మెదక్‌లో...మోదం కాస్త ఖేదం | Medak Parliamentary Constituency Review | Sakshi
Sakshi News home page

మెదక్‌లో...మోదం కాస్త ఖేదం

Published Sun, Mar 17 2019 6:32 PM | Last Updated on Sun, Mar 17 2019 6:39 PM

Medak Parliamentary Constituency Review - Sakshi

మహామహులను పార్లమెంట్‌కు పంపించిన చరిత్ర మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన 17 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించిన వారు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినా.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే వాదన కొన్ని ప్రాంతాల్లో ఉంది. మరికొన్ని చోట్ల కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరిగిందని ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని హామీ ఇవ్వడంతోపాటు, పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామని ప్రజలకు చెబితే తప్ప ఓట్లు రాబట్టుకోలేరని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితులపై సాక్షి ‘స్కానింగ్‌’ ...

సిద్దిపేట...  అభివృద్ధికి చిరునామా...

నియోజకవర్గాల పునర్‌ విభజనకు ముందు సిద్దిపేట నియోజకవర్గం గజ్వేల్, దొమ్మాట, కంటోన్మెంట్‌ను కలుపుకొని స్వతంత్ర నియోజకవర్గంగా బాసిల్లింది. అయితే ఇక్కడి నుండి గెలిచిన వెంకటస్వామి ఇతరులు కేంద్ర మంత్రిగా కొనసాగినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గాంలో అభివృద్ధి పరవళ్లు తొక్కింది. వాటిలో కొన్ని ఇలా...

  • సిద్దిపేట పట్టణంలో ఇటీవల పాస్‌పోర్ట్‌ రీజనల్‌ కేంద్రం ప్రజలకు సేవలందిస్తోంది.
  • సిద్దిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైన్‌. జిల్లాలో 87 కిలోమీటర్ల పొడువున కొనసాగుతున్న మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే మార్గానికి మార్గం సుగమం. వేగవంతంగా సర్వే పనులు, భూసేకరణ, గజ్వేల్‌ నుండి సిద్దిపేట వరకు లైన్‌ పనులు కొనసాగడం, సిద్దిపేట నియోజకవర్గంలోని పొన్నాల నుంచి జక్కాపూర్‌ వరకు 29 కిలోమీటర్ల పొడువునా రైల్వేలైన్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
  • సిద్దిపేట నియోజకవర్గాన్ని కలుపుతూ రెండు జాతీయ రహదారుల మంజూరు ప్రక్రియతో రాష్ట్ర రాజధాని నుంచి కరీంనగర్‌ జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు మార్గం సుగమనం అయ్యింది. సిద్దిపేట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం నిధులలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం కొనసాగుతోంది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పథకం మహత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సద్వినియోగం చేసుకొన్నారు. 
  • సిద్దిపేట జిల్లా కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన కేంద్రియ విద్యాలయం  మంజూరు, తరగతుల కోనసాగింపు.
  • కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన బీడీ కార్మికులకు గృహవసతి కింద పట్టణంలో వెయ్యి మంది లబ్ధిదారుల గుర్తింపు, చేనేత కార్మికులకు సంక్షేమ పథకాల అమలు.
  • అయితే ఈ పథకాలు అన్ని సక్రమంగా ముందుకు సాగాలంటే కేంద్రలో ఈ ప్రాంతం గురించి మాట్లాడే నాయకుడు కావాలి అనేది ఇక్కడి ప్రజల మనోభావం. ఇటీవల జరిగిన ఎన్నికలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మాజీ మంత్రి హరీశ్‌రావు గెలుపొండం గమనార్హం. 

సిద్దిపేట:

పురుషులు 1,08,155
మహిళలు 1,09,961
ఇతరులు 12
మొత్తం ఓటర్లు 2,17,831

పటాన్‌చెరు... కాలుష్యమే అసలు సమస్య

కాలుష్యం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్‌చెరు. పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు వదులుతున్న వాయు, జల కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా కాలుష్యమయంగా మారాయి. భూగర్భం నుంచి పసుపు రంగులో నీరు బయటకు వస్తుందంటే కాలుష్యం సమస్య ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కాలుష్యంపై గ్రీన్‌ పీస్‌ సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
రోడ్లు: పారిశ్రామిక వాడలు కావటంతో సరైన జాతీయ రోడ్లు లేవు. ప్రస్తుతం ఉన్న రోడ్లు గుంతలుగా మారడంతో జాతీయ స్థాయిలో వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడి రోడ్లను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది.
అంగన్‌వాడీ కేంద్రాలు: పారిశ్రామిక వాడలు కావటంతో చిన్నారులకు సరైన పోషక ఆహారం అందటం లేదు. సరిపడా అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవటంతో చిన్నారులు ప్రాథమిక విద్యకు, పోషక ఆహారానికి దూరవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
రైలు మార్గం: దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు పటాన్‌చెరు నియోజకవర్గంలో నివాసం ఉంటారు. పటాన్‌చెరుతో పాటు బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి లాంటి పారిశ్రామిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. పటాన్‌చెరుకు రైలు మార్గం లేదు. దీంతో పారిశ్రామికంగా సరుకుల రవాణ కష్టమవుతుంది. పారిశ్రామిక వేత్తలు, పనిచేసే కార్మికులకు కూడా రైలు మార్గం లేదు. ఎంఎంటీఎస్‌ లాంటి మామూలు రైలు మార్గం కూడా లేకపోవటంతో ఇక్కడి ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పటాన్‌చెరు

పురుషులు 1,54,879
మహిళలు 1,44,536
ఇతరులు 13
మొత్తం ఓటర్లు 2,99,428

గజ్వేల్‌.. జిగేల్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో పోటీ ఇక ఏకపక్షమేనని భావిస్తున్నారు. ఈ సెగ్మెంట్లో కీలక వ్యక్తిగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమనే ధీమాలో టీఆర్‌ఎస్‌ ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. సీఎం దిశానిర్దేశం మేరకు నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూపతిరెడ్డి నేతృత్వంలో నాయకులంతా పనిచేస్తున్నారు. అభివృద్ధితో పాటు ప్రతిపక్షంలో బలమైన నేతను టీఆర్‌ఎస్‌లోకి రప్పించడం ద్వారా అనుకున్న మెజార్టీ సాధిస్తామనే నమ్మకం టీఆర్‌ఎస్‌లో ఉంది.

ప్రధానంగా సీఎం నియోజకవర్గం కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే రైల్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డు పనులు పూర్తి దశకు చేరుకోగా.. మరో ఔటర్‌ రింగ్‌రోడ్డు గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి వెళ్తుంది. ఇది పూర్తయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్‌లోనూ కుతూహలం కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఎప్పటిలాగే తమకున్న సాంప్రదాయ ఓటింగ్‌తో పాటు వ్యతిరేక ఓట్లను కూడా భారీ ఎత్తున సాధించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. 

గజ్వేల్‌

పురుషులు 1,24,358
మహిళలు 1,23,720
ఇతరులు 2
మొత్తం ఓటర్లు 2,48,080

సంగారెడ్డి... నీరిస్తే మేలు...

ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి తాగునీరు, సాగునీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రాంతంలో విద్యావంతులు అధికంగా ఉన్నా వారికి ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేక పరిశ్రమల్లో రోజువారి కూలీలుగా పనిచేసే వారు అధికంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 

  • జిల్లాలో భూగర్భ జలాలు ఈ స్థాయిలో అడుగంటడానికి ప్రధాన కారణం సింగూర్‌ జలాలు 15 టీఎంసీలను దిగువ ప్రాంతానికి తరలించడం.
  • దీంతో ఘణపురం, వివిధ ఆయకట్టు కింద ఉన్నరైతులు యాసంగి పంటను సాగు చేసుకోకపోతున్నారు.
  • సంగారెడ్డి పట్టణానికి సమీపంలో మంజీరా రిజర్వాయర్‌ ఉన్నా అది ఎండిపోవటంతోనే పట్టణంలో నీటి కష్టాలు అన్న భావం ఉంది. ఇవన్ని కూడా రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపనున్న అంశాలు. వీటిపై ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలోకి కొన్ని విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినా, నీరుపేద రైతులకు అంతంత మాత్రంగానే ప్రయోజనం చేకూరింది. ఎక్కువ భూమి ఉన్న సంపన్న వర్గాలకు ఎక్కువ ప్రయోజనం జరిగిందన్న భావన ప్రజల్లో ఉంది. నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. ఇటువంటి ఆరోపణలే గత శాసనభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డికి వరంగా మారాయి. అందుకోసమే నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 

సంగారెడ్డి

పురుషులు 1,08,395
మహిళలు 1,08,008
ఇతరులు 04
మొత్తం ఓటర్లు 2,16,407

నర్సాపూర్‌... రవాణా రంగం అభివృద్ధి..

నర్సాపూర్, కౌడిపల్లి కేంద్రాలలో ఉన్న సబ్‌ పోస్టాఫీసులకు సరైన భవనాలు లేక అక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. 

  • నర్సాపూర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్సేంజ్‌తో పాటు సబ్‌ డివిజనల్‌ అధికారి కార్యాలయం ఉండగా సిబ్బంది నివసించేందుకు లక్షల రూపాయలు వ్యయం చేసి క్వార్టర్లు నిర్మించారు. కొంత కాలం వాటిలో కొందరు ఉద్యోగులు నివసించినా తరువాత నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటిలో సిబ్బంది ఉండకపోయినా ఇతర అవసరాలకు (ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు) వినియోగించే విధంగా ఏ అధికారి పట్టించుకోనందున ప్రభుత్వ ధనం నిరుపయోగమైందని విమర్శలు వస్తున్నాయి. 
  • మేడ్చల్‌ జిల్లా దుందిగల్‌ ఔటర్‌ రింగు రోడ్డు నుంచి మెదక్‌ మండలం రాంపూర్‌ వరకు సుమారు 68 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జాతీయ రహదారిగా మార్చి 444 కోట్ల రూపాయలు మంజూరు చేయగా సుమారు ఎనిమిది నెలలుగా రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. అయితే రోడ్డు విస్థరణతో ప్రధానంగా నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌ పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న బిల్డింగులను తొలగించేదుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ తమకు నష్టం జరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేసినందున రవాణా మెరుగవుతుందని హర్షం వ్యక్తం చేస్తూనే రోడ్డు మధ్య గుండా డివైడరును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే వీలుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నర్సాపూర్‌...

పురుషులు 1,03,731
మహిళలు 1,06,921
ఇతరులు  06
మొత్తం ఓటర్లు 2,10,658


దుబ్బాక... వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలి

  • దుబ్బాక నియోజకవర్గం మిగతా వాటితో పోలిస్తే అభివృద్ధి కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీటి రంగాలు మరికొంత మెరుగుపడాల్సి ఉంది. వాస్తవంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ ప్రాంతం తాగునీటి కష్టాలు తీరాయి. విద్య, వైద్య పరంగా మెరుగైన సేవలు అందుతున్నాయి. అయితే సాగునీటి కష్టాలు తొలగాల్సి ఉంది. వందల మీటర్ల లోతున ఉన్న నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  
  • నియోజకవర్గంలో 85 శాతం పైగా వ్యవసాయం, బీడి, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు.
  • నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్‌లు 30 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.
  • నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్‌ మండలాల పరిధిలో వ్యవసాయం మొత్తం వర్షాధారంపైనే.. సాగునీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. 
  • చేనేత, బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు జిల్లాలోనే అధికంగా ఉండటం.. వీరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందుతుండటంతో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికే అవకాశం ఉంది.
  • ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డిని 62,50భారీ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలోనే మెజార్టీలో ఏడోస్థానంలో నిలిచారు. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశం ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డిది దుబ్బాక ప్రాంతం. కాబట్టి స్థానికత ఆధారంగ ఓట్లు పడే అవకాశం ఉంది. 

దుబ్బాక

పురుషులు 97,637
మహిళలు 1,00,786
ఇతరులు 0
మొత్తం ఓటర్లు 1,98,423

మెదక్‌...పర్యాటక పురోభివృద్ధి కావాలి

  • పార్లమెంట్‌ నియోజకవర్గం కేంద్రమైనా అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రంగా ఉంది. మెదక్‌ చర్చి, ఏడుపాయల వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నా వాటికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదనే విమర్శలు ఉన్నాయి. 
  • మెదక్‌–అక్కన్నపేట రైల్వేలైన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 
  • 2018 జనవరి నాటికి మెదక్‌–అక్కన్నపేట రైల్వేపనులు పూర్తి కావాల్సింది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 
  • మెదక్‌ పట్టణంలోని సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేయగా, ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 
  • ప్రస్తుతం పనులు మరమ్మతులు చేస్తుండటంతో ఇక్కడ అథ్లేటిక్‌ క్రీడల్లో శిక్షణ పొందే క్రీడాకారులను హైదరాబాద్‌కు తరలించారు. 
  • పనులు పూర్తి అయితేనే తిరిగి క్రీడాకారులు ఇక్కడికి వస్తారు. 
  • ప్రస్తుతం ఓట్ల కోసం వచ్చే నాయకులు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వాల్సి ఉంది. మెదక్‌ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు..ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపిస్తే పనులు వేగంగా జరుగుతాయనే ప్రచారం ఉంది. 

మెదక్‌.. 

పురుషులు   98090
మహిళలు     1,06,353
ఇతరులు   02
మొత్తం ఓటర్లు 2,04,445

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement