200 నాట్‌ అవుట్‌  | Marx was born on May 5, 1818, two hundred years ago | Sakshi
Sakshi News home page

200 నాట్‌ అవుట్‌ 

Published Sat, May 5 2018 12:11 AM | Last Updated on Sat, May 5 2018 12:11 AM

Marx was born on May 5, 1818, two hundred years ago - Sakshi

నేడు మార్క్స్‌ను తలుచుకోవలసిన సందర్భం. సరిగ్గా రెండు వందల ఏళ్ల క్రితం 1818 మే 5న మార్క్స్‌ జన్మించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అనే మాట వినే ఉంటారు. అది మార్క్స్‌దే! ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అనే మాట కూడా! నిజానికి ఈ మాట శ్రీశ్రీదే కానీ.. 1848లో మార్క్స్‌ రాసిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో తొలి వాక్యంలోని భావన ఇదే. ‘ఇప్పటి వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్రే’ అన్నారు అందులో మార్క్స్‌

డబ్బుల్లేని తండ్రికి కొడుకు
కార్ల్‌ మార్క్స్‌ది జర్మనీ. తండ్రి న్యాయవాది. కేసులైతే వచ్చేవి కానీ, డబ్బులు వచ్చేవి కాదు. అలా పేదరికంలో పెరిగిన మార్క్స్‌ తన భార్యా పిల్లలకూ పేదరికాన్నే వారసత్వంగా ఇవ్వగలిగారు. మార్క్స్‌ చదివింది కూడా న్యాయశాస్త్రమే. కానీ హెగెల్, ఫ్యూయర్‌బాక్‌ల సిద్ధాంతాలు ఆయన్ని ‘సోషల్‌ ఫిలాసఫీ’వైపు దారి మళ్లించాయి. 1841లో మార్క్స్‌ జెనా విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్‌ అందుకున్నారు. తర్వాత 1843లో కొంతకాలం కోలోన్‌లోని ఒక వార్తాపత్రి కకు సంపాదకత్వం వహించారు. అనంతరం భార్య జెన్నీతో కలసి విప్లవభావాలకు నెలవై వున్న పారిస్‌ను చేరుకున్నారు. అక్కడే మార్క్స్‌ అతివాద కమ్యూనిస్టుగా మారారు. ఆ క్రమంలోనే ఏంగెల్స్‌తో ఆయనకు పరిచయం అయింది. మార్క్స్‌ భావజాలాన్ని ప్రమాదకరమైన ధోరణిగా భావించిన ఫ్రాన్సు అతడిని దేశం నుంచి బహిష్కరించింది. అక్కడి నుంచి మార్క్స్‌ బ్రస్సెల్స్‌ చేరుకున్నారు. తర్వాత 1849లో లండన్‌ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.

దిగులుతో కుంగిపోయిన భర్త 
చివరి దశలో మార్క్స్‌ అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఏంగెల్సే మార్క్స్‌ని ఆదుకున్నాడు. 1881లో భార్య మరణించాక మార్క్స్‌ బాగా కుంగిపోయారు. తర్వాత మళ్లీ కోలుకోలేదు. లండన్‌లో ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తున్న సమయంలో ఏంగెల్స్‌ ఎంతో  ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఈ మధ్యాహ్నం వేళ ఒక గొప్ప ఆలోచనాశీలి ఆలోచించడం మానేశాడు. మేము ఆయన చెంతన లేని రెండు నిమిషాల్లోనే మా నుంచి సెలవు తీసుకున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషి, కూర్చున్నట్లుగానే ఈ లోకాన్ని వీడిపోయారు’’ అని ఏంగెల్స్‌ గద్గద స్వరంతో అన్నారు. 

శక్తిమంతుడైన స్నేహితుడు
మార్క్స్, ఏంగెల్స్‌ ఇద్దరూ మంచి మిత్రులు, ఆలోచనాశీలురు. మార్క్స్‌ ప్రభావం ఏంగెల్స్‌పై ఎంతగా ఉండేదంటే ఏంగెల్స్‌ జీవితాంతం మార్క్స్‌ అనుచరుడిగానే ఉండిపోడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి. మార్క్సిజం ఉంది కానీ, ఏంగెలిజం లేదు. వాస్తవానికి కూడా ఏ ఇజాన్నైనా, ఏంగెలిజాన్నయినా తనలో కలుపుకునే శక్తి మార్క్సిజంలో ఉంది. అందుకే మార్క్స్‌ సైద్ధాంతికంగా బలవంతుడయ్యాడు. భౌతికంగా కూడా అతడు బలిష్టుడే. దృఢకాయంతో, పెద్దగా ఛాయలేని శరీరంతో మొరటు మనిషిలా ఉండేవారట మార్క్స్‌!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement