సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఆతిథ్య’ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు రూ.140 కోట్లతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజు్ఞలైన అర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు అద్దుతోంది.
విశాఖ నుంచి ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ–టెండరింగ్ ప్రక్రియ ద్వారా హరిత హోటళ్ల అప్‌గ్రేడ్, పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 16 హోటళ్ల పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. విశాఖలోని యాత్రీనివాస్ హోటల్‌లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అరకులోని హరిత వ్యాలీ రిసార్టు, నెల్లూరు, ద్వారకాతిరుమలలోని హోటళ్ల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారయ్యాయి.
ఒకట్రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. మరో వారంలోగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టైడా జంగిల్ బెల్స్ రిసార్టు, విజయపురిసౌత్, శ్రీశైలం, సూర్యలంక, కడప, అరకులోని మయూరి, హార్సిలీహిల్స్, కర్నూలు, గండికోట హోటళ్లతో పాటు నెల్లూరు మైపాడు బీచ్ రిసార్టు, దిండి కోకోనట్ రిసార్టు, అనంతగిరి హిల్ రిసార్టులకు టెండర్లు పిలవనుంది.
అత్యాధునిక సౌకర్యాలతో..
ఆతిథ్య రంగంలోని ప్రైవేటు హోటళ్లకు దీటుగా ఏపీటీæడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్‌లో లగ్జరీ ఫర్నీచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడ్రన్ జిమ్, స్విమ్మిగ్ పూల్, సావనీర్ షాపు, మినీ బ్యాంకెట్/సమా వేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఉడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై–వెట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనాన్ని పెంచనుంది.
పులివెందులలో 4స్టార్ హోటల్
పులివెందులలో రూ.23.50 కోట్లతో 4స్టార్ హోటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన 1.71 ఎకరాల్లోని ఓ భవనాన్ని గుర్తించి కొనుగోలు చేసింది. ఇందులో వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్
(క్లబ్ హౌస్), జిమ్, పిల్లల ఆటస్థలం, ఎలివేటర్స్, సరై్వలెన్స్ సిస్టమ్, సౌర విద్యుత్ స్టేషన్‌తో పాటు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది.
సౌకర్యాల కల్పనలో రాజీపడం
పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలుత హరిత హోటళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. అత్యధిక పర్యాటకులు వచ్చే హోటళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తున్నాం. దశల వారీ అన్ని హోటళ్లలో మార్పులు చేస్తాం. నాణ్యమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. స్టార్ హోటళ్లకు దీటుగానే మా రిసార్టులు, హోటళ్లను తీర్చిదిద్దుతాం – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ
నిర్ణీత కాల వ్యవధిలో..
హోటళ్ల ఆధునికీకరణలో భాగంగా ఈ–టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్ల సమన్వయంతో పని చేస్తున్నాం. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. అనుకున్న కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో హోటళ్లను అప్‌గ్రేడ్ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – మల్‌రెడ్డి, ఈడీ (ప్రాజెక్ట్స్), పర్యాటకాభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment