బూమ్ బూమ్.. ఇన్ ఫ్రా..! | Large scale investments in the infrastructure sector | Sakshi
Sakshi News home page

బూమ్ బూమ్.. ఇన్ ఫ్రా..!

Published Mon, Oct 4 2021 3:16 AM | Last Updated on Mon, Oct 4 2021 3:22 AM

Large scale investments in the infrastructure sector - Sakshi

బలమైన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఈ సదుపాయాలపైనే ఎన్నో పరిశ్రమల ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. అందుకనే కేంద్ర సర్కారు మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి భారీ ప్రణాళికలతో ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ)ను ప్రకటించింది. ఇందులో భాగంగా రహదారులు, రైల్వే, విద్యుత్‌ తదితర రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు నిర్వహణకు అప్పగించనుంది. తద్వారా 2024–25 నాటికి రూ.6 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల విస్తరణకే కేంద్రం ఖర్చు చేయనుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎన్‌పీఏల కారణంగా మౌలిక సుదుపాయాల ప్రాజెక్టులకు కొంత కాలం పాటు రుణ లభ్యత కఠినంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలపై కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ రంగంలోని పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఓ సారి దృష్టి సారించొచ్చు.

ఇన్‌ఫ్రా స్టాక్స్‌
దీర్ఘకాలం కోసం నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటే.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.  
ఎల్‌అండ్‌టీ: 2007 నవంబర్‌లో ఎల్‌అండ్‌టీ షేరు ధర రూ.972. గతేడాది మార్చిలో ఇదే షేరు రూ.815వరకు తగ్గగా.. ప్రస్తుతం రూ.1,740 సమీపంలో ఉంది. కొన్ని రంగాల్లోని షేర్లు ఇదే కాలంలో ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. కానీ, మౌలిక రంగ షేర్లు ఇప్పటికీ ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ట్రేడ్‌ అవుతున్నాయి. నిర్మాణ, ఇంజనీరింగ్‌ రంగంలో ఎల్‌అండ్‌టీ దిగ్గజం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు, ఈ కంపెనీకి చెందిన సబ్సిడరీలు (మైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌) ఐటీ రంగంలో మెరుగ్గా రాణిస్తున్నాయి. ఇది కూడా అదనపు బలం. 2020–21 సంవత్సరం ఆదాయంలో మౌలిక రంగ వ్యాపార వాటా 45 శాతంగా ఉంది. రూ.3.2 లక్షల కోట్ల ఆర్డర్‌బుక్‌తో కంపెనీ పటిష్టంగా కనిపిస్తోంది.

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌: ప్రభుత్వ ప్రణాళికలతో ఎక్కువగా ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల మేర రహదారుల విస్తరణను కేంద్రం చేపట్టనుంది. ఈ సంస్థకు రుణ భారం తక్కువగా ఉంది. 20 ఏళ్ల మంచి ట్రాక్‌ రికార్డు కూడా సొంతం. ఈక్విటీతో పోలిస్తే 1.37 రెట్ల రుణ భారం కలిగి ఉంది. ఆదాయం, నికర లాభాల్లో మంచి వృద్ధిని చూపిస్తోంది. రూ.12,095 కోట్ల విలువైన ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉన్నాయి. ఆదాయంలో 20 శాతం వృద్ది నమోదు చేస్తామన్న అంచనాలను కంపెనీ ప్రకటించింది. ఎల్‌అండ్‌టీ మాదిరి వైవిధ్య వ్యాపారాలతో కూడిన కంపెనీ ఇది కాదు.

కల్పతరు పవర్‌ట్రాన్స్‌మిషన్‌: విద్యుత్‌ సరఫరా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పైపులైన్లు, రైల్వే, రహదారుల నిర్మాణంలోని కంపెనీ ఇది. ఆదాయాల్లోనూ మంచి వైవిధ్యం ఉంది. 2020–21 ఆదాయంలో 37 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి వచి్చంది. అప్రధాన ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికతో ఉంది. 2021 మార్చి నాటికి ఈక్విటీతో పోలిస్తే రుణభారం 0.66 రెట్లుగా ఉంది. కంపెనీ చేతిలో రూ.29,313 కోట్ల ఆర్డర్లు ఉండడంతో భవిష్యత్తు వ్యాపార వృద్ధికి చక్కని అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇన్‌ఫ్రా మ్యూచువల్‌ ఫండ్స్‌
నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు కనీస పరిజ్ఞానానికితోడు.. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్పులను పరిశీలించి, అవసరమైతే పెట్టుబడి నిర్ణయాలను సమీక్షించుకునే తీరిక కూడా ఉండాలి. అందుకే నేరుగా స్టాక్స్‌ అందరికీ అనుకూలం కాదు. తగినంత సమయం వెచి్చంచలేని వారు.. మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టే ఇన్‌ఫ్రా మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. ఈ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని మౌలిక రంగ కంపెనీల్లోనే పెడతాయి.  

ఫ్రాంక్లిన్‌ బిల్డ్‌ ఇండియా ఫండ్‌: ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తోంది. దేశ వృద్ధి పథంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంటుంది. అంటే ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్‌ఫ్రా కంపెనీలే కాకుండా.. మెటీరియల్స్, ఇండ్రస్టియల్స్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 61 శాతం ప్రస్తుతానికి ఇన్వెస్ట్‌ చేసి ఉంది. కనుక మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాల రిస్క్‌ కొంత తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వైవిధ్యమైన పథకంగా దీన్ని చూడొచ్చు. 2009 సెపె్టంబర్‌లో పథకం మొదలు కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్షిక రాబడులు 16 శాతానికి పైనే ఉన్నాయి.  

ఇన్వెస్కో ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌: లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. నిర్మాణం, సిమెంట్, ఇండ్రస్టియల్‌ ప్రొడక్ట్స్, విద్యుత్‌ కంపెనీల్లో ప్రధానంగా ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. 2013 జనవరిలో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి వార్షిక సగటు రాబడులు 18.53 శాతంగా ఉన్నాయి. అయితే, ఏదో ఒక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసే థీమ్యాటిక్‌ ఫండ్స్‌ (ఇన్‌ఫ్రా, ఫార్మా, ఐటీ.. ఇలా)లోరిస్క్‌ పాళ్లు ఎక్కువ. కనుక పెట్టుబడులకు తగినంత వైవిధ్యం ఉండేలా చూడాలి. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇన్‌ఫ్రాలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. థీమ్యాటిక్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో వాటిని వెనక్కి తీసుకోవడమూ అంతే ముఖ్యం.

ఇన్విట్‌లు
పెట్టుబడిపై క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారు, కొంత రిస్క్‌ తీసుకోవడానికి సుముఖంగా ఉంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)లను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్‌ఫ్రా కంపెనీలు ఏర్పాటు చేసే ప్రత్యేక పెట్టుబడుల వాహకాలే ఇని్వట్‌లు. కంపెనీలు తమ నిర్వహణలోని కొన్ని ప్రాజెక్టులను ఇని్వట్‌ కిందకు బదిలీ చేయడం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చు.

అలా సమకూరిన నిధులను అవి నూతన ప్రాజెక్టుల నిర్వహణ, రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం ఇన్విట్‌లు 80% నిధులను ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టుల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేయాలి. ఒక్కో యూనిట్‌ వారీ నికర మిగులు పంపిణీ ఆదాయం (ఎన్‌డీఎస్‌) నుంచి 90 శాతం వాటాదారులకు ప్రతీ త్రైమాసికానికి ఒక పర్యాయం పంపిణీ చేయాలి. అలా అని ప్రతీ క్వార్టర్‌కు కచి్చతంగా ఇంత చొప్పున వస్తుందని ముందే అంచనా వద్దు. 

స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్‌ అయిన ఇని్వట్‌లలో షేర్ల మాదిరే క్రయ, విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. కంపెనీల వాటాలు షేర్ల రూపంలో ఉంటే.. ఇన్విట్‌లకు సంబంధించి యూనిట్లు ట్రేడవుతుంటాయి. కనుక షేర్ల మాదిరే, మూలధన లాభాలు, నష్టాలకు అవకాశం ఉంటుంది. డెట్, ఈక్విటీల కలయికగా (హైబ్రిడ్‌) దీన్ని చూడొచ్చు. ఇన్విట్‌ ఐపీవోల్లో కనీస పెట్టుబడి రూ.10,000–15,000. లిస్టింగ్‌ తర్వాత ఇంతకుముందు కనీసం 100 యూనిట్లను కొనుగోలు చేయడం, విక్రయించడమే సాధ్యమయ్యేది. ఇప్పుడు షేర్‌ మాదిరే ఒక్కో యూనిట్‌ చొప్పున కొనుగోలు చేసుకోవచ్చు.

లిస్టింగ్‌లో ఇవీ...
పవర్‌గ్రిడ్‌ ఇని్వట్, ఇండియా గ్రిడ్‌ ట్రస్ట్, ఐఆర్‌బీ ఇని్వట్‌ ఫండ్‌ లిస్ట్‌ అయి ఉన్నాయి. ఇందులో పవర్‌గ్రిడ్‌ ఇని్వట్‌ అన్నది పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు సంబం ధించినది. ఇండియాగ్రిడ్‌ ట్రస్ట్‌ను కేకేఆర్, స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌ స్పాన్సర్‌ చేస్తున్నాయి. . ఇండియాగ్రిడ్‌ ప్రతీ త్రైమాసికానికి ఒక్కో యూనిట్‌పై రూ.3ను పంపిణీ చేస్తోంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా నిర్వహణలోని ఇని్వట్‌ ఫండ్‌ పరిధిలో టోల్‌ ఆధారిత రహదారి ప్రాజెక్టులున్నాయి. రోడ్లపై వాహనాల రద్దీ ఆధారంగా ఐఆర్‌బీ ఇన్విట్‌ ఆదాయంలోనూ అస్థిరతలు ఉంటుంటాయి. ప్రతీ యూనిట్‌కు 2018–19లో ఎన్‌డీఎస్‌ 12.25గా ఉండగా, ఆ తర్వాతి రెండేళ్లలో రూ.10, రూ.8.5కు తగ్గడం గమనార్హం. కరోనా లాక్‌డౌన్‌ల ప్రభావం ఈ సంస్థ ఆదాయంపై పడింది. ఇండియా గ్రిడ్‌ ఆరంభం నుంచి ఏటా పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులను అదనంగా చేర్చుకుంటూ వస్తోంది. దీంతో 2017–18లో రూ.448 కోట్ల ఆదాయం కాస్తా.. 2020–21 నాటికి రూ.1,675 కోట్లకు విస్తరించింది. భవిష్యత్తులో మరిన్ని ఇని్వట్‌లు కూడా ఐపీవోకు రానున్నాయి.

లాభాలపై పన్ను..
ఇన్విట్‌లను కొనుగోలు చేసి, తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభం, నష్టాలు ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయి. ఇని్వట్‌ల నుంచి అందుకునే ఆదాయం వాటాదారుల వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎవరికి వారే తమ ఆదాయ పన్ను శ్లాబు ఆధారంగా ఈ మొత్తంపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. నూతన కన్సెషనల్‌ పన్ను విధానాన్ని ఇని్వట్‌ నిర్వహణలోని ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇన్విట్‌లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి లాభం వస్తుంది. అప్పుడు రూ.లక్షకు మించిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. వీటిపై 15 శాతం పన్ను ఉంటుంది. ఆయా అంశాలన్నింటిపై సమగ్ర అవగాహన కోసం నిపుణులను సంప్రదిస్తే మంచిది.

2005–08 మధ్యకాలంలో ఇన్‌ఫ్రా స్టాక్స్‌లో పెద్ద బూమ్‌ కనిపించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత తిరిగి మౌలిక సదుపాయాల కంపెనీల స్టాక్స్‌ పెద్దగా ర్యాలీ చేసింది లేదు. తలకుమించిన రుణ భారంతో కొన్ని కనుమరుగు అయిపోగా.. నాణ్యమైన కంపెనీలు గట్టిగా నిలబ డ్డాయి. వీటికితోడు ఇని్వట్‌ రూపంలో కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్లు తమ రిస్క్, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షల ఆధారంగా అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement