నెల్లూరు సిటీ: ప్రస్తుత సమాజంలో రాజకీయనాయకులు, ప్రముఖుల పేర్లను ప్రాంతాలు, వీధులకు పేర్లుగా పెడుతున్న విషయం తెలిసిందే. అయితే బ్రిటీష్ పాలనలో నెల్లూరులోని ఓ ప్రాంతానికి అప్పటి కలెక్టర్ పేరును పెట్టారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేయడంతో సదరు కలెక్టర్ పేరునే ఆ ప్రాంతానికి పెట్టుకున్నారు. అదే స్టోన్‌హౌస్‌పేట. ఆ వివరాలు..
ఆంగ్లేయులు పాలించే రోజుల్లో తూర్పు నెల్లూరుగా పిలుస్తున్న ఆ ప్రాంతానికి 1835వ సంవత్సరంలో ‘‘టీవీ స్టోన్‌హౌస్’’ను కలెక్టర్‌గా నియమించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టోన్‌హౌస్‌పేట ప్రాంతంలో బ్రిటీష్ కాలంలోనే వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉండేది. జిల్లా అంతటికీ ఈ ప్రాంతం నుంచే సరుకులు సరఫరా చేస్తుండేవారు.
అలా వ్యాపారంలో ఆలస్యమైన సందర్బాలలో దూర ప్రాంత ప్రజలు ఇక్కడే సేదతీరేవారు. ఆకాలంలో అక్కడ దొంగల భయం ఎక్కువుగా ఉండేది. పరిస్థితి సమీక్షించిన కలెక్టర్ టీవీ స్టోన్‌హౌస్ ప్రత్యేక చొరతీసుకుని రాత్రి సమయాల్లో వ్యాపారులకు రక్షణగా రక్షక భటులను నియమించడం, నూనె దీపాలను వీధుల్లో పెట్టించడం వంటి చర్యలు తీసుకున్నారు.
ఆ ప్రాంత ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా కలెక్టర్ చేసిన సేవలకు సంతోషం వ్యక్తం చేసేవారు. దాంతో ఆయన సేవలకు గుర్తుగా కలెక్టర్ పేరునే ఈ ప్రాంతానికి పెట్టారు. ప్రస్తుతం స్టోన్‌హౌస్‌పేట అన్నీ రకాల వ్యాపారాలకు కేంద్ర బిందువుగా కోట్లు రూపాయాల ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment