జిల్లాలో 3,038కి పెరిగిన పోలింగ్ కేంద్రాలు
Published Sun, Sep 29 2013 2:52 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో ప్రస్తుతం 2,979 పోలింగ్ స్టేషన్లు ఉండగా 89 పోలింగ్ కేంద్రాల భవనాల మార్పునకు, మరో 59 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. దీంతో జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 3038 కు పెరుగుతుందని ఆయన చెప్పారు. కలెక్టరేట్‌లో శనివారం పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పులు, స్థలం మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి కలె క్టర్ అధ్యక్షత వహించారు.
ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు తదితర సమస్యలు లేకుండా ఉండేందుకు బూత్‌లెవెల్ అధికారులతో పాటు రాజకీయ పక్షాల తరపున బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ)ను నియమించాలని కలెక్టరు విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉంచడంలో, చేర్పులు, మార్పులు, ఇతర చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించడంలో బీఎల్‌ఏల నియామకం అవసరమన్నారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని ఈవిషయంపై ఓటర్లకు అవగాహన కలిగించడంలో బీఎల్‌ఏల పాత్ర ఎంతో అవసరమన్నారు. సమావేశంలో ప్రస్తుతం ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలను ఆమోదిస్తూ అదనపు ప్రతిపాదనల కోసం అక్టోబరు 30 సాయంత్రం 5 గంటలకు గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో మరో సమావేశం ఏర్పాటుకు సమావేశం నిర్ణయించింది.
ఓటుహక్కు కల్పనకు ప్రత్యేక చర్యలు
2014 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిని ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కలిగించేందుకు రాష్ట్ర, జాతీయ ఎన్నికల సంఘాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయని కలెక్టర్ వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 18 సంవత్సరాలు నిండినవారికి ఓటహక్కు కల్పించేందుకు, అనర్హులైనవారి పేర్లు తొలగించేందుకు అన్ని ఓటర్ల జాబితాల్లో నూరుశాతం ఓటర్ల ఫోటోలు ఉంచే విషయంలో రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ సహకారం అందించాలని ఆయన కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి బాబురావు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే పోలింగ్ కేంద్రాల పేరు మార్పులు, స్థల మార్పులు, కొత్తపోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందించామన్నారు.
టీడీపీ నగర అధ్యక్షుడు కొల్లేపల్లి రాజు మాట్లాడుతూ ఏలూరు కత్తేపు వీధిలోని మేడబడి కూల్చేసినందున అక్కడ ఉన్న నాలుగు పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మంతెన సీతారాం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాల భవనాల మార్పులు తదితర అంశాలపై పరిశీలించి అభిప్రాయాలు ఇచ్చేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెక్కంటి సుబ్బారావు, ఆర్ శ్రీనివాస్ డాంగే , బీఎస్పీ నాయకుడు కారం లెనిన్, కాంగ్రెస్ నాయకుడు గొట్టాపు లక్ష్మణరావు, బీజే పీ నాయకుడు ముద్దాని దుర్గారావు, టీడీపీ నాయకుడు అచ్యుతరావు పాల్గొన్నారు.
దసరాలోగా పంటల బీమా పరిహారం పంపిణీ
ఏలూరు : నీలం తుపానులో వరిపంట నష్టపోయిన జిల్లా రైతులకు దసరా పండగలోగా పంటల బీమా పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ పంటల బీమా అధికారులతో బీమా పరిహారంపై కలెక్టర్ సమీక్షించారు. 1,42,141 మంది రైతులకు పంటల బీమా పరిహారం మంజూరైందని, దసరాలోగా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము నేరుగా జమ చేసేలా బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement