
నడిసంద్రంలో 31 మంది మత్స్యకారులు
భీమవరం, న్యూస్‌లైన్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనవానిలంక వద్ద నాలుగు బోట్లలో 31 మంది మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోయారు. తుపాను వార్తల కవరేజీ నిమిత్తం చినమైనవానిలంక తీరానికి వెళ్లిన ‘సాక్షి’ బృందం ఈ బోట్లను గమనించి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే నేవీ, పోర్టు అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. అయితే, వారు హెలికాప్టర్‌లో వచ్చి పరిస్థితిని సమీక్షించి వెళ్లిపోయారు.
అనంతరం కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో ఆయన హోం శాఖకు విషయం చేరవేశారు. దీంతో నేవీ, కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారుల్లో ఆరుగురు శుక్రవారం రాత్రి నిజాంపట్నం రేవు వద్ద తీరానికి చేరుకోగా మిగిలిన 51 మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా, ఓఎన్జీసీ రిగ్‌లకు సామగ్రిని తీసుకెళ్లే ‘ఎంవీ మాలవీయ’ అనే ఆఫ్‌షోర్ సప్లయి వెసెల్ (ఓఎస్‌వీ) కాకినాడ సమీపంలోని వాకలపూడి వద్ద తుపాను అలల తీవ్రతకు తీరానికి కొట్టుకొచ్చింది. ఓడలో ఎంతమంది సిబ్బంది ఉన్నదీ ఇంకా తెలియరాలేదు.