పార్టీలో విప్లవ లక్షణాలు తగ్గాయ్!
♦ సీపీఎంలో అంతర్మథనం
♦ ఇకపై ఉద్యమ నేపథ్యం ఆధారంగానే సభ్యత్వం
♦ ప్రస్తుత సభ్యుల వడపోత
♦ తెలంగాణలో ఎదగడానికి ఎక్కువ అవకాశం
సాక్షి, హైదరాబాద్: పార్టీలో కమ్యూనిస్టు, విప్లవ లక్షణాలు తగ్గిపోవడం, కేడర్‌లో క్రమశిక్షణారాహిత్యం చోటుచేసుకోవడంపై సీపీఎంలో అంతర్మథనం సాగుతోంది. సంస్థాగత లోపాలు, లోటుపాట్లను అధిగమించడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడే పార్టీగా సభ్యులకు వామపక్ష భావాలు ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. పార్టీకి, కార్యకర్తలు, నాయకులకు అలవడిన అవలక్షణాలు, గత 25 ఏళ్లలో బూర్జువా పార్టీలతో పొత్తుకారణంగా అంటిన మకిలిని వదిలించుకోవాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో బలపడేందుకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని.. ఇటీవల ముగిసిన కోల్‌కతా ప్లీనంలో పార్టీ నాయకత్వం అంచనాకు వచ్చింది.
ఇకపై ప్రజాసమస్యలు, ఇతరత్రా అంశాలపై పాల్గొన్న ఉద్యమ నేపథ్యం, క్రమశిక్షణ ప్రాతిపదికన ప్రాథమిక స్థాయిలో పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న సభ్యులను కూడా ఆయా అంశాల ప్రాతిపతికన జల్లెడపట్టాలని తీర్మానించింది. 2017 నాటికి పార్టీ మొత్తం సభ్యత్వాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వం తగ్గినా ఫరవాలేదని భావిస్తోంది.
తెలంగాణలో బలపడేందుకు...
రాజకీయంగా ఎదగడానికి ఎక్కువ అవకాశాలున్న రాష్ట్రంగా తెలంగాణను సీపీఎం జాతీయ నాయకత్వం గుర్తించింది. రాష్ట్రంలో బలపడేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలనే రాష్ట్ర నాయకత్వం ఆలోచనలకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌లోనే నాలుగోవంతుకు పైగా రాష్ట్ర జనాభా ఉండటంతో ఇక్కడ వేళ్లూనుకోవడం కీలకమనే అంచనాకు వచ్చింది. గతంలో చేపట్టిన బీసీ సబ్‌ప్లాన్, మైనారిటీ రిజర్వేషన్లు ఇతర సామాజిక ఉద్యమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ)ను బలోపేతం చేయాలనే రాష్ట్ర పార్టీ ఆలోచనను జాతీయ నాయకత్వం బలపరిచింది.
అదేవిధంగా క్రైస్తవ మైనారిటీల కోసం ప్రత్యేకంగా సంఘం లేదా కమిటీని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలు, కొంతమేర బలంగా ఉన్న వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. కాగా, బడ్జెట్‌లో బలహీన వర్గాల సంక్షేమానికి తగిన కేటాయింపులు చేయాలని, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో భారీ ర్యాలీని నిర్వహించాలని రాష్ర్ట పార్టీ నిర్ణయించింది.