సాహసానికి మారుపేరు
హైదరాబాద్ ప్రభవించిన స్వాతంత్య్ర సమరయోధుల్లో రావి నారాయణరెడ్డి హీరో! సాహసం, ఆత్మసౌందర్యం ఆయన సొత్తు. నల్లగొండ జిల్లా, బొల్లేపల్లి గ్రామంలో సమృద్ధ జాగీర్దారీ కుటుంబంలో 1908లో జూన్ 4వ తేదీన రావి జన్మించారు. హనుమాన్ టేక్డిలోని రెడ్డిహాస్టల్ విద్యార్థి. ఆటలు-స్కౌటింగ్-నాటకాల్లో ముందువరసలో ఉండేవాడు. ఓసారి ఫుట్‌బాల్ ఆడుతుండగా వెన్నెముకకు గాయమైంది. జీవితాంతం ఆ దుర్ఘటన ఫలితం కలుక్కుమనేది. బ్రిటిష్ పాలనకు సహాయ నిరాకరణ చేయండి అనే గాంధీగారి పిలుపునకు హైదరాబాద్‌లో స్పందించిన తొలితరం యువకుడు నారాయణరెడ్డి. ఇంటర్మీడియట్ చదువుకు స్వస్తి చెప్పారు!
1929లో రావి వార్ధా వెళ్లారు. గాంధీగారిని కలిశారు. 1929లో మరణించిన తన శ్రీమతి నగలను తీసుకెళ్లారు. ‘హరిజనా(దళిత)భ్యుదయ’ కార్యక్రమాలకు వినియోగించాలని విరాళంగా ఇచ్చారు. 1932లో తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక్ సంఘ్‌ను స్థాపించాడు. హైదరాబాద్ విభాగానికి సరోజినీనాయుడును అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా రావి నారాయణరెడ్డిని నియమించారు.
అనారోగ్యకారణాలతో మరుసటి సంవత్సరం సరోజినీనాయుడు ఆ పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్ష బాధ్యతలు ఆయనే ఆరేళ్లు నిర్వర్తించారు. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబర్ 24న తొలిబ్యాచ్ సభ్యుడిగా సత్యాగ్రహం చేశారు.
గాంధీయన్ కమ్యూనిస్ట్!
తెలుగు ప్రజల సాంఘిక జీవితం మెరుగుపరచడం లక్ష్యంగా 1928లో ఆంధ్రమహాసభ అనే సాంస్కృతిక సంస్థ ఏర్పడింది. 1941-44-45ల్లో మూడుసార్లు రావి అధ్యక్షునిగా పనిచేశారు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచారు. తమ పార్టీ సభ్యులు 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని గాంధేయవాది అయిన రావినారాయణరెడ్డి స్వీకరించారు. తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టారు. 1934లో మహాత్మాగాంధీ సికింద్రాబాద్ మీదుగా పర్యటించినప్పుడు ఆయన కార్యక్రమాలకు సహాయంగా 50 తులాల బంగారాన్ని సమర్పించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పనితీరు నిస్సారమైన వాతావరణంలో 1939లో రావి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. తెలంగాణ సాయుధపోరాటానికి వీరోచితంగా నాయకత్వం వహించారు.
అజ్ఞాతం లేదా జైలు!
1947 పంద్రాగస్ట్‌న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. కమ్యూనిస్ట్ పార్టీ సాయుధపోరాట విరమణ చేస్తుందని, చేయాలని రావి నారాయణరెడ్డి భావించారు. మగ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ కూడా అదే భావనలో ఉన్నారు. అయితే కొందరు అలా భావించలేదు. 1948 ఫిబ్రవరిలో కోల్‌కతాలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ రెండవ కాంగ్రెస్ ‘సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిందే’ అని ఆదేశించింది. ఈ ప్రకటన వెలువడిన మూడు రోజులకు పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించింది. అజ్ఞాతవాసం నుంచి వెలుపలకు రావాలని భావించిన రావి నారాయణరెడ్డి తదితరులు నిషేధం నేపథ్యంలో మళ్లీ అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వచ్చింది. నో అదర్ గో! అజ్ఞాతం లేదా చెరశాల! 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ స్టేట్‌పై పోలీసు చర్య జరిగింది. నిజాం బేషరతుగా లొంగిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను రాజప్రముఖ్‌గా సంతృప్తిపరచింది. కమ్యూనిస్ట్‌లు జైళ్లల్లోనే. 1951 అక్టోబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధపోరాటాన్ని విరమించింది. 1952లో భారత ప్రభుత్వం తొలి సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున కమ్యూనిస్ట్‌లు పోటీ చేశారు.
నల్లగొండలో క్లీన్‌స్వీప్..
ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన రావి, లోక్‌సభ, శాసనసభ స్థానాలు రెండింటికీ పీడీఎఫ్ తరఫున పోటీ చేశారు. రెండుచోట్లా దిగ్విజయం సాధించారు. భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటే రావి అత్యధికంగా ఓట్లు పొందడం అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండేవి. పార్టీ అన్నిటినీ గెలుచుకుంది నల్లగొండ జిల్లాలోనే! రావి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు! రావి ప్రభావక్షేత్ర విస్తృతికి ఇదొక ఉదాహరణ! 1957 ఎన్నికలొచ్చాయి. గత ఎన్నికల్లో పీడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలను విఫలం చేసిన కాంగ్రెస్‌పై ఎలాగైనా పైచేయి సాధించాలని భావించాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఇతర మిత్రపక్షాలు. ఆ క్రమంలో రావి నారాయణరెడ్డిని అసెంబ్లీకి పోటీకి నిలిపాయి. ఆయన ప్రత్యర్థి ఎవరు? వి.రామచంద్రారెడ్డి! ఆయన త్యాగం చేసిన నూరెకరాలతోనే వినోభావే భూదానోద్యమానికి పోచంపల్లిలో శ్రీకారం చుట్టారు. రావి భార్యకు రామచంద్రారెడ్డి స్వయానా అన్న! ప్రజాదరణలో ఎవరు తీసిపోతారు?! రావి ఎనిమిదివేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు ఉదాత్త భావనలతో గట్టిగా కృషిచేసిన వ్యక్తి రావి నారాయణరెడ్డి.
పెన్షన్లు ఎప్పుడు..
రావి నారాయణరెడ్డి పదహారణాల నాస్తికుడు. కుటుంబసభ్యులు మందిరానికి వెళ్తే కాదనని ప్రజాస్వామ్యవాది. రావి తన వివాహానంతరం ఒక విల్లు రాశారు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించరాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని కోరారు! తర్వాత మార్చారు. ఆదర్శాన్నయినా రుద్దాలా? అనుకున్నారు. అది తన అభిప్రాయం మాత్రమేనని ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ సవరించారు. భార్య మరణించిన అరవై ఏళ్లకు 1991 సెప్టెంబర్ 7న రావి మరణించారు. తన అస్తికలను గంగానదిలో కలపవద్దని పొలంలో చల్లితే చాలని అన్నారు. ఆ మేరకు వారసులు పచ్చని పొలాల్లో రావి ‘విభూది’ని చల్లారు. భూస్వామిగా జన్మించి ఆ వ్యవస్థను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా జీవించిన రావి నారాయణరెడ్డి, తన సహచరుడు చెన్నమనేని రాజేశ్వరరావుతో అన్న చివరి మాటలు ఏమిటో తెలుసా? ‘తెలంగాణ పోరాటయోధులకు పెన్షన్‌లు ఎప్పటిలోగా వస్తాయి?’
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి