సారూ మరిచారా?మీరు జిల్లాకు కలెక్టరు కదా !
- ఫోకస్ మొత్తం కుప్పంపైనేనా ?
- ఐదుగురు ఆర్డీవో స్థాయి అధికారుల నియామకం
- డెప్యుటేషన్‌పై 26మంది టీచర్ల బదలాయింపు
- వైద్యశాఖలోనూ 48 మందిని పంపిన వైనం
- అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కంకణం
- కలెక్టర్ పనితీరుపై జిల్లాలో జోరుగా చర్చ
కుప్పం నియోజకవర్గం చాలా వెనుకబడింది...కచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే ! ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఫోకస్ మొత్తం కుప్పంపైనే ఉంచి తక్కిన నియోజకవర్గాలను విస్మరిస్తే...అది కూడా సరికాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అచ్చం ఇదే తంతుతో ముందుకెళుతున్నారు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్. విధుల్లో చేరినప్పటి నుంచి ‘కుప్పం’పై కలెక్టర్ అనుసరిస్తున్న పాలన, విధానపరమైన నిర్ణయాలపై అధికారులతో పాటు, విశ్లేషకుల్లో జోరుగా చర్చసాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్‌లా కాకుండా కుప్పం ఆర్డీవోగా సిద్ధార్థ్‌జైన్ వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు.
సాక్షి, చిత్తూరు: జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థ్‌జైన్ గత నెల 12న బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరినప్పటి నుంచి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. అధికారులను పరుగెత్తిస్తున్నారు. తనదైన ‘మార్క్’ను చూపించి పాలనను గాడిలో పెట్టాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా సమగ్రాభివృద్ధిపై కాకుండా కుప్పం నియోజకవర్గంపైనే కలెక్టర్ ఫోకస్ పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నెలరోజుల్లో కుప్పంపై కలెక్టర్ మార్క్ ఇది
బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదు రోజులకే కలెక్టర్ కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను నియమించారు. ఆధార్ సీడింగ్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వారికి అప్పగించారు. వీరితో పాటు అమలాపురం ఆర్డీవో ప్రియాంకను కుప్పం ప్రత్యేకాధికారిగా రప్పించడంలో కూడా కలెక్టర్ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేకాధికారిగా రప్పించారని తెలిసింది.
దీంతో కుప్పం నియోజకవర్గాన్ని ఐదుగురు ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలి గ్రీవెన్స్ సెల్ చిత్తూరులో నిర్వహించి, రెండో గ్రీవెన్స్‌డేను కుప్పంలో నిర్వహించారు. తాజాగా కుప్పంలో ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్యశాఖల్లో ఖాళీల భర్తీపై దృష్టి సారించారు. ఇటీవల 26మంది ప్రభుత్వ టీచర్లను జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కుప్పం నియోజకవర్గానికి డెప్యుటేషన్‌పై పంపించారు. అలాగే 48మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని కుప్పానికి పంపారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం డెప్యుటేషన్‌పై ఎవరినీ ఎక్కడా నియమించకూడదు. పైగా కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా కలెక్టర్ చొరవ తీసుకుని కుప్పం ఖాళీల భర్తీకి ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 2629 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కుప్పం నియోజకవర్గంలో 510 ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించకుండా కుప్పం వెళ్లేందుకు టీచర్ల నుంచి వినతిపత్రాలు తీసుకుని పంపించారు. ఇదే తరహాలో పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లెలోని మారుమాల ప్రాంతాల్లో ఖాళీలపై కలెక్టర్ ఎందుకు దృష్టిసారించడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ఏలుబడిలో పాతికేళ్ల నిర్లక్ష్యం:
చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గ వాసి అయినప్పటికీ కుప్పం ప్రజలు పాతికేళ్లుగా చంద్రబాబును ఆరాధిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు. తొ మ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా కూడా ‘కుప్పం’ నుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇన్నేళ్లు ఆదరించిన కుప్పం వాసులను చంద్రబాబు మాత్రం పూర్తిగా విస్మరించారు.
కుప్పంలోని వలసలను నివారించడం, ఉపాధి కల్పనపై దృష్టిసారించడం, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కుప్పం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు కూడా అభవృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌గా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంటుంది.
అయితే తాగునీటికి కటకటలాడుతున్న పూతలపట్టు లాంటి నియోజకవర్గాలతో పాటు జిల్లా అభివృద్ధిపై పాక్షిక దృష్టి పెట్టి, కుప్పంపై మాత్రం పూర్తి దృషి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఇదే దోవలో వెళుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు బయటపడకపోయినా లోలోపల కలెక్టర్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు.
బాధ్యత లు తీసుకున్న నెలరోజుల్లోనే కలెక్టర్ తన మనసులోని ‘లక్ష్యాన్ని’ బయట పెట్టారని చెబుతున్నారు. అధికారపార్టీ నేతలు కూడా కలెక్టర్ తీరుపై నిరుత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా కలెక్టర్ వైఖరిపై నేరు గా మాట్లాడకున్నా, కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై అధికారుల అంతర్గత చ ర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నెలరోజులు ‘పాలనబండిని’ కు ప్పంవైపు నడిపిన కలెక్టర్ ఇప్పుడైనా దారి మారుస్తారో లేదో చూడాల్సిందే!