
ద్విముఖ పోరాటమే నేటి అవసరం
ఈ నెల 9న జరిగే పది వామపక్షాల సమావేశం గురించి సీపీఎం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మధు పత్రికలకు వెల్లడించిన వివరాలు విని సంతోషించిన కమ్యూనిస్టు శ్రేయోభిలాషులలో నేనూ ఒకడిని. ఆంధ్ర రాజధాని ప్రాంత రైతుల, కూలీల, వ్యవసా యాధారిత వృత్తుల వారి సమస్యల గురించి చర్చిం చి, వాటి పరిష్కారం కోసం లక్షమంది మహిళలతో త్వరలో చేపట్టబోయే ఉద్యమం గురించి చర్చించ డమే ఆ సమావేశం ఉద్దేశం. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలన్నది వామపక్షాల లక్ష్యం. సమస్య తీవ్రమైనది. అందుకు తగ్గట్టు ఉద్యమాన్ని ఉధృత స్థాయిలో నిర్వహించాలన్న వామపక్షాల నిర్ణయం కూడా అభినందనీయమే. ప్రతిపక్షాలకే కాదు, అసలు ప్రజానీకానికే జవాబుదారులం కాదన్నట్టు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమం తగిన గుణపాఠం నేర్పాలని కూడా కోరుకుందాం.
దిగజారిన చంద్రబాబు ప్రతిష్ట
చంద్రబాబు నేడున్నంత ఆత్మరక్షణ పరిస్థితిలో గత ఏడాదికాలంలో ఎన్నడూ లేరు. ఎన్నికల హామీలలో ఒక్కటీ నెరవేర్చక పోవడంతో చంద్రబాబుపై విశ్వ సనీయత అంతంత మాత్రంగా మిగిలింది. రేవంత్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని జరి పిన ఓటుకు కోట్లు కుంభకోణంతో ఆ కాస్త విశ్వసనీయత అధ ఃపాతాళానికి పడిపోయింది. రేవంత్ పాత్రధారిగా, తానే సూత్రధారిగా సాగించిన ఈ బాగోతం వీడియోలను, ఆడియోలను తెలుగు ప్రజలు చూశారు. దీనితో ఒక విధమైన ఆత్మన్యూనతా భావం చంద్రబాబును ఆవరించింది.
అదంతా విశ్వామిత్ర సృష్టి అని చెప్పడం సాధ్యం కాక, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందనీ, సెక్షన్ 8ని గుర్తించడం లేదనీ, ఏపీ ప్రయోజనా లను అడ్డుకుంటూ కేసీఆర్ అహంకార ధోరణితో ఉన్నారనీ చంద్రబాబు ఎదు రుదాడికి దిగుతున్నారు. తనతోపాటు తన అనుచరగణాన్ని కూడా ప్రోత్స హించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అశాంత వాతావరణానికి దోహదం చేస్తున్నారు. చంద్రబాబు ఎదురుదాడిలో ఏదో మేర వాస్తవం ఉండవచ్చు. స్వచ్ఛమైన ప్రజాస్వామికవాది అని కేసీఆర్‌ను ఎవరూ అనలేరు. కానీ ఆ ఎదు రుదాడితో చంద్రబాబును ఆవరించిన ఓటుకు కోట్లు అవినీతి వ్యవహారం మరుగునపడదు.
వామపక్షాలు చేపట్టబోయే మహోద్యమాన్ని స్వాగతించే సమయంలో ‘ఓటుకు కోట్లు’ ప్రస్తావించడానికి కారణం ఉంది. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం ప్రకారం ఆర్థిక పునాదికి అనుగుణంగా ఉపరితలం మీద రాజకీయాలు, కళలు, మతం, సంస్కృతి వంటి అంశాలు ఉంటాయి. అలాంటి ఆర్థిక అంశం మీదనే వామపక్షాలు ఉద్యమించనున్నాయి. నిజానికి రాజధాని ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడిన జనం పరిస్థితి జీవన్మరణ సమస్యగా పరిణ మించింది. దీని మీద గతంలోనూ వామపక్షాలు ఉద్యమాలు నడిపాయి. ఇప్పటి మహోద్యమం ఆలోచన వాటి నుంచి ఉద్భవించి ఉండవచ్చు. అలాం టి ప్రజా ఉద్యమాన్ని ఓటుకు కోట్లు వ్యవహారం మీద కూడా వామపక్షాలు నడిపి ఉండవలసింది.
ఉపరితల అంశాలూ ముఖ్యమే
అదలా ఉంచుదాం! ఏంగిల్స్ పునాది ఉపరితలం గురించి వివరణ ఇస్తూ, నేనూ, మార్క్స్ చెప్పింది అంతిమంగా ఆర్థిక పునాదే నిర్ణయాత్మకమవుతుం దని మాత్రమే. అంతమాత్రాన ఉపరితలంలో ఉండే రాజకీయాలు, మతం, కళలు, సంస్కృతి ఇత్యాది అంశాల ప్రభావమేమీ ఉండదని అర్థంకాదు! పైగా ఆర్థిక పునాదికి సంబంధించిన అంశాలకంటే చాలా సందర్భాలలో ఉపరిత లంలోని అంశాలపైనే త్వరితగతిన విస్తృతస్థాయిలో ప్రజలు స్పందిస్తారని అన్నారు. మన అనుభవం కూడా అదే! రాజకీయ అవినీతి ఉపరితల అంశ మే! బహుశా అందుకే దానిపై ప్రజలలో అంత ఆసక్తి, వ్యతిరేకతలతో చర్చ జరుగుతున్నది. ఎన్నో ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలు చేపట్టినా సాధారణ ప్రజానీకంలో ప్రభుత్వంపై కలగనిఏహ్యభావం ఈ ఓటుకు కోట్లు బాగోతం వల్ల కలిగింది!
అదే సమయంలో టీడీపీ నేతల గళాలు గతంలో కంటే హె చ్చుస్థాయిలో ఎదురుదాడితోనూ, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుం టాయేమోనన్న భయంతో వైఎస్సార్ సీపీపైన, కాంగ్రెస్‌పైన వ్యర్థంగానూ విరుచుకుపడుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కయాడట! సరే అలాగే అనుకున్నా, రేవంత్‌రెడ్డిని లోబరుచుకుని, ఈ ఓటుకు కోట్లు బాగోతాన్ని సృష్టించి, టీడీపీ పరువును చంద్రబాబు పలుకుబడిని దిగజార్చ మని జగన్ ప్రోత్సహించారా? ఇలాంటి ప్రశ్నలూ, వింత వింత సమాధా నాలు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించి, తెలుగుదేశం, చంద్రబాబు ప్రతిష్టలను బాగా మసకబారుస్తున్నాయి.
రాజధాని ప్రాంత సమస్యలకూ, ‘ఓటుకు కోట్లు’ రగడకీ మూలం - అవి నీతే. దొడ్డిదారినో అడ్డదారినో ఆర్జించిన ధనంతో పదవిలో కొనసాగాలన్న అధికార దాహం చంద్రబాబుది. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, ఒప్పు కోకుంటే భూసేకరణ పేరుతో బెదిరింపులు, పర్యాటక కేంద్రాలు, హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్ పార్కులు ఇవన్నీ, అదీ ప్రైవేట్ రంగంలో విదేశీ స్వదేశీ గుత్తాధిపతులకు కట్టబెట్టి తద్వారా తనకు, తన అనుయాయులకు తరతరా లకు తరగని ఆస్తి సమకూర్చాలన్న తపన తప్ప ఏముంది? అవినీతితో ఈ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో వ్యవహరిస్తున్న దళారి స్వభావంలో ఉంది. ఆ నైజాన్ని బహుళ అంతస్తుల భవనాలు, సింగపూర్, జపాన్ తరహాలో మెట్రో రైళ్లు, అత్యాధునిక విమానాశ్రయాలు, 1000 సంవత్సరాలు సైతం చరి త్రలో నిలబడే రాజధాని పేరిట రంగుల కలలతో కప్పిపెట్టుకుంటున్నారు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం! అదీ ఈ ఓటుకు కోట్లు బాగోతం ప్రాధాన్యం.
ఆర్థిక పునాది అంతిమ నిర్ణయాత్మకమని కమ్యూనిస్టు పార్టీలు గుర్తుంచుకోవాలి! ఈ లోపల ఉపరి తలంలో ఉంటున్న విష సంస్కృతిపై పోరాడాలి! రాజకీయ అవినీతితో పాటు, నిచ్చెన మెట్లలాంటి వర్ణవ్యవస్థ, దళితులు, ఆదివాసీ గిరిజనులు బాగా వెనుకబడిన కులాల వారిపై అగ్ర పెత్తందారీ కులాలు జరుపుతున్న దోపిడీ దౌర్జన్యాలు, మైనారిటీలలో అభద్రత, మహిళల జీవితాలను ధ్వంసం చేస్తున్న మనుస్మృతి భావజాలం ఇవన్నీ మన వ్యవస్థ ఉపరితలంలోని విష సంస్కృతి భాగాలే! ఈ ద్విముఖ పోరాటం జరపకుండా మన ప్రత్యేక పరిస్థి తిలో సామాజిక పురోగమనం అసాధ్యం. కనుక ఈ క్షణాన ఇటు రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఆర్థిక పోరాటం, మరోవంక రాజకీయ అవినీతికి నిలువుటద్దం పట్టిన చంద్రబాబు ఓటుకు కోట్లు బాగోతం రెంటినీ సమన్వ యపరచి, వామపక్షాలు సమైక్య సమరశీల మహోద్యమం చేయాలి. ఈ వామ పక్ష ఐక్యత, ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసమే!
(వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ నం: 98480 69720)
- ఏపీ విఠల్