
న్యూఢిల్లీ: దేశీయ స్టీల్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు 2019–20లోనూ 7 శాతానికి పైగా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టడమే దీనికి కారణమని పేర్కొంది. ముఖ్యంగా అందుబాటు ధరల్లో ఇళ్లు, విద్యుత్ పంపిణీ, రైల్వేలకు 2018–19 బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చినందున, మధ్య కాలంలో దేశీయంగా స్టీల్ వినియోగ వృద్ధి సానుకూలంగా ఉంటుందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదవడమే కాకుండా, రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధికి అవకాశం ఉంటుందని ఇక్రా అంచనా వేసింది.
డిమాండ్ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ... దేశీయ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5– 3 శాతం మధ్యే ఉండొచ్చని, చౌక దిగుమతులే ఇందుకు కారణమని పేర్కొంది. చైనా స్టీల్ డిమాండ్ మితంగానే ఉండడం, అధిక సరఫరా పరిస్థితులు సమీప కాలంలో ఈ రంగానికి సవాళ్లని అంచనా వేసింది. మరీ ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్ ధరలు గణనీయంగా తగ్గడంతో దిగుమతులు చౌకగా మారాయని, ఈ రకమైన దిగుమతులు దేశీయ మార్కెట్‌కు చేరడం మొదలైతే దేశీయంగా ధరలపై అధిక ఒత్తిడి ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment