Horseshoe Crab Blood: కరోనాకు వ్యాక్సిన్ వేసుకుంటున్నాం. రెండు డోసులు అయింది. బూస్టర్ డోసు వచ్చింది. తర్వాతా అవసరం పడొచ్చని అంటున్నారు. ఇంత అత్యవసరమైన వ్యాక్సిన్లు ఎంత భద్రమో తేల్చేది ఎవరో తెలుసా? ఎక్కడో సముద్రాల్లో బతికే ఓ చిన్నపాటి పీత. మనకు దాని రక్తం ధారపోసి బతుకునిస్తున్న ఈ పీతల వల్లే.. భారీస్థాయిలో కరోనా వ్యాక్సిన్లు త్వరగా అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాదు.. ఏ వ్యాక్సిన్, ఔషధమైనా ప్రమాదకర బ్యాక్టీరియా లేదని తేల్చేందుకు వాటి రక్తమే దిక్కు. మరి ఆ పీతలేమిటి, మనకు జరుగుతున్న ప్రయోజనమేమిటో తెలుసుకుందామా..
తాబేలుకు ఉన్నట్టుగా డొప్పలాంటి తల భాగం.. దానిపై పది కళ్లు.. డొప్ప మధ్యలో వేలాడుతున్నట్టుగా శరీరం.. పదునుగా ఉండే ముళ్లు.. మధ్య నుంచి పొడవాటి తోక.. చిత్రమైన శరీరమున్న జీవి ‘హార్స్‌షూ క్రాబ్’. కోట్ల ఏళ్లుగా పరిణామం చెందకుండా ఉండిపోయిన ‘హార్స్‌షూ’ పీతలు.. ఒక్క విషయం మాత్రం అత్యంత అద్భుతమైన సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. అదే వాటి రోగ నిరోధక శక్తి. అత్యంత సూక్ష్మస్థాయిలో (వెయ్యి కోట్లలో ఒక వంతు) కూడా బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉన్నా గుర్తించగల సామర్థ్యం వాటి సొంతం. 1960వ దశకంలో శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతను గుర్తించారు. అప్పటి నుంచీ వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు, సర్జికల్ ఇంప్లాంట్లు వంటివి ప్రమాదకర సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని తేల్చుకునేందుకు ఈ పీతల రక్తాన్ని వినియోగించడం మొదలుపెట్టారు.
చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
►ఈ పీత రక్తకణాలను వేరుచేసి ‘ఎల్‌ఏఎల్ (లిమ్యులస్ అమిబోసైట్ లైసేట్)’ను ఉత్పత్తి చేస్తారు. వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ ఎల్‌ఏఎల్‌తో పరీక్షిస్తారు. సదరు వ్యాక్సిన్/ఇంజెక్షన్/ఔషధంలో ప్రమాదకర బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా.. ఎల్‌ఏఎల్ గుర్తిస్తుంది.
► బ్యాక్టీరియా ఉన్నట్టు సదరు వ్యాక్సిన్/ఔషధాన్ని పడేస్తారు లేదా శుద్ధిచేసి మళ్లీ పరీక్షిస్తారు. ప్రమాదమేమీ లేదని తేలితే.. ప్యాకేజింగ్ చేసి, విక్రయానికి పంపుతారు.
►శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్షిస్తారు.
► కోవిడ్ మహమ్మారి మొదలైన తర్వాత వందల కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటన్నింటినీ హార్స్‌షూ రక్తంతో పరీక్షించి, భద్రమని తేల్చాకే మార్కెట్లోకి వస్తున్నాయి.
లీటర్ రక్తం రూ.12 లక్షలు!
‘హార్స్‌షూ’ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేగాకుండా పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులే. దీనితో ఈ రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షలు (16 వేల డాలర్లు) పైనే ఉంటుంది. అందుకే నీలి బంగారం (బ్లూగోల్డ్) అని పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్‌ఏఎల్) కోసం వెచ్చిస్తుంటాయి.
చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్!
గుండె నాళానికి సూది గుచ్చి..
సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరించి, ల్యాబ్‌కు తీసుకొస్తారు. అక్కడ వాటి బరువును తూచి, రక్తం సరిపడా ఉన్నవాటిని వేరుచేస్తారు. అనంతరం ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. వాటి శరీరంలో ఉండే మొత్తం రక్తంలో నుంచి సగానికిపైగా లాగేశాక.. తీసుకెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈ సేకరణ, తరలింపు, రక్తం తగ్గిపోవడం క్రమంలో దాదాపు మూడో వంతు పీతలు చనిపోతుంటాయి.
సెప్సిస్‌ను గుర్తించేందుకు..
సాధారణంగా ఏదైనా దెబ్బతగలడం, వ్యాధి వల్ల, శస్త్రచికిత్స ద్వారా అయిన గాయాలు మానకుండా.. పుండ్లుగా మారి, చీముపట్టడాన్ని సెప్టిక్ అంటాం. సదరు గాయంలోని ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించి.. శరీర అవయవాలను దెబ్బతీసే స్థితిని ‘సెప్సిస్’గా చెప్తారు. మొదట్లోనే దీన్ని గుర్తించలేక.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది చనిపోతున్నట్టు అంచనా. హార్స్‌షూ పీతల రక్తం నుంచి తీసే ‘ఎల్‌ఏఎల్’ ద్వారా ‘సెప్సిస్’ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రకంగానూ హార్స్‌షూ పీతలు మానవాళికి మేలు చేస్తున్నాయి.
లేత నీలి రంగులో..
మనుషుల రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఇనుము (ఐరన్) ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది. అదే ‘హార్స్‌షూ’ పీతల రక్తం లేత నీలి రంగులో ఉంటుంది. వాటి రక్త కణాల్లో ఉండే రాగి (కాపర్) అణువులే దీనికి కారణం. ఇది ఈ పీతల మరో ప్రత్యేకత.
ప్రమాదం అంచుకు చేరడంతో..
గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లతో వాటికి మరింత కష్టమొచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. వాటి టెస్టింగ్ కోసం భారీగా పీతలను పడుతూ, రక్తాన్ని సేకరిస్తున్నారు. సాధారణంగా ఏటా ఒక్క అమెరికా తూర్పు తీరప్రాంతంలోనే 5 లక్షలకుపైగా ‘హార్స్‌షూ’ పీతలను సేకరిస్తారని అంచనా. అంతేకాదు మెక్సికో, చైనా, మరికొన్ని దేశాల్లోనూ భారీ ఎత్తున హార్స్‌షూ పీతలను సేకరిస్తుంటారు. మనుషులు రక్త పిశాచాల్లా ఏటా లక్షలాది ‘హార్స్‌షూ’ పీతల నుంచి రక్తాన్ని పిండేస్తున్నారని.. ఇది జీవహింస అని కారుణ్యవాదులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
కోట్ల ఏళ్లుగా మారకుండా..
ఒకప్పటి గొరిల్లా/చింపాంజీల నుంచి మనుషులు అభివృద్ధి చెందినట్టుగా.. కాలం గడిచినకొద్దీ ప్రతి జీవి పరిణామం చెందుతుంది. కానీ ‘హార్స్‌షూ’ పీతలు పెద్దగా పరిణామం చెందకుండా.. సుమారు 45 కోట్ల ఏళ్ల కిందట (డైనోసార్ల కంటే ముందటి కాలం నుంచి) ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని బతికున్న శిలాజాలుగా పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment