ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు | Infrastructure in government schools during the year | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు

Published Sun, Jun 16 2024 5:32 AM | Last Updated on Sun, Jun 16 2024 5:32 AM

Infrastructure in government schools during the year

నెలాఖరులోగా స్టూడెంట్‌ కిట్ల పంపిణీ పూర్తిచేయాలి 

ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌ ఇవ్వాలి 

మంత్రి నారా లోకేశ్‌ ఆదేశం 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదిలోగా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎల్రక్టానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లి నివాసంలో విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

స్కూళ్లలో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  అలాగే ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, కారణాలేమిటో తెలియజేయాలన్నారు. బెజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ వినియోగం మీద సమగ్ర నోట్‌ ఇవ్వాలన్నారు. 

సీబీఎస్‌ఈ పాఠశాలలపై సమగ్ర వివరాలివ్వాలని చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్న 82 వేల మంది విద్యార్థులకు ఇచ్చే శిక్షణపై సమగ్ర నోట్‌ ఇవ్వాలని చెప్పారు. ఈ నెలాఖరులోగా స్టూడెంట్‌ కిట్ల పంపిణీ పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్,  బ్యాక్‌ ప్యాక్‌ (బ్యాగ్‌) అందించాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యా­యుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు.   

విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి 
విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. 2018–19 నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల వివరాలు, ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు ఎంత ఉండాలో వివరాలు సమర్పించాలన్నారు. 

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడంపైనా నివేదిక ఇవ్వాలన్నారు. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో అవినీతి ఆరోపణలపైనా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఉన్నత విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు, కమిషనర్‌ పోలా భాస్కర్, ఆర్జేయూకేటీ రిజి్రస్టార్‌ ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

త్వరలో నూతన ఐటీ పాలసీ
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా త్వరలో నూతన ఐటీ పాలసీని విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. శనివారం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖలపై మంత్రి ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలను రప్పించడానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఉన్న కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిల వివరాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఈ రంగాల్లో పేరుగాంచిన కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని అధికారులను కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement