ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) తొలిసారి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేసింది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. దీంతో ఒకేసారి ఇన్‌ఫ్రా బాండ్ల జారీ ద్వారా భారీస్థాయిలో నిధులను సమీకరించిన దేశీ ఫైనాన్షియల్ దిగ్గజంగా నిలిచింది.
మౌలికసదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగానికి రుణాలను అందించనుంది. వార్షికంగా 7.51 శాతం కూపన్ రేటుతో పదేళ్ల కాలపరిమితికి ఈ బాండ్లను జారీ చేసింది. వీటి కొనుగోలుకి 3.27 రెట్లు అధికంగా రూ. 16,366 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వ సెక్యూరిటీలతో పోలిస్తే 0.17 శాతం ఈల్డ్ వ్యత్యాసం(స్ప్రెడ్)తో బాండ్ల జారీని చేపట్టింది. మౌలిక అభివృద్ధి అత్యంత కీలకమని బాండ్ల విజయవంత విక్రయంపై ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా స్పందించారు.
అతిపెద్ద రుణదాత సంస్థగా సామాజిక, పర్యావరణహిత, తదితర ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ముందుకుసాగేందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఈ దీర్ఘకాలిక బాండ్ల ద్వారా మౌలికాభివృద్ధికి బ్యాంకు తనవంతు పాత్ర పోషించగలదని వ్యాఖ్యానించారు. బాండ్లకు దేశీ రేటింగ్ సంస్థల నుంచి ఏఏఏ రేటింగ్ లభించింది. బాండ్ల విక్రయం నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 608 వద్దే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment