ఎరుపెక్కిన వెలుగోడు
Published Fri, Jan 20 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
- చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
- వేడుకలకు హాజరైన కమ్యూనిస్టు అగ్రనాయకులు
వెలుగోడు: విప్లవ సేనాని, కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన కమ్యూనిస్టు నాయకులతో పట్టణంలో సందడి నెలకొంది. అరుణోదయ కళాకారుల విప్లవ గీతాలు, నృత్య ప్రదర్శనలతో పట్టణ ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు, అరుణోదయ కళాకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. పురవీధుల గుండా విప్లవ గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఆత్మకూరు రోడ్డులోని చండ్ర పుల్లారెడ్డి స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి, సీపీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చండ్ర పుల్లారెడ్డి అమర్‌హై..జోహార్ సీపీ అంటూ నినదించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శత జయంతి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమెక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాన్యా మాట్లాడుతూ వెలుగోడులో జన్మించిన చండ్ర పుల్లారెడ్డి జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. తన జీవితాన్ని ప్రజా సేవకు, పోరాటాలకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిట్టిపాడు వెంకటేశ్వర్లు, ప్రగతిశీలా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, రాష్ట్ర నాయకులు సాగర్, ప్రసాద్, మోజేష్, ఉరుకుందరావు, రామకృష్ణ, గనిబాబు తదితరులు పాల్గొని చండ్ర పుల్లారెడ్డి పోరాటాలను కొనియాడారు.
Advertisement