అధికారుల హాస్టల్ నిద్ర
చిత్తూరు(సిటీ) : జిల్లాలోని 124 సాంఘిక సంక్షేమ, 68 బీసీ సంక్షేమ, 16 గిరిజన సంక్షేమ ప్రీమెట్రిక్ వసతిగృహాల్లో(హాస్టళ్లు) అధికారులు శుక్రవారం రాత్రి నిద్ర చేశారు. రాత్రి 7 గంటలకు విద్యార్థులకు పెట్టే భోజన మెనూ, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రత, వసతి గృహాల్లో సిబ్బంది పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
చిత్తూరు బాలుర వసతిగృహం-2 లో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, పెనుమూరు వసతిగృహంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి, చిత్తూరు బాలికల వసతిగృహంలో జిల్లా పౌరసరఫరాల అధికారిణి విజయరాణి, జీడీ నెల్లూరు వసతిగృహంలో బీసీ సంక్షేమశాఖాధికారి డీ రామచంద్రరాజు, పూతలపట్టు వసతిగృహంలో డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, చిత్తూరు బాలుర వసతిగృహం-1లో డ్వామా పీడీ గోపీచంద్ బస చేశారు.
కార్వేటినగరం సాంఘిక సంక్షేమ వసతిగృహంలో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, దామల్‌చెరువు వసతిగృహంలో సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ కే ధనంజయరావు, కేవీ పల్లె బాలికల వసతి గృహంలో డీపీఆర్వో లీలావతి, మదనపల్లెలో తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషలాఫీసర్, వీ కోట వసతిగృహంలో డీటీసీ బసిరెడ్డి, కల్లూరు వసతి గృహంలో ఆర్టీవో సత్యనారాయణమూర్తి రాత్రి నిద్ర చేశారు. వీరితో పాటు మిగిలిన వసతి గృహాల్లో మిగిలిన జిల్లా స్థాయి అధికారులు, దిగువ శ్రేణి అధికారులు హాస్టల్ నిద్ర చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.