velugodu
-
నంద్యాల: కోతుల పోట్లాట.. మనిషి ప్రాణం పోయింది
క్రైమ్: నంద్యాల జిల్లా వెలుగోడులో విషాదం చోటు చేసుకుంది. కోతుల పోట్లాటలో ఓ వ్యక్తి బలయ్యాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై రెండు కోతులు పోట్లాడుకోగా.. ఒక కోతి మరో కోతిపైకి ఇటుకను విసిరింది. అది కిందపడి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడ్ని రఫీగా గుర్తించారు పోలీసులు. కూరగాయల కోసం ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో రఫీపై కోతి విసిరిన ఇటుక పడింది. రఫీకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
తొణికిసలాడుతున్న జలాశయాలు
నంద్యాల: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే నిండింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70అడుగులు నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 191.6512టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 50,927 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సగటున 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో వివిధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు ఆలస్యం చేయకుండా ఖరీఫ్ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నంద్యాల జిల్లాలోని గోరుకల్లు, అవుకు, వెలుగోడు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి లింకు ఛానల్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్‌కు 14వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వెలుగోడు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.418 టీఎంసీలు నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. ఎస్సార్బీసీ చరిత్రలోనే ఇప్పటి వరకు జూలై నెలలో కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. అయితే గోరుకల్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 10 టీఎంసీలు . ప్రస్తుతం 5 టీఎంసీలు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చాక, గేట్లు ఎత్తిన తర్వాతనే ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదిలేవారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తకముందే రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో జూలై మొదటి వారంలోనే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బానకచర్ల నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌కు 9వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.184 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.184టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుకు రిజర్వాయర్ కింద అధికారికంగా, అనధికారికంగా 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీ కెనాల్, కుందూకు సమృద్ధిగా నీరు.. సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో కేసీ కెనాల్, కుందూనదిలో పుష్కలంగా సాగునీరు ప్రవహిస్తోంది. అధికారులు కేసీ కెనాల్ కు వారం క్రితం 14వేల క్యూసెక్కులు నీరు వదలగా ప్రస్తుతం 800 క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. కుందూనదిలో ప్రస్తుతం 1250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) సాగునీటికి ఇబ్బంది ఉండదు ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ పంటలకు సంవృద్ధిగా నీరు అందజేస్తాం. గత మూడు సంవత్సరాలుగా రైతులకు సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై నెలలోనే భారీగా వరద నీరు రావడంతో దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్లను నీటితో నింపుతున్నాం. ఖరీఫ్ పంటలు వేసే రైతులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంటలు వేసుకోవాలి. ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – శేఖర్‌రెడ్డి, జలవనరుల శాఖ ఎస్ఈ, నంద్యాల -
అయ్యో.. గోమాతలారా..
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్‌లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్‌లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డీఎల్బీ రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జగన్మోహన్, తహసీల్దార్ మహమ్మద్ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీను, ఆర్ఐ రామాంజనేయులు, వీఆర్వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
భర్తను చితకబాది భార్యపై అఘాయిత్యం
సాక్షి, కర్నూలు: జిల్లాలోని వెలుగోడు మండలం జమ్మినగర్ తండాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తను లాక్కెళ్లిన నలుగురు దుండగులు అతన్ని చితకబాదారు. అతని ఎదుటే భార్యపై అఘాయిత్యం చేశారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు. గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు వెలుగోడు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. (చదవండి: ఇద్దరు మైనర్లపై 11 మంది గ్యాంగ్ రేప్) ఘటనపై మహిళా కమిషన్ ఆరా వెలుగోడు మండలం జిమ్మినగర్ తండాలో జరిగిన మహిళపై దుండగుల సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర మహిళా కమీషన్ ఆరా తీసింది. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. -
ఎరుపెక్కిన వెలుగోడు
- చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం - వేడుకలకు హాజరైన కమ్యూనిస్టు అగ్రనాయకులు వెలుగోడు: విప్లవ సేనాని, కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన కమ్యూనిస్టు నాయకులతో పట్టణంలో సందడి నెలకొంది. అరుణోదయ కళాకారుల విప్లవ గీతాలు, నృత్య ప్రదర్శనలతో పట్టణ ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు, అరుణోదయ కళాకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. పురవీధుల గుండా విప్లవ గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఆత్మకూరు రోడ్డులోని చండ్ర పుల్లారెడ్డి స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి, సీపీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చండ్ర పుల్లారెడ్డి అమర్హై..జోహార్ సీపీ అంటూ నినదించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శత జయంతి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమెక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాన్యా మాట్లాడుతూ వెలుగోడులో జన్మించిన చండ్ర పుల్లారెడ్డి జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. తన జీవితాన్ని ప్రజా సేవకు, పోరాటాలకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చండ్ర పుల్లారెడ్డి శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిట్టిపాడు వెంకటేశ్వర్లు, ప్రగతిశీలా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, రాష్ట్ర నాయకులు సాగర్, ప్రసాద్, మోజేష్, ఉరుకుందరావు, రామకృష్ణ, గనిబాబు తదితరులు పాల్గొని చండ్ర పుల్లారెడ్డి పోరాటాలను కొనియాడారు. -
వెలుగోడులో జాతీయ సదస్సు
- ఈ నెల 28, 29 తేదీల్లో కార్యక్రమం - శ్రీనీలం సంజీవరెడ్డి డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏర్పాట్లు వెలుగోడు(శ్రీశైలం): ఈ నెల 28, 29 తేదీల్లో వెలుగోడు శ్రీ నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన జాతీయ విద్యా సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడ్వాన్స్డ్ ఇన్ గ్రీన్ కెమిస్ట్రీ అనే అంశంపై తలపెట్టిన జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు హాజరవుతుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు చైర్మన్‌గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రాంభూపాల్‌రెడ్డి, కో-చైర్మన్‌గా బి.రాబేశ్వర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కెమిస్ట్రీ అధ్యాపకులు టీఎస్.రాజేంద్రకుమార్ ఎంపికయ్యారు. వీరు గురువారం సదస్సు ఏర్పాట్లను సమీక్షించారు. సదస్సులో పాల్గొనే వారు ఫోన్(9490974069)లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. -
వీబీఆర్‌కు జలకళ
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ జలకళతో కళకళలాడుతోంది. నాలుగేళ్ల తరువాత మొదటిసారిగా వీబీఆర్‌లో 14 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కృష్ణా జలాలు భానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి వీబీఆర్‌కు వెయ్యి క్యూసెక్కులు, గాలేరు నుంచి 1719 క్యూసెక్కలు బుధవారం వచ్చి చేరినట్లు తెలుగు గంగ జేఈ విజయ్‌కుమార్ తెలిపారు. వీబీఆర్‌లో 263.260 మీటర్ల వద్ద 863.712 అడుగుల నీటిమట్టంతో 14.550 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన వివరించారు. వీబీఆర్ నుంచి చైన్నై కాల్వకు 350 క్యూసెక్కులు, వన్‌ఆర్ తూమ్ నుంచి 20, వన్ఎల్ తూమ్ నుంచి 15 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నట్లు జేఈ తెలిపారు. వీబీఆర్ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.550 టీఎంసీల నీరు చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'పేద విద్యార్థుల ముంగిటకు పెద్ద చదువులు'
కర్నూలు : మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం కర్నూలు జిల్లా వెలుగోడులో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రైతులు, విద్యార్థుల గురించి చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘటన వైఎస్ఆర్దేనని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందేలా చేశారని విజయమ్మ పేర్కొన్నారు. మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి.. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న జనం ఆమెను చూసేందుకు దారి పొడవునా బారులు తీరారు.