నాడూ నేడూ రేపూ మార్క్సిజం అజేయమే | Sakshi
Sakshi News home page

నాడూ నేడూ రేపూ మార్క్సిజం అజేయమే

Published Sun, May 6 2018 12:42 AM

Karl Marx Marxism forever - Sakshi

అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్‌ ఆర్థికవ్యవస్థను పునరావిష్కరించేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్‌ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి.

కార్ల్‌మార్క్స్‌ జన్మించిన 200 సంవత్సరాల తర్వాత కూడా మార్క్సిజం ప్రాసంగికత గురించి మనం నేటికీ చర్చిస్తున్నామంటేనే ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సిద్ధాంతంగా మార్క్సిజం ప్రాసంగికత తిరుగులేని విధంగా రుజువవుతోందని మనం చెప్పవచ్చు. మార్క్సిస్ట్‌ సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడిన తొలి సోషలిస్టు దేశం సోవియట్‌ యూనియన్‌ ప్రపంచ పటం నుంచి మాయం కావడం, పోలెండ్, తూర్పుజర్మనీ వంటి తూర్పు యూరప్‌కి చెందిన సోషలిస్టు దేశాలు విచ్ఛిన్నమైపోవడం వంటి పరిణామాలతో కమ్యూనిజం వ్యతిరేకులు మార్క్సిజాన్ని కించపర్చడమే కాదు.. దాని ప్రాసంగికతనే తోసిపుచ్చేంతవరకు వెళ్లారు. వియత్నాం, క్యూబా వంటి దేశాలు ఇంకా సోషలిస్టు దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ మార్క్సిజంపై దుష్ప్రచారం కొనసాగించారు.

ఈ దేశాలు కూడా వ్యక్తిగత ఆస్తి విషయంలో కాస్త సడలింపు నిచ్చి, సొంత ఆస్తిని అట్టిపెట్టుకోవడాన్ని కొంతమేరకు అనుమతించడమే కాకుండా అక్కడ చేపట్టిన కొన్ని సంస్కరణలు కూడా అవి ఇక ఏమాత్రం స్వచ్చమైన సోషలిస్టు దేశాలు కావనే అభిప్రాయం కలిగించి మార్క్సిజాన్ని, దాని ప్రాసంగితను తృణీకరించడానికి కారణమయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు అంగీకరించకపోయినప్పటికీ, ప్రస్తుత చైనాను కూడా సోషలిస్టు దేశంగానే చాలామంది భావిస్తున్నారు. అదేసమయంలో సోషలిస్ట్‌ శిబిరమే ఉనికిలో లేదని, మార్క్సిజం ఒక సిద్ధాంతంగా కాలం చెల్లిపోయిందని చెబుతుండటం సరైంది కాదు. మరోవైపున మార్క్సిజం, సోషలిజంలకు ప్రాసంగికతే లేదని, అవి గతించిన చరిత్రలో భాగమైపోయాయని మార్క్సిజం విమర్శకులు ప్రచారం సాగిస్తున్నారు.

దీనికి భిన్నంగా మార్క్సిస్ట్‌ గతితార్కిక పంథాలో చారిత్రక భౌతిక అభివృద్ధి క్రమం సరైందేనని సోషలిస్టు దేశాలు ఆవిర్భవించినప్పటినుంచి రుజువు చేస్తూ వచ్చాయి. పైగా నెలలు నిండకముందే బిడ్డ పుట్టినట్లుగా సోషలిజానికి కావలసిన ముందస్తు షరతులు ఉనికిలోకి రాకముందే ఏర్పడిన సోషలిస్టు దేశాల అభివృద్ధి మొత్తంమీద ఉత్తమంగానే కొనసాగిందని అంచనా వేయవచ్చు. కమ్యూనిస్టు విప్లవాన్ని సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధించిన అనంతరం ఉనికిలోకి వచ్చే అంశంగా మార్క్స్‌ ప్రతిపాదించారు. కానీ తమ దేశాల్లో భూస్వామ్య సమాజాన్ని ఇంకా కూలదోయక ముందే సోషలిస్టు దేశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిమితుల్లో కూడా ఈ దేశాలు మానవులకు ఉత్తమమైన భౌతిక జీవన సంస్కృతిని ప్రపంచం ముందు ప్రదర్శించి చూపాయి. ప్రత్యేకించి సోషలిస్టు దేశాల కూటమి వల్లే ప్రపంచం ఫాసిజం, నాజీయిజం బారి నుంచి తప్పించుకుంది.

అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్‌ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కనుగొనేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్‌ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి.

మన దేశం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ వంటి పలు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో వెనకపట్టు పట్టినా, త్రిపురలో తాజాగా కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతలైన లెనిన్‌ వంటి వారి విగ్రహాలను కూలదోసి పైశాచికానందం పొందినా దేశాభివృద్ధి దిశగా జరుగుతున్న ఏ ప్రగతిశీల కార్యాచరణ లేక చర్చలోనైనా సరే మార్క్సిజం తనదైన ప్రభావం కలిగిస్తూనే ఉంది. మార్క్సిజం ఇప్పటికీ అవసరమేనన్నది నిజం.దేశంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు చెందిన భౌతిక వాస్తవికతను లోతుగా అధ్యయనం చేయడంలో మార్క్సిజం నేటికీ ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం. మార్క్సిజం ఇప్పటికీ భారత్‌లో మూలాల్లో బలపడకపోవడానికి దేశ వస్తుగత, భౌతిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితిని అంచనా వేయలేక పోవడమే కారణమని చెప్పవచ్చు. ఈ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల్లో మార్క్సిస్ట్‌ నాయకుల పరిమితులను మనం అర్థం చేసుకోవచ్చు కానీ అదే సమయంలో మార్క్సిస్ట్‌ సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందించడంలో వారి అమూల్యమైన దోహదాన్ని తప్పక పరిగణించాల్సి ఉంటుంది.

దేశరాజకీయాల్లో మొదటినుంచి బలమైన ప్రభావం వేస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ వంటి నేతలు సైతం యుఎస్‌ఎస్‌ఆర్‌ కమ్యూనిజంచే ప్రభావితులయ్యారు. హింసతో పని లేకుండా శాంతి యుతంగా కమ్యూనిజాన్ని సాధించగలిగితే దాన్ని రెండు చేతులతోనూ ఆహ్వానిస్తానని గాంధీ సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.మార్క్సిజాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలకమైన అంశం కార్మికవర్గ ఐక్యత. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ మార్క్స్‌ ఇచ్చిన నినాదం కూడా కార్మిక వర్గం బలానికి ఆధారం ఐక్యతే అని తేల్చి చెబుతోంది. ఈ ఐక్యత సాధించనిదే కమ్యూనిస్టు విప్లవాన్ని గెలుచుకోలేం.

చివరగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్‌ చేసిన వ్యాఖ్యను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అభివృద్ధి చెందిన పశ్చిమ యూరప్‌ను దృష్టిలో పెట్టుకుని మార్క్స్, ఏంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించారు. నిర్దిష్ట సమాజ భౌతిక వాస్తవికతను బట్టి కమ్యూనిస్టులు తమ ఆచరణలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశ సామాజిక నిర్మాణం ఇప్పటికీ కుల వ్యవస్థ రూపంలో ఘనీభవించిన సామాజిక సంబంధాలతో కూడి ఉంది. భాష, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, సాంప్రదాయాలు, సంస్కృతుల వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న జాతుల కలయికే భారతదేశం.

భారత కమ్యూనిస్టు గ్రూపులతో కలిసి పోరాడుతున్న ప్రజానీకంలోని అనైక్యత కారణంగా సహజంగానే మార్క్సిజం ప్రాసంగికమైనది కాదని ఎవరికైనా అనిపించవచ్చు. అందుకే ఐక్య కమ్యూనిస్టు ఉద్యమం భారత విప్లవాన్ని ఐక్యపర్చడమే కాకుండా, భారత జాతీయ లక్షణాలకు చెందిన వాస్తవికతను కూడా పరిగణిస్తుందని ఆశిస్తున్నాను. మన దేశంలో మార్క్సిజానికి ప్రాసంగికత ఉంటుందని రుజువు చేయడంలో భారతీయ కమ్యూనిస్టులు విజయం పొందుతారని భావిస్తున్నాను. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇదే సరైన సమాధానంగా ఉంటుంది.

డాక్టర్‌ ఏపీ విఠల్‌ 
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement