సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ దెబ్బకొట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ తెచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలకు నిన్న నిరసన తెలిపామని, దానికి కొనసాగింపుగా ఈ నెల 29, 30.. అక్టోబర్ 1 వ తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన దీక్షలకు పిలుపునిస్తున్నామని తెలిపారు. (చదవండి: భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు)
ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని నాడు చెప్పిన బీజేపీ.. అన్ని హమీలను పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అంతర్వేది ఘటనను ఉపయోగించుకుని రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇదే బీజేపీ పార్లమెంట్లో రైతాంగ వ్యతిరేక బిల్లులు చేస్తోందని, కరోనా వైపరీత్యాన్ని ఉపయోగించుకుని ఒక వైపు ఆర్థిక రంగంలో కార్పొరేట్ల ప్రయోజనానికి.. మరో వైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో బలపడడానికి చూస్తోందని విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్‌ను సాధించాలని బీజేపీకి టీడీపీ వత్తాసు పలుకుతుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మధు నిప్పులు చెరిగారు.
‘‘పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా, విభజన హామీలపై మడమ తిప్పి బీజేపీ పక్కన చేరాడు. సోము వీర్రాజు రాష్టంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. అంతర్వేది ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి. ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఏరుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. దేశంలో రైతాంగ ఉత్పత్తులును కార్పొరేట్‌లకు ధారాదత్తం చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. గాంధీని చంపిన ఈ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తోందని’’ ఆయన ఆరోపించారు. అక్టోబర్ 2న గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా శాంతియుతంగా పోరాడే వారికి వామపక్షాలు మద్దతిస్తున్నాయని’’ మధు తెలిపారు. (‘ఆ దాడులు వెనుక కుట్ర కోణం’)
Comments
Please login to add a commentAdd a comment