సాక్షి, అమరావతి: ఓ వైపు కోవిడ్ భయాలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆదానీ, ఆదిత్యా బిర్లా, ఓఎన్‌జీసీ, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్, సెంచరీ పైబోర్డ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తోడు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏసీలు, మొబైల్ విడిభాగాల ఉత్పత్తులను తయారు చేయడానికి బ్లూస్టార్, డైకిన్, యాంబర్, డిక్సన్, ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, కార్బన్ వంటి సంస్థలు ముందుకు రావడంతో 2021ని ‘ఎలక్ట్రానిక్ ఇయర్’గా పిలుచుకోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక మౌలిక వసతులను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తోంది.
కోవిడ్ నేపథ్యంలో ఆంక్షలు ఉన్నప్పటికీ రికార్డు సమయంలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి అదనంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద 2,134 ఎకరాల్లో క్రిస్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కు తొలి దశలో భాగంగా రూ.1,190 కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి డీపీఆర్ రూపొందిస్తోంది. ఇదే సమయంలో రూ.13,254 కోట్లతో రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో మూడు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. దేశంలోనే తొలిసారిగా రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదం తెలపడమే కాకుండా 4 హార్బర్ల పనులు మొదలుపెట్టి మరో 5 హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తోంది.
ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన కొన్ని ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనలు
► విశాఖలో ఆదాని గ్రూప్ రూ.14,634 కోట్లతో 200 ఎంవీ సామర్థ్యంతో డేటా పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం 130 ఎకరాల భూమిని కేటాయించింది.
► కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామ్యం కావడానికి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చింది. ఈ యూనిట్‌లో సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
► కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద రూ.3,600 కోట్ల పెట్టుబడితో ఈపీసీఎల్ ఎల్‌ఎన్జీ టెర్మినల్.
► నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్.
► కొప్పర్తిలో రూ.401 కోట్లతో పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్, పరిశ్రమల పరికరాల తయారీ యూనిట్.
► కొప్పర్తిలో రూ.486 కోట్లతో నీల్‌కమల్ ఫర్నిచర్ తయారీ యూనిట్
► నాయుడుపేటలో గ్రీన్‌టెక్ రూ.627 కోట్లతో విస్తరణ పనులు.
► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో రూ.2,868.6 కోట్ల పెట్టుబడులతో హోటల్స్ ఏర్పాటు.
► కొప్పర్తిలో రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ యూనిట్
► వైఎస్సార్ జిల్లా బద్వేలులో రూ.2,600 కోట్లతో సెంచరీ ప్లైబోర్డ్స్ తయారీ యూనిట్.
► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.861 కోట్లతో గ్రాసిం ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా తయారీ యూనిట్.
► కొప్పర్తిలో రూ.207 కోట్ల పెట్టుబడితో ఏఐఎల్ డిక్సన్ తయారీ యూనిట్.
► కొప్పర్తిలో రూ.75 కోట్లతో డీజికాన్ సొల్యూషన్స్ యూనిట్ ఏర్పాటు.
► రూ.100 కోట్లతో సెల్‌కాన్ రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్.
► రూ.109 కోట్లతో ఆస్ట్రం టెక్నికల్ భాగస్వామి చంద్రహాస్ ఎంటర్‌ప్రైజస్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్.
► రూ.112 కోట్లతో యూటీఎన్‌పీఎల్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్.
► రూ.365 కోట్లతో వీవీడీఎన్ యూనిట్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్.
► రూ.1,800 కోట్లతో కార్బన్ హార్మనీ యూనిట్.
► శ్రీ సిటీలో డైకిన్ రూ.1,000 కోట్లతో ఏసీ తయారీ యూనిట్.
► శ్రీ సిటీలో రూ.540 కోట్లతో బ్లూస్టార్ ఏసీ తయారీ యూనిట్.
► శ్రీ సిటీలో రూ.250 కోట్లతో యాంబర్ ఏసీ తయారీ యూనిట్.
Comments
Please login to add a commentAdd a comment