25న కలెక్టర్ సింగపూర్ పయనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 2 వరకూ సింగపూర్‌లో ‘సెవెన్త్ లీడర్స్ ఇన్ గవర్నెన్స్ ప్రోగ్రామ్’ పేరుతో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్ సిద్ధార్థజైన్ పాల్గొననున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక భూమిక పోషించే ప్రతినిధులతో ఈనెల 25 నుంచి సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సుకు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు ఎంపిక చేశారు. సింగపూర్ సదస్సులో పాల్గొనడానికి ఈ నెల 24న కలెక్టర్ చెన్నైకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లి.. సదస్సు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 4న జిల్లాకు చేరుకుంటారని అధికారవర్గాలు వెల్లడించాయి.