, పొట్టేళ్ల యూనిట్లు 50 శాతం సబ్సిడీతో మంజూరు అయ్యాయి. వీటికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం సబ్సిడీ మొత్తం విడుదల చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెల యూనిట్లు 106 మంజూరయ్యాయి. ఇందులో 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తారు. పొట్టేళ్ల పిల్లల యూనిట్ల 50 మంజూరు అయ్యాయి. ఇందులో 50 పొట్టేళ్ల పిల్లలు ఇస్తారు. మినీ పొట్టేళ్ల యూనిట్లు మంజూరు అయ్యాయి. వీటిలో ఆరు పొట్టేళ్ల పిల్లలు ఇస్తారు. వీటికి 50 శాతం సబ్సిడీ ఉంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల లబ్ధిదారులు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
పాడిగేదె రాదాయె!
Published Fri, Jan 17 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement