‘పశ్చిమ’ అభివృద్ధికి పునరంకితం
Published Mon, Jan 27 2014 1:21 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 65వ గణతంత్ర దిన వేడుకలు ఆదివారం కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలన్నా రు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడటానికి ప్రాణాలర్పించిన అమరవీరులు, త్యాగ ధనులను అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలని కోరారు.
జిల్లా అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకుఅనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అవి సఫలీకృతం అయితే జిల్లా ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుళార్థకసాధక ప్రాజెక్టు పోలవరం సహా ఇతర సాగునీటి పథకాల నిర్మాణానికి ఆటంకాలుగా నిలుస్తున్న భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ దిశగా రైతులు ముందడుగు వేయాలన్నారు. చేపలు, రొయ్యల సాగు వైపు మాత్రమే మొగ్గుచూపకుండా ప్రత్యామ్నాయ పంటలు, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనపై అన్నదాతలు దృష్టిసారించాలన్నారు. రబీ సీజన్‌లో రైతులంతా యంత్రాంగానికి సహకరించి నాట్లు త్వరితగతిన పూర్తి చేసుకుంటే సాగునీటికి సమస్యలు తలెత్తవని, దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయన్నారు.
రూ.171 కోట్లతో ఆధునికీకరణ పనులు
మార్చి నెలాఖరు నాటికి కాలువలు మూసివేసి ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని సిద్ధార్థజైన్ చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో రూ.171 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులను చేపడతున్నామన్నారు. పంట రుణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది రూ.4,374 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.4,552 కోట్ల రుణాలు అందించామని కలెక్టర్ చెప్పారు. ఈ ఏడాది రూ.135 కోట్లను 55 వేల మంది కౌలు రైతులకు రుణాలుగా ఇచ్చామన్నారు. నీలం తుపాను పరిహారం ఇప్పటికే దాదాపు 90 శాతం మంది రైతులకు విడుదల చేశామని మిగిలిన వారికి త్వరలోనే అందించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయని ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద జిల్లాలో 70 వేల మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ హరికృష్ణ, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, కలెక్టర్ సతీమణి నెహజైన్, జిల్లా జడ్జి పి.లీలావతి, రెండవ అదనపు జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ, అదనపు ఎస్పీ చంద్రశేఖర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకర్‌రావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీవీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈవో వి.నాగార్జున సాగర్, డీపీవో అల్లూరి నాగరాజు వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement