అణుప్లాంట్ వద్దంటూ సంతకాల సేకరణ
Published Sat, Aug 6 2016 6:02 PM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
ద్వారకానగర్: ఆంధ్రాలో అణు విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేయడమేనని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సహయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ఈ మేరకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద శనివారం ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు అభివద్ధి చెందిన అమెరికా దేశాల్లాంటివి విడిచిపెట్టాయని అన్నారు. అమెరికాలో అణువిద్యుత్ కర్మాగారానికి సంబంధించిన పరికరాలు వథాగా వున్నాయని భారత్‌కు వాటిని అమ్మేప్రయత్నంలో ఈ కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని పేర్కొన్నారు. ఇందులో భాగం గానే కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహలు చేస్తోందన్నారు. గుజరాత్‌లో ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తే దానిని తీసుకొచ్చి ఆంధ్రాలో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు మరో నాలుగు కర్మాగారాలకు ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు దీనిని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆందోళనను మరింత ఉద్ధతం చేసేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. జపాన్‌లో జరిగిన అణుబాంబు సంఘటన వల్ల ఇప్పటికీ అక్కడి ప్రజలు సమస్యలు ఎరుర్కొంటున్నారని చెప్పారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల ఉత్తారాంధ్ర ప్రజలు అంగవైకల్యం బారిన పడే ప్రమాదముందని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి డి. మార్కండేయులు, ఎం. పైడిరాజ్, ఎ.విమల, వామనమూర్తి, బేగం, ఎస్. కుమారి, బేగం తదితరలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement