‘తాలు’ తీస్తున్నారు! | Millers Are Looting Farmers In Telangana | Sakshi
Sakshi News home page

‘తాలు’ తీస్తున్నారు!

Published Sun, Apr 26 2020 2:06 AM | Last Updated on Sun, Apr 26 2020 3:17 AM

Millers Are Looting Farmers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అకాల వర్షాలు.. అనుకోని రోగాలు.. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని పంట కోతకు నానా అగచాట్లుపడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తే సవాలక్ష ఇక్కట్లు.. రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఎక్కువుందంటూ మిల్లర్లు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యానికి మిల్లింగ్‌ కేంద్రాల వద్ద క్వింటాల్‌కు 5 నుంచి 6 కిలోల మేర కోతపెడుతూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎకరంలో 25 క్వింటాళ్లు పండించే రైతు 1.50 క్వింటాళ్ల ధాన్యాన్ని కోల్పోతున్నాడు. ఇంకా, చాలాచోట్ల రంగు మారిందన్న సాకుతో గ్రేడ్‌–1 ధాన్యానికి సాధారణ రకం ధాన్యం ధరకడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు.

మిల్లర్ల మాయాజాలం
రాష్ట్రంలో ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, 91లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 2 లక్షల మంది రైతుల నుంచి 5,400 కొనుగోలు కేంద్రాల ద్వారా 13.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. మిగతా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. అయితే ధాన్యం దిగుబడి అధికంగా గల కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో యాసంగిలో మెడవిరుపు, దోమపోటు, కత్తెరరోగం వంటి తెగుళ్లు సోకి పంట దెబ్బతింది.

అదీగాక 1010 మినహా 1152, 1156 వంటి విత్తన రకాలు అనుకున్నట్టుగా ఎదగలేదు. దీనికి అకాల వర్షాలు తోడయ్యాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేప్పుడే ఎండబెట్టి, తాలుతీసి తెస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాక తూకం సమయంలో తాలు, 17% తేమ నిబంధనలు అడ్డుపెట్టి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ధాన్యాన్ని కేంద్రం నుంచి మిల్లింగ్‌కు తరలించే సమయంలో అసలు దోపిడీ మొదలవుతోంది. ఇక్కడ ప్రతి 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాల్‌కు సుమారు 5 నుంచి 6 కిలోలు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీనిని ప్రశ్నిస్తే లారీలను వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో వంద క్వింటాళ్లు తీసుకొచ్చే రైతు ఏకంగా 6 క్వింటాళ్లు నష్టపోతున్నాడు. క్వింటాలుకు కామన్‌ రకం ధర రూ.1,815 చెల్లించినా కనీసంగా రైతు రూ.10,890 మేర నష్టపోతున్నాడు. 

అన్నింటికీ కామన్‌ ధరే..
ప్రస్తుతం గ్రేడ్‌–1 ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,835, కామన్‌ రకానికి రూ.1,815 చెల్లించాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో గ్రేడ్‌–1 రకం ధాన్యం కొంత రంగుమారింది. చాలాచోట్ల టార్ఫాలిన్లు లేక ధాన్యం నల్లరంగుకు మారింది. దీన్ని సాకుగా చూపి మిల్లర్లు గ్రేడ్‌–1 రకాన్ని కామన్‌ రకం కింద చూపుతున్నారు. దీంతో ప్రతి క్వింటాల్‌కు రూ.20 మేర రైతు నష్టపోతున్నాడు. దీనికి తోడు లాక్‌డౌన్‌ పరిస్థితుల దృష్ట్యా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో గ్రామాల్లో అందుబాటులో ఉన్న వారు, ప్రభుత్వ గిడ్డంగుల్లో పనిచేస్తున్న వారితో హమాలీ పనిచేయిస్తున్నారు. వీరు గతంలో క్వింటాల్‌కు రూ.32 తీసుకోగా ఇప్పుడు రూ.3 అదనంగా కలిపి రూ.35 వసూలు చేస్తున్నారు. ఇది రైతుకు అదనపు భారమవుతోంది. ఇక కొన్నిచోట్ల గన్నీ సంచుల కొరత.. రైతులకు పరీక్ష పెడుతోంది. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..! 

మిల్లులను సీజ్‌ చేయడానికి వెనకాడం 
ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టానుసారం కోత విధించవద్దని రైస్‌మిల్లర్లకు స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మిల్లులను సీజ్‌ చేయడానికైనా వెనుకాడం. మా ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు ఇవ్వకపోవడం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి బిల్లులు సరైన సమయంలో రాకపోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సీజన్లోనే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వంపై దాదాపు రూ.1,000 కోట్ల వడ్డీ భారం పడుతోంది.
– పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు
నేను ఎకరం పొలంలో వరి వేసిన. పొలమంతా రోగంబడి ఖరాబైంది. ఉన్నకాడికి వడ్లు కొనుగోలు కేంద్రానికి తెస్తే అందులో పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు. కనీసం పెట్టుబడి కూడా ఎల్లలే. వర్షం వస్తే టార్పాలిన్లు కూడా లేవు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– శ్యాగ ఎల్లయ్య, బీబీపేట, కామారెడ్డి జిల్లా

గన్ని సంచులు లేవని కొంటలేరు 
కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసి పది రోజులవుతోంది. తేమ పోయిందాక ఆరబెట్టినా, గన్ని సంచులు లేవని కాంట పెట్టడం లేదు. వడ్లు పోసేందుకు పరదాలు కిరాయికి తెచ్చినం. కిరాయిలు పెరుగుతున్నయి. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. – ఎలవేణి సుజాత, సుల్తానాబాద్, కరీంనగర్

ఏ–గ్రేడ్‌ వడ్లు బీ–గ్రేడ్‌గా తీసుకుంటున్నరు
తాలు, సంచి, మట్టి పేరుతో క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున తీస్తున్నరు. ఏ–గ్రేడ్‌ వడ్లను బీ–గ్రేడ్‌గా లెక్కగడుతున్నారు. దీంతో చాలా నష్టపోతున్నం. అధికారులే చొరవ తీసుకొని న్యాయం చేయాలి. – పిడుగు విమల, సుల్తానాబాద్, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement