రాజకీయ ‘పిడి’కిలి | Political 'pidikili | Sakshi
Sakshi News home page

రాజకీయ ‘పిడి’కిలి

Published Sat, Oct 11 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

రాజకీయ ‘పిడి’కిలి

రాజకీయ ‘పిడి’కిలి

శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న స్మగ్లర్లపై ‘పిడి’కిలి బిగించడంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ దాటవేత ధోరణి అవలంబిస్తుండడంలో ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు. గతంలో తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలుపై ఆయన సంతకం చేయకపోవడం గమనార్హం. ఆ ఫైలుపై ఇన్‌చార్జ్ కలెక్టర్ హోదాలో శ్రీధర్ సంతకం చేసి ప్రభుత్వానికి పంపడంతో.. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై శుక్రవారం పీడీ చట్టాన్ని ప్రయోగించింది. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తాజాగా ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలుపై సంతకం చేయకుండా నాన్చుతుండడంపై పోలీసు వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఆ టాస్క్‌ఫోర్స్, పోలీసుల నేతృత్వంలో ఇప్పటిదాకా 191 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌కు ఎస్పీ ప్రతిపాదనలు పంపితే, కలెక్టర్ సంతకం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి.

పీడీ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన సలహా మండలి సమావేశమై.. ఆ నివేదికపై చర్చించి, ఆమోదముద్ర వేయవచ్చు.. లేదా తిరస్కరించవచ్చు. రాష్ట్ర సలహా మండలి ఆదేశాల మేరకే పీడీ చట్టాన్ని స్మగ్లర్లపై ప్రయోగిస్తారు. కానీ.. ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ పంపిన ఫైలుపై కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సంతకం చేసి, ప్రభుత్వానికి పంపడంలో దాటవేత వైఖరిని అనుసరిస్తున్నారు. తాజాగా ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ జి.శ్రీనివాసరావు పంపిన ఫైలుపై సంతకం చేయకపోవడం అందుకు తార్కాణం.
 
సంతకం చేయరెందుకో...

వైఎస్‌ఆర్ కడప జిల్లా సుండుపల్లి మండలం అప్పయ్యగారిపల్లెకు చెందిన గట్టుబాబు అలియాస్ శివప్రసాద్‌నాయుడు 20 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడు. చిత్తూరుకు చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంతనాయుడుపై 11 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రానికి చెందిన పుల్లకుమార్‌పై 13, విజయ్‌కుమార్‌పై 13 స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. రాయచోటికి చెందిన రెడ్డెప్పరెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయి.

ఈ ఐదుగురిని అరెస్టు చేసిన  పోలీసులు ఎస్పీ జి.శ్రీనివాసరావు ద్వారా వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు 20 రోజుల క్రితం ఫైలు పంపారు. ప్రభుత్వ కార్యాకలాపాల్లో జిల్లా అధికారయంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోన్న కలెక్టర్.. తాను మాత్రం ఆ ఫైలుపై సంతకం చేయకుండా నాన్చుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తొమ్మిది మంది అంతర్జాతీయ ఁఎర్ర* స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలు కూడా కలెక్టర్ సంతకం చేయడంలో వెనుకంజ వేశారు.
 
శ్రీధర్ చొరవతో తొమ్మిది మందిపై పిడికిలి..

అంతర్జాతీయ స్మగ్లర్లు ఆయిల్ రమేష్, రియాజ్ ఖాన్, హమీద్ ఖాన్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణన్, మహ్మద్ రఫీ, అసిఫ్ అలీ ఖాన్, విక్రమ్ మెహందీ, శరణన్‌లను జూలై 15న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందకు అనుమతి ఇవ్వాలని అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ జూలై 16న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు ప్రతిపాదించారు. దీనిపై కలెక్టర్ దాటవేత ధోరణి అవలంబించారు.

అనంతరం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సింగపూర్ పర్యటనలో ఉన్న వారం రోజుల్లో అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా వ్వయహరించారు. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు ఆగస్టు 27న ఈయన అనుమతి ఇచ్చారు. శ్రీధర్ అప్పట్లో పంపిన నివేదికను సెప్టెంబర్ 19న పరిశీలించిన పీడీ చట్టం సలహా మండలి ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసింది. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీధర్ చొరవ వల్లే ఆ తొమ్మిది మందిపై ప్రభుత్వం పీడీ చట్టాన్ని ప్రయోగించిందని పోలీసులు స్పష్టీకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement