ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ చక్రధర్‌బాబు
సాక్షి,తోటపల్లిగూడూరు: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని నరుకూరు, పేడూరు, పాపిరెడ్డిపాళెం, ఇస్కపా ళెం, మల్లికార్జునపురం గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోని దాదాపు 58,075 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో ఇళ్లు 4 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు.
ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసేందుకు రానున్న 15 రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు రాబోయే రెండు నెలల్లో 90 శాతం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన లబ్ధిదారులకు కావాల్సిన అన్ని రకాల రా మెటీరియల్స్‌ను లేఅవుట్లలోనే అందుబాటులో ఉంచేందుకు అధికారులను ఆదేశించామన్నారు. ఆగస్ట్ నాటికి 30 వేల ఇళ్ల నిర్మాణాలను రూఫ్ లెవల్‌కు పూర్తి చేయాలనే లక్ష్యాని పెట్టుకున్నట్లు చెప్పారు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల విషయంలో పెద్ద లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ప్రత్యేక గౌడన్లను ఏర్పాటు చేసి స్టీల్, సిమెంట్, ఇసుకను డంపింగ్ చేసి లబ్ధిదారులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి కింద హౌసింగ్ లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించామన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామలమ్మ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, గృహ నిర్మాణశాఖ నెల్లూరు డివిజన్ ఈఈ దయాకర్, మండల ఏఈ ముక్తార్‌బాషా, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుమన్, వెలుగు సీసీ సైదా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment