- 9 మంది స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సుముఖత చూపని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
- పోలీసుశాఖ ప్రతిపాదనను నెలన్నర రోజుల పాటు తొక్కిపెట్టడంలో మర్మమేమిటో...?
- ఆ తొమ్మిది మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇన్‌చార్జ్ కలెక్టర్
పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ ఎర్రదొంగలపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విముఖత చూపారు. ఆయన అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లిన నాలుగు రోజులకే ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆ తొమ్మిది మందిపై ‘పిడి’కిలి బిగించారు. కలెక్టర్ పిడికిలి సడలిస్తే.. ఇన్‌చార్జ్ కలెక్టర్ బిగించడం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఆ టాస్క్‌ఫోర్స్, పోలీసుల నేతృత్వంలో ఇప్పటిదాకా 179మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అందులో పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారు. ఆయిల్ రమేష్, రియాజ్‌ఖాన్, హమీద్ ఖాన్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణన్, మహ్మద్ఫ్రీ, అసిఫ్‌అలీఖాన్, విక్రమ్‌మెహందీ, శరణన్‌లను జూలై 15న పోలీసు లు అరెస్టు చేశారు. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు జూలై 16న ప్రతిపాదించారు.
సాధారణంగా ఎస్పీ చేసిన ప్రతిపాదనపై రెండు మూడు రోజుల్లో కలెక్టర్ ఆమోదముద్ర వేయడం.. ఆ తర్వాత పీడీ చట్టాన్ని ప్రయోగించడం రివాజు. కలెక్టర్ రాంగోపాల్ హయాంలో ఇదే రీతిలో పీడీ చట్టాన్ని ప్రయోగించేవారు. కానీ.. సిద్ధార్థ్‌జైన్ మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. ఆ తొ మ్మిదిమందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడానికి సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఎర్రచందనం టెండర్లలో తక్కువ ధరకు ఎర్రచందనాన్ని కొట్టేసి.. ఆ తొమ్మిది మంది స్మగ్లర్ల సహకారంతో అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి ఇద్దరు టీడీపీ కీలక ప్రజాప్రతినిధులు వ్యూహం రచించారు.
ఆ వ్యూహంలో భాగంగానే ఆ తొమ్మిది మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించకుండా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయయ్యాయి. నెలన్నర పాటు తొమ్మిది మందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించే ఫైలుపై కలెక్టర్ ఆమోదముద్ర వేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరింది. ఐఏఎస్‌ల విభజనలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయిస్తూ ఆగస్టు 21న ప్రత్యూష కమిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఆ మరుసటి రోజే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. సింగపూర్ పర్యటన ముగించుకుని ఈనెల 2న జిల్లాకు రానున్నారు.
కలెక్టర్ సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు ఆగస్టు 27న ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీధర్ అనుమతి ఇచ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చిన ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీధర్‌ను అటు పోలీసు, అటవీ అధికారులు.. ఇటు ప్రజాసంఘాలు ప్రశంసిస్తున్నాయి. ఈ క్రమంలోనే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ వ్యవహరించిన తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.