సాక్షి, అమరావతి: రాయలసీమ రూపు రేఖలను మార్చే కడప స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్లతో కీలక మౌలిక వసతులు కల్పిస్తోంది. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న ఈ స్టీల్ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేలోగా.. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా తదితర కీలక మౌలిక వసతులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్లాంట్‌ను ఎన్‌హెచ్67కు అనుసంధానిస్తూ సుమారు రూ.90 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేస్తోంది.
తొలి దశలో రెండు లేన్ల రహదారిగా నిర్మించి రెండో దశ నాటికి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే రెండు లేన్ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఎర్రగుంట్ల–నంద్యాల ప్రధాన రైల్వే లైన్‌కు ప్లాంట్‌ను అనుసంధానిస్తూ రూ.324 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే రైల్వే శాఖకు అందించగా.. ఆ శాఖకు చెందిన అధికారులు వచ్చి సర్వే పూర్తి చేశారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఈ నెలలో సూత్రప్రాయ ఆమోదం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా కోసం రూ.64.56 కోట్లతో 400 కేవీ/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్‌కు అవసరమైన రెండు టీఎంసీల నీటిని ఆర్‌టీపీపీ నుంచి పైప్‌లైన్ ద్వారా తీసుకెళ్లడానికి రూ.127 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
అనుమతి రాగానే నిర్మాణ పనులు ప్రారంభం
జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించడానికి అవసరమైన కేంద్ర పర్యావరణ అనుమతులు కోసం జేఎస్‌డబ్ల్యూ ఎదురుచూస్తోంది. గతంలో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద జారీ చేసిన ఉత్తర్వులను.. ఈ ప్లాంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ జేఎస్‌డబ్ల్యూఏపీఎస్‌ఎల్ పేరు మీదకు మార్చాలంటూ కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాశామని అధికారులు చెప్పారు.
ఆ పని పూర్తవ్వగానే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా 2.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ ప్లాంట్, ఏడాదికి 4 మిలియన్ టన్నుల కెపాసిటీతో పెల్లెట్ ప్లాంట్, 1,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ఫర్ డీఆర్‌ఐ ప్లాంట్, 3,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ఆసక్తి వ్యక్తం చేసింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రాగానే వీటిపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.
రూ.650 కోట్లతో కడప స్టీల్‌కు మౌలిక వసతులు
Published Thu, Aug 3 2023 4:28 AM | Last Updated on Thu, Aug 3 2023 4:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment