ఫుట్‌బాల్ లెజెండ్ | Indian Super League (football) began | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ లెజెండ్

Published Mon, Oct 13 2014 12:27 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఫుట్‌బాల్ లెజెండ్ - Sakshi

ఫుట్‌బాల్ లెజెండ్

ఇండియన్ సూపర్ లీగ్ (ఫుట్‌బాల్) సందడి మొదలైంది. బరిలో ఎనిమిది జట్లున్నా అందులో మన ‘హైదరాబాద్’ లేదు. ఒకప్పుడు భారత ఫుట్‌బాల్‌ను శాసించిన భాగ్యనగరం ఇప్పుడు జ్ఞాపకాలకే పరిమితమైంది. ఒలింపిక్స్‌లో పెద్దసంఖ్యలో పాల్గొనటంతో పాటు ఒక తరంలో దిగ్గజాల్లాంటి క్రీడాకారుల్ని అందించిన ఘనత నగరం సొంతం. అలాంటి అత్యుత్తవు ఆటగాళ్లలో ఒకరు.. హ్యాట్రిక్ గోల్స్‌తో భాగ్యనగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ క్రియేట్ చేసిన షబ్బీర్ అలీ. హైదరాబాద్ ఫుట్‌బాల్ వేదికపై ఆటగాడిగా, కోచ్‌గా రెండు పాత్రలూ సమర్థంగా పోషించిన వన్ అండ్ ఓన్లీ ప్లేయుర్ అలీ.
 
చార్మినార్ సమీపంలోని ‘దారుషిఫా’ ఫుట్‌బాల్ అభిమానుల అడ్డా. అక్కడి ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ అబ్బాసీ యూనియన్ మైదానంలో ‘ఫుట్‌బాల్’చుట్టూ పరుగెత్తని పిల్లలుండరు. అలాంటి చోట పుట్టి, పెరిగిన షబ్బీర్ అలీ.. సహజ ప్రతిభతో 1972లో తొలిసారి భారత యూత్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

రెండేళ్ల నిలకడైన ఆట తర్వాత 1974లో యూత్ జట్టుకు కెప్టెన్ అయ్యారు. అతని సారథ్యంలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో జట్టు సంయుక్త విజేతగా నిలిచింది. ఇందులో 5 గోల్స్ చేసిన కెప్టెన్ టోర్నీలో టాప్‌స్కోరర్‌గా నిలిచారు. వెంటనే సీనియర్ టీమ్‌లో స్థానం దక్కించుకున్న అలీ 12 ఏళ్ల పాటు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగారు. 1981-84 మధ్యలో మూడేళ్ల పాటు భారత జట్టు కెప్టెన్‌గానూ ఉన్నారు.

గోల్స్ వర్షం...
100 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్‌లో 35 గోల్స్ చేసిన అలీ, ఇప్పటికీ భారత టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్నారు. 1976లో కౌలాలంపూర్‌లో జరిగిన మెర్డెకా కప్‌లో షబ్బీర్ అలీ తొలి 35 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశారు. భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో హ్యట్రిక్ చేస్తే... వీరిలో వేగంగా గోల్స్ చేసిన రికార్డు అలీ సొంతం.

సూపర్ లీగ్ కోచ్...
ఆటగాడిగా రిటైర్ అయ్యాక 1985లో షబ్బీర్ అలీ శిక్షకుడిగా కొత్త అవతారం ఎత్తారు. 1991లో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జాతీయ లీగ్ విజేతగా నిలవడంలో ఆయనదే ప్రధాన పాత్ర.  1997-99 మధ్య గోవాలోని సాల్గావ్‌కర్ క్లబ్‌కు కోచ్‌గా సాధించిన విజయాలతో భారత్‌లోని టాప్ కోచ్‌లలో ఒకరిగా షబ్బీర్ అలీ పేరు మార్మోగింది. రెండేళ్ల వ్యవధిలో సాల్గావ్‌కర్ జట్టు గోవా ప్రొఫెషనల్ లీగ్, ఇండియన్ సూపర్ కప్, నేషనల్ లీగ్, రోవర్స్ కప్, డ్యురాండ్ కప్, సూపర్ కప్ టైటిల్స్ గెలుచుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
 
భారత జట్టుతోనూ...

1995లో చెన్నైలో జరిగిన శాఫ్ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టుకు అలీ టెక్నికల్ డెరైక్టర్. ఆ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఇక జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో కోచ్‌గా అలీది ప్రత్యేకమైన పాత్ర. ఆయన శిక్షణలో 11 ఏళ్ల విరామం తర్వాత బెంగాల్ జట్టు వరుసగా రెండుసార్లు సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది.
 
బెంగాల్ బంధు

హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ప్రాభవం తగ్గిపోవడంతో   ఫుట్‌బాల్‌కు ప్రాణమిచ్చే బెంగాల్‌తో ఆయనకు అనుబంధం పెనవేసుకుంది. 1994లో బెంగాల్ ప్రభుత్వం ఆయన్ను ఫిఫా ప్రపంచకప్‌కు పరిశీలకుడిగా పంపింది. ప్రభుత్వం తరఫున ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. ఇదే ఏడాది బెంగాల్ రాష్ట్ర రెండో అత్యుత్తమ ప్రభుత్వ పురస్కారమైన బంగ భూషణ్ అవార్డూ వరించింది. కేంద్ర ప్రభుత్వం 2011లో అలీని ధ్యాన్‌చంద్ అవార్డుతో సత్కరించింది.
 
‘పద్మశ్రీ’ వరించాలని ఆశ
‘ఫుట్‌బాల్‌పై ఉన్న ప్రేమ, పిచ్చి నన్నీ స్థాయికి చేర్చింది. ఇండియన్ సూపర్ లీగ్‌తో ఆటపై ఆసక్తి పెరుగుతుందని నా నమ్మకం. 2017లో భారత్‌లో జరిగే అండర్-17 ప్రపంచకప్ కొత్త శకానికి నాంది పలుకుతుంది. సిటీలో ఫుట్‌బాల్ గత వైభవాన్ని అందుకోవాలనేది నా కోరిక. పద్మశ్రీ పురస్కారం రాలేదన్న అసంతృప్తి వెంటాడుతోంది’.
 
- షబ్బీర్ అలీ, ఫుట్‌బాల్ కోచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement