కురబలకోట : చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద రెండు రోజుల క్రితం పట్టుబడ్డ ఎర్రచందనం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రూరల్ సీఐ మురళి, ముదివేడు ఎస్‌ఐ రామక్రిష్ణ శుక్రవారం తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు... జిల్లాలోని ఎర్రావారిపాళెం ప్రాంతం నాగుల కుంట గ్రామానికి చెందిన ఎం.సురేష్ (34), రెడ్డెప్ప (26) బావా బావమరుదులు. దగ్గరున్న తలకోన అడవి నుంచి కొంత కాలంగా ఎర్రచందన కొట్టి ఒక చోట దాచారు. లోడుకు సరిపడ్డాక దీన్ని బెంగళూరుకు చెందిన వారికి మధ్యవర్తి ద్వారా అమ్మారు. దీన్ని ములకలచెరువు వరకు చేర్చడానికి టయోటా క్వాలీస్‌ను మాట్లాడుకున్నారు.
రెండు రోజుల క్రితం ఆరుగురు ఎస్కార్టుతో బయలు దేరారు. కురబలకోట మండలంలోని అంగళ్లు వద్ద వేగంగా వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ వల్ల క్వాలీస్ బేరింగ్ దెబ్బతింది. దీంతో బండి నడవడం కష్టంగా మారింది. చెన్నామర్రి వద్ద రోడ్డుపక్కన మట్టి రోడ్డు రావడంతో కొంత దూరం పోనిచ్చి ఎర్రచందనం దుంగల్ని దించేశారు. పరారవడానికి యత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సమీప కొండల్లోకి పరారయ్యారు. గాలింపులో వీరిద్దరు పట్టుపడగా అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి వీరిని పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ రూరల్ సీఐ మురళి, ముదివేడు ఎస్‌ఐ రామకృష్ణ ఇతర సిబ్బందిని అభినందించారు. రివార్డు ప్రకటించనున్నట్లు సమాచారం.