సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలో తెలంగాణకు వెళ్లడంతో ఏపీ సర్కారు పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీలో తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని, నలుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులను మినహాయించి మిగిలిన వారిని ఆదివారం రిలీవ్ చేసింది.
అజయ్ సహాని, సిద్దార్ధ జైన్, అజయ్ జైన్, ఆర్.వి. కర్ణన్, అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీలో కొనసాగించాలని కేంద్రాన్ని కోరినందున వారిని రిలీవ్ చేయలేదు. అలాగే సస్పెన్షన్‌లో ఉన్న వై. శ్రీలక్ష్మిని, అలాగే ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉన్న ఎ. విద్యాసాగర్, సి. హరికిరణ్, జి. శ్రీజనలను రిలీవ్ చేయలేదు. మిగిలిన 44 మంది ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఐపీఎస్‌లలో ప్రస్తుతం ఏపీ ఇంటిలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న ఎ.ఆర్. అనురాధను భార్య, భర్తల కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కేంద్రాన్ని కోరినందున ఆమెను మినహాయించి మిగిలిన 23 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా తెలంగాణకు కేటాయించిన ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో నలుగురిని మినహాయించి మిగిలిన 30 మంది ఐఎఫ్‌ఎస్‌లను రిలీవ్ చేశారు. వీరందరినీ తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, సస్పెన్షన్‌లో ఉన్న ఐఎఫ్‌ఎస్‌లు రాజేశ్ మిట్టల్, ఎ. కృష్ణను తెలంగాణకు కేటాయించినప్పటికీ వారిని రిలీవ్ చేయలేదు. అలాగే తెలంగాణకు కేటాయించినా భార్యా, భర్తల కేసు ఆధారంగా రాహుల్ పాండే. సి. శెల్వం ఐఎఫ్‌ఎస్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది.
కొందరికి అంతర్గత సర్దుబాట్ల కింద కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇలా
బి. ఉదయ లక్ష్మి బీసీ సంక్షేమ కమిషనర్, అంతర్గత సర్దుబాటు కింద రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ కమిషనర్, సహకార శాఖ కమిషనర్ బాధ్యతలు. మహ్మద్ ఇక్బాల్ మైనారిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ, వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యదర్శి, సర్వే సెటిల్‌మెంట్ డెరైక్టర్. కోన శశిధర్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ. అంతర్గత సర్దుబాటు కింద యువజన, పర్యాటక డిప్యుటీ కార్యదర్శి, శాప్ వైస్ చైర్మన్, ఎండీ, సహాయ పునరావాస సంయుక్త కార్యదర్శి. జి. వీరపాండ్యన్ ఉపాధి హామీ డెరైక్టర్, అంతర్గత సర్దుబాటు కింద మహిళా శిశు సంక్షేమ డిప్యూటీ కార్యదర్శి, మెప్మా డెరైక్టర్, ఏపీ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టు పీడీ. ఎం.వి.ఎస్.ఎ. సోమయాజులు సాధారణ పరిపాలన శాఖ డిప్యుటీ కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద అదనపు ముఖ్య ఎన్నికల అధికారి, గృహనిర్మాణ సంస్థ ఈడీ. లింగరాజు పాణిగ్రాహి ఆర్‌ఐఎడీ ముఖ్యకార్యదర్శి. వి. శివశంకరరావు సాధారణ పాలన(సర్వీసెస్), అధికార భాష ఉప కార్యదర్శి.
ఏపీలో పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జ్‌ల నియామకం
Published Mon, Jan 5 2015 3:55 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement