సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కోతలు మొదలైనా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దిశగా పౌరసరఫరాల శాఖ కదలడం లేదు. కేంద్రాల ఏర్పాటు అంశాన్ని జిల్లాల యంత్రాంగానికి అప్పగించిన అధికారులు కొనుగోళ్ల సమయంలో సమకూర్చాల్సిన మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ నెలాఖరు కల్లా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని చెపుతున్నప్పటికీ .. కనీస సదుపాయాలను కల్పించే దిశగా దృష్టి పెట్టడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 6,500 కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు, తేమ పరీక్ష మెషీన్లు, తూకం యంత్రాలు, తాలు తొలగించేందుకు వినియోగించే ఫ్యాన్లు, కాలిపర్స్ వంటి పరికరాలను సమకూర్చాలి. పాత గన్నీ బ్యాగులు తప్ప, కొత్తగా ఒక్కటి రాలేదు. పశ్చిమబెంగాల్ నుంచి కోట్ల సంఖ్యలో గన్నీ బ్యాగులు రావలసి ఉంది. దీంతో ఈ సారి ధాన్యం కొనుగోళ్ల తీరు ఎలా ఉంటుందోనని జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టార్పాలిన్లు లేక రైతుల అవస్థలు..
కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు టార్పాలిన్లు అవసరం. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు రక్షణగా ఉంటాయి. అయితే ప్రతి సీజన్‌లో టార్పాలిన్ల సమస్య తీవ్రంగానే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 1,74,856 టార్పాలిన్లు అవసరం కాగా, ప్రస్తుతం 1.41 లక్షల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు చెపుతున్నాయి.
విన్నోయింగ్ (ధాన్యంలోని రాళ్లు, ఇతర నిరుపయోగమైన వాటిని తొలగించే) మెషీన్లు 5,119 అవసరం ఉండగా, అందుబాటులో ఉన్నవి 2,125 మాత్రమే. ధాన్యాన్ని శుభ్రపరిచే ప్యాడీ క్లీనర్లు 7,501కి గాను 4,195 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తేమను పరీక్షించే మిషన్లు 8,444 అవసరం కాగా, 7,905 అందుబాటులో ఉన్నాయి. మరో 539 కొనుగోలు చేయాల్సి ఉంది. తూకపు యంత్రాలు కూడా ఇంకా 312 అవసరం.
ధాన్యంలో తాలును తొలగించేందుకు 5,097 యంత్రాలు అవసరం కాగా, ఒక్కటి కూడా లేదని తెలుస్తోంది. గత యాసంగి సీజన్‌లో రైతులే ఫ్యాన్లు సమకూర్చుకొని తాలును తొలగించుకున్నారు. అలాగే 4,906 కాలిపర్స్‌లు అవసరంకాగా, 31 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5,080 జాలీలు అవసరం కాగా, 43 మాత్రమే ఉన్నాయి.
సొంత కల్లాల్లో ఆరబెట్టుకోవలసిందే..
కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి కుప్పలుగా పోసి, ఆరబెట్టి విక్రయించే తీరుకు గత యాసంగి నుంచే ప్రభుత్వం చెక్ పెట్టింది. రైతులు పంటలు కోసిన తరువాత పొలాల్లోనే కుప్పలు పోసి , అరబెట్టి, తాలును తూర్పారపట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో రైతులు తమ సొంత స్థలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు నేరుగా విక్రయించేలా బస్తాలలో తీసుకురావలసి ఉంటుంది. టోకెన్ విధానంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
వసతుల కల్పనకు ఆదేశాలు
రాష్ట్రంలో జిల్లాల వారీగా అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం సేకరించాలని నిర్ణయించాం. కోతలు ఇప్పుడిప్పుడే మొదలైన నేపథ్యంలో నెలాఖరు కల్లా అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. అలాగే గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, విన్నోయింగ్ మెషీన్లు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం.
– పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
Comments
Please login to add a commentAdd a comment