పారదర్శక ద్రావకంతో చర్మం మాయం
సైంటిస్టుల తాజా ఘనత
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు!
అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు...
ఇలా సాధించారు...
టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది.
దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు.
రక్తనాళాలన్నీ కన్పించాయి
ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
లాభాలెన్నో...
మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
→ రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.
→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది.
→ ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది.
→ లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.
కొన్నిపద్ధతులున్నా
కణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.
కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment