కోదాటి రాజమల్లు
చెన్నూర్: మహాత్ముడి భావజాలానికి ఆకర్షితుడైన ఓ బాలుడు.. ఇంటిని వదిలి పోరుబాట పట్టాడు. స్వశక్తితో చదివి తిరిగి స్వస్థలానికి చేరుకొని స్థానికంగా కొనసాగుతున్న ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనోద్యమంలో కీలకంగా వ్యవహరించిన అతడు.. ఒకసారి ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి అనితరసాధ్యుడిగా గుర్తింపు పొందాడు. చరిత్రే తన పేరును సగౌరవంగా ఉచ్ఛరించేలా చేసుకున్న ఉత్తమ ప్రజాప్రతినిధి ‘కోదాటి రాజమల్లు’ గురించి సంక్షిప్తంగా..
బాల్యం..
నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలుకా అలిపురం చెందిన కోదాటి రాజయ్య, రాజవ్వ దంపతులకు 1924లో కోదాటి రాజమల్లు జన్మించారు. అప్పట్లో గ్రామంలో ప్లేగు వ్యాధి విజృంభించడంతో రాజమల్లు కుటుంబం ఖమ్మం జిల్లాలోని పునరావాస కేంద్రానికి వెళ్లిపోయి, కొంతకాలం అక్కడే ఉండిపోయింది. రాజమల్లు ఏడాది వయసున్నప్పుడు తండ్రి రాజయ్య ఉపాధి నిమిత్తం కొత్తగూడెంలోని ఇల్లంతకుంటకు వలసవచ్చారు. అక్కడ కూడా ఉపాధి దొరక్కపోవడంతో బెల్లంపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. బెల్లంపల్లి బొగ్గు గనుల్లో రాజమల్లు తండ్రి రాజయ్య, తల్లి రాజమ్మ కలిసి పని చేశారు. కొంతకాలానికి రాజయ్యకు సింగరేణి గనిలో ఫోర్‌మన్‌గా ప్రమోషన్ రావడంతో రాజమ్మను పని మాన్పించి, కొడుకు రాజమల్లు బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు.
పోరాట ప్రస్థానం..
చిన్ననాటి నుంచే రాజమల్లు పరాయి పాలనను వ్యతిరేకించేవాడు. నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాడు. ఈ క్రమంలో మహాత్మగాంధీ వార్ధా ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు బెల్లంపల్లి స్టేషనులో రైలు ఆగినప్పుడు కాసేపు అక్కడ ప్రసంగించారు. ఆ ప్రసంగంతో ఉత్తేజితుడైన రాజమల్లు తర్వాతి కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలను చైతన్యపర్చడంలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయా సంఘాల నాయకులతో కలిసి రహస్యంగా సమీప అడవుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించేవాడు. ఇదంతా రాజమల్లు తండ్రి రాజయ్యకు తెలియడంతో, ఆయన కొడుకు మందలించాడు. దీంతో తన ఉద్యమానికి కుటుంబం అడ్డురాకూడదని భావించిన రాజమల్లు ఎవరికీ చెప్పకుండా ఇంటిని వదిలి నేటి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీనాలీ చేస్తూ బతకడమే కాకుండా బీఏ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత తిరిగి బెల్లంపల్లిలోని సొంతింటికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో తన చిన్ననాటి మిత్రుల ద్వారా సింగరేణి కార్మికుల కష్టాల గురించి తెలుసుకున్నాడు. అప్పుడే కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ఓ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సింగరేణి కార్మికులు యాజమాన్యాన్ని వ్యతిరేకించేలా వారిని చైతన్యపర్చాడు. రాజమల్లు చేస్తున్న తిరుగుబాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, అతన్ని నిర్భంధించేందుకు పూనుకోవడంతో నిరంతరం నిలకడలేని ప్రయాణాలు చేస్తూ వివిధ వేషాల్లో తలదాచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమల్లును మహారాష్ట్ర ప్రాంతంలో గుర్తించి అక్కడి ఔరంగబాద్ జైలులో నిర్బంధించారు. అనంతరం అండమాన్ జైలుకు తరలిస్తుండగా రాజమల్లు తప్పించుకొని కొంతకాలం రహస్య జీవనం సాగించాడు. 1948లో నిజాం పాలన అంతమవడంతో రాజమల్లు తిరిగి తన తోటి ఉద్యమకారులైన కేశవరావు, అర్జునరావు, వెంకటరావు, పాపయ్య, ఎ.రామిరెడ్డి, కేవీ మీన, పి.మాధవరెడ్డి, విశ్వనా«థ్, సోది రామయ్యతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి బెల్లంపల్లి చేరుకొని సింగరేణిలో టైమ్ కీపర్‌గా పని చేశాడు.
రాజకీయ పథంలో..
1952లో రాజకీయ ప్రవేశం చేసిన రాజమల్లు అదే ఏడాది కాగజ్‌నగర్, చెన్నూర్ ఉమ్మడి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసి ఎస్సీ రిజర్వేషన్‌తో రాజమల్లు, జనరల్ కోటాలో విశ్వనాథసూరి గెలుపొందారు. అనంతరం 1962, 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుస ఘన విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. తర్వాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజమల్లు చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పని చేసి.. చెన్నూర్, బెల్లంపల్లిలో ప్రాంతాల్లో పలు ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు.
కార్మికులకు కొండంత అండగా..
ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం కూడా రాజమల్లు కృషి చేశారు. బొగ్గు గని కార్మిక చరిత్రలో నిలిచిపోయేలా 1956లో ఆయన నేతృత్వంలో ఓ సుదీర్ఘ పోరాటం కూడా జరిగింది. రాజమల్లు ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం 57 రోజులపాటు సమ్మె చేశారు. కార్మికులకు వేతనం పెంపు, మృతి చెందితే నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు 47 డిమాండ్లు నెరవేర్చాలని రాజమల్లు నిరహార దీక్షకు దిగారు. సమ్మె కొనసాగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు రెచ్చిపోయి సింగరేణి సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు కార్మికులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్‌లు చేసినా రాజమల్లు సైన్యం దీక్షను విరమించకపోవడంతో సింగరేణి యాజమాన్యమే 21 రోజుల తర్వాత దిగివచ్చి 37 డిమాండ్లను అంగీకరించింది. ఇలా తన జీవితమంతా పోరాట పథంలో గడిపిన కోదాటి రాజమల్లు ఎంపీగా కొనసాగుతుండగానే 1983లో ఫిబ్రవరి 20న గుండెపోటుతో ఆకస్మికంగా తనువు చాలించారు. ఆయనకు భార్యతోపాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment