గమ్యం గమనం మార్క్సిజమే..! | Karl Marx Marxism Soviet Union | Sakshi
Sakshi News home page

గమ్యం గమనం మార్క్సిజమే..!

Published Sat, May 5 2018 1:06 AM | Last Updated on Sat, May 5 2018 8:07 AM

Karl Marx Marxism Soviet Union - Sakshi

కార్ల్‌మార్క్స్‌ క్యారికేచర్‌ (శంకర్‌)

సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడంతో మార్క్సిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారీ సమర్థకులు బృందగానాలు చేశారు. కేపిటలిజం ఆవిర్భవించి శతాబ్దాలవుతున్నా నిరుద్యోగ సమస్య, ఆకలి, దారిద్య్రం, ఆర్థిక సంక్షోభాల వంటి సమస్యలను నేటికీ పరిష్కరించలేకపోతోంది. కార్మికులను, సకల శ్రామికులను దోపిడీ చేయడం ద్వారానే పెట్టుబడిదారీ వర్గం బతుకుతోందని కార్ల్‌ మార్క్స్‌ చేసిన సూత్రీకరణ నేటికీ రుజువవుతూనే ఉంది. ఈ కోణంలో మార్క్సిజం అధ్యయనం, ఆచరణ మానవ సమాజానికి నేటికి ఆవశ్యకమే.ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, జర్నలిస్టు రాజకీయ సిద్ధాంతకర్త, విప్లవకర సోషలిస్టు, మహామేధావి, బహుభాషా కోవిదుడు, కార్ల్‌మార్క్స్‌ ద్విశతాబ్ది జయంతి వార్షికోత్సవాలు ప్రపంచ వ్యాపితంగా ఈనెల 5న జరుగనున్నాయి.

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం జరిగిన తదనంతరం మార్క్సిజానికి కాలదోషం పట్టిందని, ఆధునిక ప్రపంచానికి అది వర్తించదని అనేక మంది ‘కుహనా మేధావులు’ సైతం పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాస్తూ బూర్జువా వ్యవస్థను యథాతథంగా కొనసాగించడానికి నానా తంటాలు పడుతున్నారు. సోవియట్‌ యూనియన్‌లో మార్క్స్‌ ప్రతిపాదించిన సోషలిస్టు వ్యవస్థ వైఫల్యం చెందిందనే విస్తృతమైన ప్రచారం అన్ని రకాల మీడియాలలో చక్కర్లు కొడుతున్నది. దీనికి క్యూబా విప్లవకారుడు ఫిడెల్‌ క్యాస్ట్రో దీటుగానే జవాబు చెప్పారు. ‘సోషలిజం వైఫల్యం చెందిందని కాకి గోల పెడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ విజయవంతమైనదెక్కడా?’ అని సూటిగానే ప్రశ్నిం చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలోకి వచ్చి శతాబ్దాలు గడుస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక నేరాలు కుంభకోణాలు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

ప్రపంచాన్ని మార్చడమే అసలైన ఆచరణ
ఈ ప్రపంచాన్ని పలు తత్వవేత్తలు పలు రకాలుగా అభివర్ణించారు. అయితే కావల్సిందల్లా ఈ ప్రపంచాన్ని మార్చడమే అని మార్క్స్‌ సూత్రీకరించారు. ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు. ప్రపంచానికి ఆయన అందించిన చిన్న పుస్తకం ‘‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’’ రెండవది ‘‘పెట్టుబడి’’. ఈ గ్రంథాలలో అదనపు విలువ సిద్ధాంతాన్ని సూత్రీకరించారు. పెట్టుబడిదారీ విధానం తన గోతిని తానే ఎలా తవ్వుకుంటుందో, దానిలో అంతర్లీనమై ఉన్న వైరుధ్యాల ఫలితంగా ఎలా అంతరించి దాని స్థానంలో ఒక నూతన వ్యవస్థ ఎలా పుట్టుకొస్తుందనేది చక్కగా విశదీకరించారు. ‘‘సకల దేశ కార్మికులారా ఏకం కండి.. మీకు పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప’’ అంటూ ప్రపంచ కార్మిక వర్గానికి వర్గపోరాటాలను సాగించడంపై దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు. ప్రజలే చరిత్ర చోదక శక్తులంటూ సమాజ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్రే అన్నారు. ‘కమ్యూనిస్టు ప్రణాళిక’, ‘పెట్టుబడి’ గ్రంథాల స్ఫూర్తితో మొట్టమొదటి సారిగా రష్యాలో బోల్షివిక్కులు జారిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఒక జాతిని వేరొక జాతి, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయనటువంటి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, చేయడానికి గౌర వప్రదమైన ఉద్యోగం దొరికేటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఆవిర్భవించింది. సోవియట్‌ సోషలిస్టు సమాజం భూమిలేని పేదలకు భూమిని పంచడం, బ్యాంకులను, పరిశ్రమలను జాతీయం చేసి అనేక విజయాలు సాధించింది. అంతరిక్ష రంగంలో యూరిగగారిన్, వలంతెనా తెరిస్కోవాలు మొదటి అంతరిక్ష యాత్రికులుగా ప్రపంచ ఖ్యాతి పొందారు. భారీ పరిశ్రమల రంగంలో, వైద్య రంగంలో అనేక విజయాలు సాధించి అనేక బడుగు దేశాలకు ఆర్థిక, పాదార్థిక రంగాలలో సహకారమందించారు. అధికార కమ్యూనిస్టు పార్టీ యువతీ యువకులను క్రీడారంగంలో ప్రోత్సహించడం వల్ల సోవియట్‌ యూనియన్‌తో సహా ఇతర తూర్పు యూరప్‌ దేశాలు, చైనాలు కలిపి ఒలింపిక్స్‌లో మెజారిటీ 80% పైగానే స్వర్ణపతకాలను సాధిం చాయి. మార్క్సిజం స్ఫూర్తితో చైనాలో లాంగ్‌ మార్చ్‌ విజయవంతమై ప్రపంచంలోనే అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది.

చిన్న దేశాల్లోనూ సోషలిజం విజయం
క్యూబాలో చేగువేరా, ఫిడెల్‌ క్యాస్ట్రోల నాయకత్వంలో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేసి, సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే వైద్య రంగంలో ముందడుగు వేసింది. ప్రపంచంలో ఏ మూలన ప్రకృతి వైపరీత్యం జరిగినా అందరి కంటే ముందు వైద్య బృందాన్ని పంపగలిగిన దేశం సోషలిస్టు క్యూబా. అమెరికాతో సహా 14 దేశాలు వియత్నాంపై దాడి చేసినా తాను నిలదొక్కుకొని ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం వియత్నాం. లావోస్‌ తనదైన శైలిలో సోషలిజాన్ని నిర్మించుకొంటున్నది. దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా, బొలీవియా, నికరాగువా తదితర దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఒత్తిడులకు లొంగకుండా నిలదొక్కుకొని తమదైన స్వంత బ్యాంకును నిర్మించుకున్నాయి. 

అయితే మార్క్స్‌ స్వయాన ‘‘మార్క్సిజం పిడివాదం కాదని, అది నిరంతరం పరిస్థితుల కనుగుణంగా మారుతూనే ఉంటుందని’’ విశదీకరించారు. కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్‌ సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భావం అనివార్యమంటూ నిరూపించాడు. ‘పెట్టుబడి’ గ్రంథంలో వర్గపోరాటాలను విశ్లేషించి అవి చివరికి ఈ వ్యవస్థను కూల్చివేసి నూతన వ్యవస్థను సృష్టిస్తుందని ఘంటాపదంగా మార్క్స్‌ వక్కాణించాడు.
ఈ ఆధునిక ప్రపంచంలో కార్ల్‌మార్క్స్‌ చెప్పినట్లుగా అక్షర సత్యంగా మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలను కళ్ళారా చూస్తున్నాము. కార్మిక వర్గం ఆ రోజుల్లో 14 నుంచి 16 గంటలు పని చేయాల్సి వచ్చేది. మేడే స్ఫూర్తిగా పని గంటలు తగ్గించాలని కార్మిక వర్గం రక్తాన్ని చిందించింది. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినంలో కేవలం ఒకటి, రెండు గంటలు మాత్రమే తమ కుటుంబం కోసం వెచ్చిస్తే మిగతా గంటలు యాజమాన్యాలకు లాభాలు తెచ్చి పెట్టడానికే పని చేయాల్సి వస్తోందని మార్క్స్‌ ప్రబోధించారు. 

అయితే లాభాల వేటలో పెట్టుబడిదారులు కార్మికులతో ఓవర్‌ టైం (అదనపు గంటలు) పని చేయించి లాభాలు పొందేవారు. రానురాను యంత్రాల వేగాన్ని పెంచడం, ఆధునీకరించడం ద్వారా పెట్టుబడిదారీ విధానం తమ గోతిని తామే తవ్వుకొంటున్నదని మార్క్స్‌ నిరూపించాడు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థ అంతర్జాలాన్ని అభివృద్ధి చేసి తన గోతిని తానే తవ్వుకొంటోంది. అమెరికా గ్రంథాలయాల్లో మార్క్సిస్టు గ్రంథా లను ఎంత నిషేధించినప్పటికీ అంతర్జాలంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’, ‘పెట్టుబడి’తోపాటు ఇతర కమ్యూనిస్టు సాహిత్యమంతా లభిస్తూనే ఉంది. లాభాల వేటలో సాంప్రదాయ ఉత్పత్తులను మానేసి కంప్యూటర్‌ వృత్తినే అభివృద్ధి చేయటం వల్ల ప్రపంచానికంతా మార్క్సిజాన్ని అందచేసినట్లయింది. అయితే అందులో సైతం తమ కమ్యూనిస్టు వ్యతిరేక విషాన్ని విరజిమ్మడం కొనసాగుతూనే ఉంది.

‘ఇంటి నుంచి పని’ నయా దోపిడీలో భాగమే!
సామ్రాజ్యవాద దేశాల్లో వలస కార్మికులను నియమించుకొని దోపిడీ రేటును నిరంతరం పెంచడం కొనసాగిస్తూనే ఉన్నారు. పరిశ్రమలలో సబ్సిడీతో కూడిన రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఓవర్‌ టైం వేతనాలు చెల్లించి, కార్మికులతో అధిక గంటలు పనిచేయించి దోపిడీ రేటును పెంచడం జరుగుతోంది. అలాగే ‘‘వర్క్‌ ఫ్రం హోం’’ (ఇంటి నుంచి పని) అనే సౌకర్యాన్ని కల్పించి కార్మికులను దోపిడీ చేసే రేటును పెంచడం జరుగుతోంది.
పెట్టుబడిదారీ విధానం తనగోతిని తానే తవ్వుకుంటుం దని ‘‘పెట్టుబడి’’ గ్రంథం నిరూపించింది. ‘‘కమ్యూనిస్టు ప్రణాళిక’’ కార్మిక వర్గం ఏ విధంగా అధికారాన్ని చేపడుతుందనేది నిరూపిస్తే ‘‘పెట్టుబడి’’ గ్రంథం పెట్టుబడిదారులు లాభాల వేటలో కార్మికులతో ఎలా పని గంటల కాలం పెంచుతారో, ఆ సమయంలో దోపిడీ రేటును ఎలా పెంచుతారో వివరించింది. ఈ పనిగంటలు పెంచడానికి పెట్టుబడిదారులు ఎంతటి నీచపు పనులకైనా ఎగబడతారని మార్క్స్‌ వివరించారు.

మార్క్స్‌ దాదాపు 30 ఏళ్లపాటు వివిధ దేశాల కార్మిక వర్గ పని పరిస్థితులను అధ్యయనం చేశారు. దీని కోసం ఆయన అనేక భాషలు సైతం నేర్చుకున్నారు. మార్క్స్‌ ఊహించినట్లుగానే  పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలతో పాటు అమెరికాలో సైతం కార్మిక వర్గం తమకు బేరసారాల హక్కు, యూనియన్‌లు ఏర్పాటు చేసుకొనే హక్కు ఉండాలని, కనీస వేతనాలు నిర్ధారించి చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వీధుల్లోకి రావటమే కాకుండా సమ్మెలు సైతం చేస్తున్నారు.మార్క్సిజంలో మూడు అంతర్భాగాలైన తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం, శాస్త్రీయ సోషలిజం అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి విరామ మెరుగకుండా మార్క్స్‌ శ్రమించాల్సి వచ్చింది.

అనేక నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఇంటి అద్దెను.. కిరాయి యజమానికి చెల్లించలేని కడు పేదరికంలో మగ్గింది మార్క్స్‌ కుటుంబం. మార్క్స్‌ భార్య జెన్నీ తన సంతానానికి పాలు ఇస్తుంటే శరీరంలో పాలు లేక రక్తం స్రవించే హృదయ విదారక ఘట్టాలు ఎవరూ మరిచిపోలేని విషయాలు. అంతటి కడు పేదరి కంలో మార్క్స్‌ జీవించినప్పటికి తన పయనాన్ని ఆపకుండా దోపిడీ రహస్యాన్ని ఛేదించి ప్రపంచ కార్మిక వర్గానికి మార్క్సిజాన్ని అందించాడు. ఆ మార్క్సిజం అజేయమని ప్రపంచ పరిణామాలు నిరూపిస్తూనే ఉన్నాయి.కార్ల్‌మార్క్స్‌ యవ్వనంలోనే ఒక మాటంటాడు. ‘‘నిర్జీవపు, నిస్సారపు కాకి బ్రతుకు వద్దు ‘మనకు’ ఒక లక్ష్యంతో, గమ్యంతో ముందుకు సాగాలంటాడు. మార్క్స్‌ చెప్పినట్లుగా ఆశావాదంతో మరింత ముందుకు సాగుదాం. బానిస సంకెళ్ళను తెంపుకుంటూ సకల దేశ కార్మికులను ఏకం చేద్దాం. అమెరికా సామ్రాజ్యవాద నయావలసవాద విధానాలను బహిర్గతం చేస్తూ వాటిని ప్రతిఘటిస్తూ ఈ భూగోళంపై యుద్ధాలకు తావులేని ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పుదాం.

- సురవరం సుధాకరరెడ్డి 
వ్యాసకర్త సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
(నేడు కార్ల్‌మార్క్స్‌ 200వ జయంతి సందర్భంగా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement