
సమస్యలపై నిరంతర పోరాటం
సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నర్సాపూర్: ప్రతి ప్రజా పోరాటంలోనూ కమ్యూనిస్టులే ముందుంటారని, ఇతర పార్టీలన్నీ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ప్రజలను ఉపయోగించుకుంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీపీఎం మెదక్ జిల్లా 12వ మహాసభలు శుక్రవారం నర్సాపూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఏ.మల్లేశం అధ్యక్షత వహించగా, తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, చట్టసభల్లో సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు ప్రజల గొంతుక వినిపిస్తున్నారన్నారు. సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. ఇటు ప్రజాక్షేత్రంలోనూ రాజీలేని పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఏం చేయాలన్నది కేవలం కమ్యూనిస్టులకే తెలుసునన్నారు.
బంగారు తెలంగాణే లక్ష్యమంటున్న టీఆర్‌ఎస్... తన ఆరు నెలల పాలనలో చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల హామీని అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కనీసం రైతు ఆత్మహత్యల నివారణకు కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అందువల్లే కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ రైతుల బలవనర్మణాలు చోటు చేసుకున్నాయన్నారు.
ఇక కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్.. ఇంతవరకు ఆ దిశగా కనీసం ప్రయత్నించలేదన్నారు. ప్రజలను మోసం చేస్తున్న పార్టీలన్నీ అంతమైపోయి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కమ్యూనిస్టులను ప్రజలు గెలిపించే రోజులు వస్తాయని తమ్మినేని వీరభద్రం అన్నారు.
ప్రజల సమస్యలను విస్మరించిన పాలకులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారన్నారు. కార్మిక హక్కులను కాలరాసేందుకు సైతం ప్రయత్నిస్తున్నారని, కార్మిక వ్యతిరేక చర్యలను కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒప్పుకోరన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలే ఎజెండాగా తమ పార్టీ 12వ మహాసభలు కొనసాగుతాయన్నారు.
రెండు రోజుల పాటు పార్టీ ప్రతినిధుల సమావేశం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బహిరంగ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ నాయకులు, ఇతర నాయకులు ఏ. మల్లేశం, రాజయ్య, లక్ష్మిభాయి, యదవరెడ్డి, రాంచందర్, మల్లికార్జున్, మల్లేశ్,నందం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నేసిన కండువాలతో తమ్మినేని వీరభద్రం, చుక్కరాములును సన్మానించారు.
భారీ ర్యాలీ
సీపీఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభ నేపథ్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి చుక్కరాములు ఆధ్వర్యంలో స్థానిక ఎడ్లబజారు నుంచి ర్యాలీ ఆరంభమై సభ వేదిక వరకు కొనసాగింది. ర్యాలీలో మహిళలు బతుకమ్మలు, బోనాలు ఎత్తుకుని పాల్గొన్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో డోలు దెబ్బ కళాకారులు న ృత్యం చేస్తూ పాల్గొన్నారు.
దుబ్బాక చేనేత సంఘం కార్మికులు ట్రాక్టర్‌పై మగ్గం ఏర్పాటు చేసి బట్టలు నేస్తూ పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. గంగపుత్రులు తమ వలతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో కార్మికులు, మహిళలు, ఆయా వర్గాల వారు సీపీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో నర్సాపూర్ మార్మోగింది.