సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా తరగతి గదుల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు కేటాయిస్తున్న నిధుల్లో అధిక శాతం పాఠశాలల కోసమే ఖర్చు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
రూ.318 కోట్లు విధిగా పాఠశాలలకే..
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు విద్యకు సంబంధిం చిన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పాఠశాల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 119 శాసనసభ్యులు, 40 శాసనమండలి సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది ఒక్కొక్కరికి రూ.5 కోట్ల లెక్కన మొత్తం రూ.795 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇందులో కనీసం 40 శాతం నిధులను తప్పనిసరిగా పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.318 కోట్లను ఈ రంగం పైనే ఖర్చు చేయాలన్న మాట.
మిగతా పనులు ఇవీ..
ఇక వైద్య రంగంలో భవనాల నిర్మాణం, తాగునీటి వసతి, పారిశుధ్యం, పల్లె..పట్టణ ప్రగతి, హరితహారం, రహదారుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుకు ప్రధానంగా ఈ నిధులను వినియోగించాలి. రెవెన్యూ గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే.. మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కానీ, అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ను పూర్తి చేయడానికి కానీ ఈ నిధులు వినియోగించరాదు. అయితే నియోజకవర్గ అభివృద్ధి నిధులతో గతంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న పక్షంలో, వాటిని పూర్తి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
ముందుగా ప్రతిపాదనలు పంపాలి
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తమ అధికారిక లెటర్‌పాడ్‌లపై జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. వీటిని కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జిల్లా మంత్రుల ఆమోదం తీసుకోవాలి. అనంతరం సాంకేతిక అనుమతి, అంచనాలు, టెండర్ల ప్రక్రియకు వెళ్లాలి. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలు ప్రతిపాదించిన పనులకు 45 రోజుల్లో కలెక్టర్ ఆమోదం తెలపాలి. ఒకవేళ తిరస్కరించే పక్షంలో 30 రోజుల్లోగా ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీకి సమాచారం అందించాలి. సంబంధిత ప్రతిపాదనకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తేనే ఆ పని చేపట్టి ఏడాదిలోగా పూర్తి చే యాలి. ఒక సంవత్సరంలో ప్రజా ప్రతినిధులకు కే టాయించిన నిధుల కంటే అధికంగా ప్రతిపాదనలు వస్తే.. ఆమోదించవద్దని కలెక్టర్లకు సూచించారు.
ఆమోదం పొందిన పనులు రద్దు చేయకూడదు
ఒకసారి ప్రతిపాదించి, ఆమోదం పొందిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయరాదు. అయితే పనులు ప్రారంభించని, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని వాటిని రద్దు చేయవచ్చు. ప్రస్తుత ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసి, కొత్త ఎమ్మెల్యే వచ్చినప్పటికీ పాత పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటిని తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకుని రావాలి. నిబంధనలకు అనుగుణంగా లేని ప్రతిపాదనలు వచ్చే పక్షంలో, కలెక్టర్లు వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అను మతి తీసుకోవాలి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు తమ నిధులను రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా వినియోగించుకునే అవకాశం ఉంది.
ఈ పనులు నిషేధం
రాష్ట్ర, కేంద్ర, స్థానిక సంస్థలకు సంబంధించి నివాస భవనాలకు, వాణిజ్య పరమైన పనులకు, నిర్వహణ, మరమ్మతు పనులకు ఈ నిధులు వినియోగించరాదు. అలాగే భూ సేకరణకు, మతపరమైన సంస్థల అభివృద్ధికి, విగ్రహాలు, స్వాగత తోరణాల ఏర్పాటుకు, ప్రైవేట్, వ్యక్తిగత పనులకు ఖర్చు చేయడం కూడా నిషేధం.
రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంపు
ఈ నిధుల్లో ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు ఒక్క రూపాయి కూడా చెల్లించరు. 3 నుంచి 9 నెలల్లోపు 50 శాతం, 9 నెలల తర్వాత పూర్తిగా ప్రభుత్వం కేటాయిస్తుందని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ఎమ్మెల్యే నియోజకవర్గం ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉంటే.. ఆయన నియోజకవర్గం కేంద్రం ఉన్న జిల్లాకు నిధులు కేటాయిస్తే, సంబంధిత కలెక్టర్ మరో జిల్లా కలెక్టర్‌కు నిధులు బదిలీ చేస్తారు. ఎమ్మెల్సీలు తమ పదవీ కాలం ముగియడానికి 18 నెలల ముందు పనులు పూర్తి చేయించాలి. 0.5 శాతం నిధులను పరిపాలన వ్యయం కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినియోగించుకోవడానికి అనుమతినిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొదట్లో కోటి రూపాయలుంటే, 2014–15లో కోటిన్నరకు, 2016–17లో మూడు కోట్లకు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లకు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment