సాక్షి, న్యూఢిల్లీ›: మూడో విడత వ్యాక్సిన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు, ఆసుపత్రుల మౌలిక వసతుల విస్తరణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యాచరణ ప్రణాళికను సూచించింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సిన్ మూడో దశ సంక్లిష్టతలను నివారించేందుకు కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను నవీకరించినట్టు శర్మ వివరించారు. రాష్ట్రాలు సరైన, సమయానుసారమైన డేటాను అప్‌లోడ్ చేయాలని చెప్పారు.
ఇలా చేయండి..
ప్రైవేట్ ఆస్పత్రులు, పారిశ్రామిక సంస్థల ఆసుపత్రులు, పరిశ్రమల సంఘాలు మొదలైన వాటితో సంప్రదింపులు జరపడం ద్వారా అదనపు ప్రైవేట్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, టీకా నిల్వలను, వాటి ధరలను కోవిన్ పోర్టల్‌లో ప్రకటించే ఆసుపత్రుల సంఖ్యను పర్యవేక్షించాలని, రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, 18–45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే’ ఉంటుందని ప్రచారం చేయాలని, టీకా, రిపోర్టింగ్, నిర్వహణ గురించి వాక్సినేషన్ సెంటర్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేంద్రం సూచించింది. కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను సమీక్షించాలని తెలిపింది.
అదనపు డెడికేటెడ్ హాస్పిటల్స్‌ను గుర్తించడం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో డీఆర్‌డీవో, సీఎస్‌ఐఆర్ తదితర ఏజెన్సీల సాయంతో ఫీల్డ్ హాస్పిటల్ సౌకర్యాలను సిద్ధం చేయడం, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న పడకలు, ఐసీయూ పడకలు ఏర్పాటు చేసుకోవడం, తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూసుకోవడం, రోగుల నిర్వహణ, అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడానికి అవసరమైన మానవ వనరులను మోహరింపు, లోటు మౌలిక సదుపాయాలున్న జిల్లాలకు తగిన రెఫెరల్ లింకేజీలను, అదనపు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం, పడకల కేటాయింపు కోసం కేంద్రీకృత కాల్ సెంటర్ ఆధారిత సేవలను ఏర్పాటు చేయడం, అందుబాటులోని పడకల కోసం రియల్ టైమ్ రికార్డును నిర్వహించి, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడం, కోవిడ్ సంరక్షణను అందించడానికి మార్గదర్శకాలను రూపకల్పన, ఇంట్లో ఒంటరిగా ఉన్న రోగులకు టెలి–మెడిసిన్ సౌకర్యాలు కల్పన వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment