Marxism
-
అన్ని కాలాలకు వర్తించేదే మార్క్సిజం
సుందరయ్య విజ్ఞానకేంద్రం : మార్క్సిజానికి కాలపరిమితి లేదనీ, అన్ని కాలాలకు వర్తించేదే ఆ సిద్ధాంతమని దీన్ని మన సమాజానికి వర్తింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవి, విమర్శకుడు కె.శివారెడ్డి అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, నవచేతన బుక్‌హౌస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రచయిత కె.గాంధీ రాసిన తెలుగు అనువాదం ‘మార్క్స్, ఏంగెల్స్ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ లోని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయి అవి బలహీన పడ్డాయన్నారు. పురోగమన శక్తుల నుంచే గొప్ప కవిత్వం వస్తుందని చెప్పారు.సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైద్ధాంతిక అధ్యయనంతో వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని, ఐక్య ఉద్యమాల ద్వారానే దోపిడీ శక్తులను తిప్పికొట్టాలన్నారు. పెట్టుబడిదారీ సమాజం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఘర్షణలు, యుద్ధాల ద్వారా వైవిధ్యాన్ని, సంక్షోభాన్ని పేద దేశాలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయ ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ దాడులను తిప్పికొట్టడానికి కమ్యూనిస్టులంతా ఐక్యంగా పని చేయాలని చెప్పారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ పార్టీలు దేశ ఆర్థిక పరిస్థితులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారని, అందుకే భిన్నమైన రీతుల్లో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సాయుధ పోరాటయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలం గాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ కోయ చంద్రమోహన్, నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రతినిధి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్వయలోపమే అసలు సమస్య
గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్ దాకా, ఆ తర్వాత కూడా భారతదేశంలో 2500 సంవత్సరాలుగా కుల ఘర్షణల పరంపర కొనసాగుతూనే ఉంది. చరిత్ర పొడవునా సాగిన సంఘర్షణలను ఇక్కడి మార్క్సిస్టులు అర్థం చేసుకోలేదు. అందువల్లనే నాటి సమాజ పురోగతికి అడ్డుగా ఉన్న శక్తులను మనం ఇంకా నిర్ధారించలేదు. గౌతమ బుద్ధుడిని విప్లవకారుడిగా, అంబేడ్కర్ సమకాలీన తాత్వికవేత్తగా గుర్తించడానికి మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు సిద్ధంగా లేరు. భారతదేశ చరిత్ర క్రమం అర్థం కాకుండా, భారతదేశంలో విప్లవాలు అసాధ్యం. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిందనో, తూర్పు యూరప్‌లో సోషలిజం కనుమరుగైందనో, చైనాలో పెట్టుబడిదారీ పోకడలు తలెత్తాయనో భారతదేశంలో కమ్యూని స్టులు, విప్లవకారులు నామమాత్రమయ్యారనో మార్క్సిజానికి కాలం చెల్లిందనుకోవడం పొరపాటు. కార్ల్‌మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి ఇప్పుడు ఎటువంటి ప్రామాణికతా లేదని ప్రకటిస్తున్నదంతా మేకపోతు గాంభీర్యమనే భావించాలి. కార్ల్‌మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక ’ ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికైనా పీడిత జనబాహుళ్యం చేతిలో ఏకైక శాశ్వత పరిష్కారాస్త్రం. అదొక అజేయమైన శాస్త్రీయ సిద్ధాంతం. ఇదే ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. దోపిడీ పీడనల పునాదులపై వెలసిన పారిశ్రామిక విధానం, రెక్కలు తప్ప ఆస్తులు లేని నిత్య దారిద్య్రాన్ని అనుభవిస్తోన్న కార్మికుల స్థితి గతులు, పీడనల నుంచి విముక్తి కోసం ఎన్నో కష్టాల కోర్చి, ఎంతో శ్రమించి ఆయన పరిశోధనాత్మకంగా రాసిన ‘దాస్ కాపిటల్’ ఆనాటి వరకూ ఉన్న ఆర్థిక వేత్తల దృక్పథాన్ని పూర్తిగా తారుమారు చేసింది. అంతేకాదు అప్పటి వరకూ ఉన్న పలు తప్పుడు భావజాలాలను మూలాలతో పెకిలించి వేసింది. మార్క్సిజం అంటే ఆ రెండు గ్రంథాలే కాదు కానీ మార్క్సిజం అంటే కేవలం ఈ రెండు గ్రంథాలే అన్నంతగా చేస్తున్న ప్రచారం కూడా పూర్తి సత్యం కాదు. నిజానికి ధనిక–పేద, రైతు కూలీ– భూస్వా ములు, ఉద్యోగులు–యజమానులు, పెట్టుబడిదా రుడూ– కార్మికులకూ మధ్య వ్యవస్థీకృతమైన అంత రాలూ, ఆ రెండు వర్గాల మధ్యనున్న వ్యత్యాసాన్ని సమాజం ప్రతిబింబించినంత కాలం కమ్యూనిస్టు మేనిఫెస్టోకీ, దాస్క్యాపిటల్కీ మరణం లేదు. కానీ అవి రెండు మాత్రమే మార్క్సిజం కాజాలదు. సమ సమాజ లక్ష్యంగా ప్రతిపాదించిన రాజకీయ సిద్ధాం తానికి మార్గదర్శకం వహిస్తున్న ‘కమ్యూనిస్టు ప్రణా ళిక’, అసమానతల పుట్టుక పునాదులను తవ్వి తీసే ఆర్థిక సిద్ధాంతానికి సమగ్ర రూపం ‘దాస్‌కాపిటల్’ లకు భూమిక మార్క్సిస్టు తత్వశాస్త్రం. మార్క్సిస్టు తత్వశాస్త్ర పునాదిపైన ఆధారపడి ఈ రెండు మహా గ్రంథాలు రూపుదిద్దుకున్నాయి. మనిషిని మనిషే పీడించే తత్వంనుంచి విముక్తి చేసే మహత్తర సిద్ధాం తమది. అజరామరంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేయగల ఏకైక సత్యమదే. యూరప్ అంతటా కొనసాగుతున్న పెట్టుబడి దారుల దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి అదనపు విలువ సిద్ధాంతాన్ని కనిపెట్టిన మార్క్స్, కార్మికులను చైతన్య పరచడానికి, వారిని మూఢాం ధకారంలోనుంచి వెలికితే వడానికి చాలా సులభమైన తాత్విక ఆలోచనలను ముందుకు తీసుకొచ్చాడు. మొదటగా ఆయన ప్రతిపాదించిన గతితార్కిక సిద్ధాంతం. ఏ సందర్భం, ఏ సమాజం, ఎటువంటి పరిస్థితులైనా స్థిరంగా ఉండవనీ, మార్పు చెందు తూనే ఉంటాయనీ, అది అనివార్యమనీ ఆ సిద్ధాంతం చెపుతుంది. అదేవిధంగా దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీకి గురయ్యేవాళ్ళు ఉన్నంత వరకూ వర్గాలుంటాయి. వారి మధ్య వైరుధ్యాలూ, సంఘర్షణలూ ఉంటాయి. ఆ సంఘర్షణలే పోరాటా లకూ, విప్లవాలకూ దారితీస్తాయి. అవి అంతకన్నా భిన్నమైన మరో నూతన సమాజానికి దారులు వేస్తాయి. ఇది ఆయన ప్రాథమిక సూత్రీకరణ. అయితే ఈ పరిస్థితుల్లో మార్పుకి దేవుడో, ఏ మహాత్ముడో దిగి రావాల్సిన అవసరమేం లేదు. ప్రజలే తమ పరిస్థితుల్లో మార్పులు తీసుకురాగలుగు తారు. అందుకే వారే చరిత్ర నిర్మాతలని కూడా మార్క్స్ ప్రకటించారు. ఎప్పుడైతే అణచివేత దోపిడీ లాంటి దుర్మార్గాల వల్ల సమాజం సంక్షోభం లోకి పోతుందో అప్పుడు అని వార్యంగా పీడనకు గురవు తోన్న శక్తులు ఆ పరిస్థితు లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాయనీ అదే పరి పక్వ దశ అనీ, ఒక దశ నుంచి మరో దశలోకి ప్రయా ణించే సమాజక్రమాన్ని చరిత్ర రుజువు చేస్తుందని కూడా మార్క్స్ ప్రకటిం చారు. అందుకే ప్రపంచ చరిత్ర అంతా వర్గపోరా టాల చరిత్రగా ఆయన అభివర్ణిస్తారు. ప్రపంచాన్ని నిద్ర లేపిన మేటి సిద్ధాంతం అంతే కాకుండా ప్రజల కష్టాలకు, ముఖ్యంగా పేద రికానికి వ్యక్తిగత ఆస్తి విధానం కూడా కారణమని, దానిని కాపాడుకోవడానికి రాజ్యం, బలం, బలగా లను సృష్టించిందని కూడా మార్క్స్ చారిత్రక ఆధా రాలతో సహా నిరూపించారు. ఈ సిద్ధాంతం అప్పటి ప్రపంచాన్ని నిద్రలేపింది. అప్పటివరకు తమ కష్టా లకు, కన్నీళ్ళకు దేవుడు, ఏవో అతీంద్రియ శక్తులు కారణమని భ్రమిస్తున్న శ్రామికులకు చైతన్యం కలి గించడం మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కనిపించే శత్రువును మార్క్స్ తన సిద్ధాంతం గొలుసులతో కట్టి, వారి ముందు నిలబెట్టాడు. పెట్టుబడిదారీ విధా నం కానీ, మరే విధమైన దోపిడీ అయినా గానీ, పోరాటాల ద్వారా రూపుమాసిపోతుందని చెబు తూనే, సోషలిజం, కమ్యూనిజం లాంటి సమ సమాజ వ్యవస్థలు ఏర్పడుతాయని వివరించారు. మార్క్స్ ఎంతో అన్వేషణతో ప్రపంచానికి ఒక నూతన విముక్తి మార్గాన్ని ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనది సమగ్రమైన సమాజ అధ్య యనం, నిజమైన శత్రువును ప్రజల ముందు నిల బెట్టడం, ఆ తర్వాత రూపొందబోయే ప్రత్యామ్నాయ వ్యవస్థ రూపాన్ని ఆవిష్కరించడం చేయాలి. సరిగ్గా కార్ల్‌మార్క్స్ అదే చేశాడు. అయితే ఇది అన్ని దేశా లకూ, ప్రాంతాలకూ, కాలాలకూ ఒకేరకంగా ఉండ దనీ, దేశ, కాల పరిస్థితులకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని మార్క్స్ పేర్కొన్నారు. నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట అన్వయం మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించు కోవడం వల్లనే మొట్టమొదట రష్యాలో, ఆ తర్వాత చైనాలో విప్లవాలు సాధ్యమయ్యాయి. మౌలికమైన మార్క్సిస్టు సూత్రాలను రష్యాలో లెనిన్ తన కార్యా చరణకు అన్వయించుకు న్నారు. జార్ చక్రవర్తి దుర్మా ర్గాలను ప్రజల్లో ఎండగట్టి, విముక్తి మార్గాన్ని ప్రజల ముందుంచారు. ఎంతో చైత న్యాన్ని అందించి, ప్రజ లను ఐక్యం చేసి జార్ ప్రభుత్వాన్ని కూలదోసారు. అలాగే చైనాలో భూస్వామ్య వ్యవస్థ, యుద్ధ ప్రభువులు, జపాన్ లాంటి దురాక్రమణ దారులు ప్రజలకు నిజమైన శత్రువులని, ఆ దేశ విప్లవ నేత మావో తేల్చి చెప్పారు. ఆ ప్రాతిపదికపై ప్రజలను ఐక్యం చేసి దీర్ఘకాలిక సాయుధపోరాటంతో విజయం సాధించారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన కాలంలోనే భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ అవతరణ జరిగింది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశాన్ని, దేశ ప్రజలను, పీడన, దోపిడీ నుంచి విముక్తి చేయలేక పోయింది. పైగా ఎన్నో చీలికలు జరిగి బలహీన పడింది. అయితే కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ సాగించిన పోరాటాలు ప్రజలకు తాత్కాలి కంగా, పాక్షికంగా దోపిడీ పీడనల నుంచి విముక్తి కలి గించాయి. కార్ల్‌మార్క్స్ సూచించిన విధంగా నిర్దిష్ట కాలమాన పరిస్థితుల్లో దోపిడీదారులెవరో ప్రత్య క్షంగా నిలబెట్టడం ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కులాధి పత్య భూస్వామ్య వ్యతిరేక పోరాటాలూ కొన్ని తక్షణ ఫలితాలను ప్రజలకు అందించాయి. భారతదేశంలో వేల ఏళ్ళుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ కేవలం సాంస్కృతికపరమైన, సాంప్ర దాయాలకు సంబంధించిన అంశం కాదు. కులం ఈ దేశంలోని ప్రజలకు ఇనుప కంచె లాంటి ప్రధానమైన అవరోధం. అన్ని సంక్షోభాలకూ ఇక్కడ కులం పునా దిగా ఉంటుంది. ఇటువంటి దేశంలో ఒక ప్రత్యేక మైన అధ్యయనం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితులకు ఏ వర్గాలూ, ఏ విధానాలూ, ఏ వ్యవస్థలూ కారణ మవుతున్నాయో ఆలోచించాలి. కార్ల్‌మార్క్స్ ప్రతిపా దించిన చారిత్రక క్రమాన్ని మన దేశ చరిత్ర నుంచి అర్థం చేసుకోవాలి. అంతేకానీ, యూరప్‌ను ఒక నమూనాగా, చైనాను మరొక మార్గంగా చూడడం సరిౖయెంది కాదనేది వాస్తవం. బౌద్ధం తొలి సామాజిక విప్లవం 2500 సంవత్సరాల కిందట ఏర్పడిన కుల వ్యవస్థ ఇప్పటికీ భారతదేశాన్ని అనేక రూపాల్లో పీడిస్తున్నది. అయితే పీడనకు, అణచివేతకు గురవు తున్న కులాలు, వర్గాలు నిరంతరం ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. సిద్ధార్థ గౌతమ బుద్ధుని నాయకత్వం విజయవంతమై మొట్టమొదట సామాజిక విప్లవం దేశంలో ఎన్నో మార్పులకు, నూతన ఆవిష్కర ణకు పునాది అయింది. కానీ మళ్ళీ విప్లవ ప్రతీఘాత శక్తులు కులాధిపత్యాన్ని స్థాపించ డానికి ఎంతో నరమే«థానికి పాల్పడ్డాయి. గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్ దాకా, ఆ తర్వాత కూడా ఆ ఘర్షణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ చారిత్రక క్రమాన్ని, చరిత్ర పొడవునా సాగిన సంఘర్ష ణలను ఇక్కడి మార్క్సిస్టులు అర్థం చేసుకోలేదు. కాబట్టే నాటి సమాజ పురోగతికి అడ్డుగా ఉన్న శక్తు లను మనం ఇంకా నిర్ధారించలేదు. గౌతమ బుద్ధు డిని విప్లవకారుడిగా, అంబేడ్కర్ సమకాలీన తాత్విక వేత్తగా గుర్తించడానికి మార్క్సిజాన్ని అనుసరిస్తున్నా మని చెప్పుకుంటున్న వాళ్ళు సిద్ధంగా లేరు. భారత దేశ చరిత్ర క్రమం అర్థం కాకుండా, దేశంలో విప్ల వాలు అసాధ్యం. అలాగే యూరప్ దేశాలకూ భారత సామాజిక పరిస్థితులకూ ఉన్న మౌలిక వ్యత్యాసా లను సైతం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే నేటి భార తీయ సమాజంలోని ప్రజలను విప్లవోద్యమం వైపు మళ్ళించడం సాధ్యం అవుతుంది. చైనా విప్లవం సమయంలో మావో సేటుంగ్ చెప్పిన విషయం ప్రస్తావించుకోవాలి. ‘‘మనం మార్క్సిస్టు–లెనినిస్టు వైఖరిని, దృక్పథాన్ని, పద్ధ తుల్ని అధ్యయనం చేసి చైనా చరిత్రకూ, ఆ దేశ ఆర్థిక, రాజకీయ, సైనిక, సాంస్కృతిక విషయాలకూ అన్వయించాలి’’ ఇది భారత్‌కి కూడా వర్తిస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 97055 66213 -
మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన!
విజయవాడ: మార్పు మార్పు అంటూ కేవలం వాఖ్యలు చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కారల్ మార్క్స్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచే కొద్ది మార్క్స్ సిద్ధాంతాలపై ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..ఇటీవల మార్క్సిజంపై యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించడానికి మార్క్స్ కృషి చేశారన్నారు. అందుకే మార్క్స్‌ని ప్రపంచం గుర్తుపెట్టుకుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగడంతో యువతలో ఆగ్రహం పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని అభిప్రాయపడ్డారు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలో వైవిధ్యం వచ్చిందని, ఇదే కొనసాగితే సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సోషలిజం వల్లే రాజ్యం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. భారతదేశం సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ పోవాలని రాఘవులు పేర్కొన్నారు. వామపక్షాలకు మంచి రోజులొస్తాయి: మధు మన రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని అందరూ అంటున్నారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను యువత వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు లేవన్న చోటే వామపక్షాల ఉద్యమాలు బలపడుతున్నాయని మధు పేర్కొన్నారు. -
నాడూ నేడూ రేపూ మార్క్సిజం అజేయమే
అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థికవ్యవస్థను పునరావిష్కరించేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి. కార్ల్‌మార్క్స్ జన్మించిన 200 సంవత్సరాల తర్వాత కూడా మార్క్సిజం ప్రాసంగికత గురించి మనం నేటికీ చర్చిస్తున్నామంటేనే ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సిద్ధాంతంగా మార్క్సిజం ప్రాసంగికత తిరుగులేని విధంగా రుజువవుతోందని మనం చెప్పవచ్చు. మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడిన తొలి సోషలిస్టు దేశం సోవియట్ యూనియన్ ప్రపంచ పటం నుంచి మాయం కావడం, పోలెండ్, తూర్పుజర్మనీ వంటి తూర్పు యూరప్‌కి చెందిన సోషలిస్టు దేశాలు విచ్ఛిన్నమైపోవడం వంటి పరిణామాలతో కమ్యూనిజం వ్యతిరేకులు మార్క్సిజాన్ని కించపర్చడమే కాదు.. దాని ప్రాసంగికతనే తోసిపుచ్చేంతవరకు వెళ్లారు. వియత్నాం, క్యూబా వంటి దేశాలు ఇంకా సోషలిస్టు దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ మార్క్సిజంపై దుష్ప్రచారం కొనసాగించారు. ఈ దేశాలు కూడా వ్యక్తిగత ఆస్తి విషయంలో కాస్త సడలింపు నిచ్చి, సొంత ఆస్తిని అట్టిపెట్టుకోవడాన్ని కొంతమేరకు అనుమతించడమే కాకుండా అక్కడ చేపట్టిన కొన్ని సంస్కరణలు కూడా అవి ఇక ఏమాత్రం స్వచ్చమైన సోషలిస్టు దేశాలు కావనే అభిప్రాయం కలిగించి మార్క్సిజాన్ని, దాని ప్రాసంగితను తృణీకరించడానికి కారణమయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు అంగీకరించకపోయినప్పటికీ, ప్రస్తుత చైనాను కూడా సోషలిస్టు దేశంగానే చాలామంది భావిస్తున్నారు. అదేసమయంలో సోషలిస్ట్ శిబిరమే ఉనికిలో లేదని, మార్క్సిజం ఒక సిద్ధాంతంగా కాలం చెల్లిపోయిందని చెబుతుండటం సరైంది కాదు. మరోవైపున మార్క్సిజం, సోషలిజంలకు ప్రాసంగికతే లేదని, అవి గతించిన చరిత్రలో భాగమైపోయాయని మార్క్సిజం విమర్శకులు ప్రచారం సాగిస్తున్నారు. దీనికి భిన్నంగా మార్క్సిస్ట్ గతితార్కిక పంథాలో చారిత్రక భౌతిక అభివృద్ధి క్రమం సరైందేనని సోషలిస్టు దేశాలు ఆవిర్భవించినప్పటినుంచి రుజువు చేస్తూ వచ్చాయి. పైగా నెలలు నిండకముందే బిడ్డ పుట్టినట్లుగా సోషలిజానికి కావలసిన ముందస్తు షరతులు ఉనికిలోకి రాకముందే ఏర్పడిన సోషలిస్టు దేశాల అభివృద్ధి మొత్తంమీద ఉత్తమంగానే కొనసాగిందని అంచనా వేయవచ్చు. కమ్యూనిస్టు విప్లవాన్ని సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధించిన అనంతరం ఉనికిలోకి వచ్చే అంశంగా మార్క్స్ ప్రతిపాదించారు. కానీ తమ దేశాల్లో భూస్వామ్య సమాజాన్ని ఇంకా కూలదోయక ముందే సోషలిస్టు దేశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిమితుల్లో కూడా ఈ దేశాలు మానవులకు ఉత్తమమైన భౌతిక జీవన సంస్కృతిని ప్రపంచం ముందు ప్రదర్శించి చూపాయి. ప్రత్యేకించి సోషలిస్టు దేశాల కూటమి వల్లే ప్రపంచం ఫాసిజం, నాజీయిజం బారి నుంచి తప్పించుకుంది. అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కనుగొనేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో వెనకపట్టు పట్టినా, త్రిపురలో తాజాగా కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతలైన లెనిన్ వంటి వారి విగ్రహాలను కూలదోసి పైశాచికానందం పొందినా దేశాభివృద్ధి దిశగా జరుగుతున్న ఏ ప్రగతిశీల కార్యాచరణ లేక చర్చలోనైనా సరే మార్క్సిజం తనదైన ప్రభావం కలిగిస్తూనే ఉంది. మార్క్సిజం ఇప్పటికీ అవసరమేనన్నది నిజం.దేశంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు చెందిన భౌతిక వాస్తవికతను లోతుగా అధ్యయనం చేయడంలో మార్క్సిజం నేటికీ ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం. మార్క్సిజం ఇప్పటికీ భారత్‌లో మూలాల్లో బలపడకపోవడానికి దేశ వస్తుగత, భౌతిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితిని అంచనా వేయలేక పోవడమే కారణమని చెప్పవచ్చు. ఈ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల్లో మార్క్సిస్ట్ నాయకుల పరిమితులను మనం అర్థం చేసుకోవచ్చు కానీ అదే సమయంలో మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందించడంలో వారి అమూల్యమైన దోహదాన్ని తప్పక పరిగణించాల్సి ఉంటుంది. దేశరాజకీయాల్లో మొదటినుంచి బలమైన ప్రభావం వేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ వంటి నేతలు సైతం యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజంచే ప్రభావితులయ్యారు. హింసతో పని లేకుండా శాంతి యుతంగా కమ్యూనిజాన్ని సాధించగలిగితే దాన్ని రెండు చేతులతోనూ ఆహ్వానిస్తానని గాంధీ సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.మార్క్సిజాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలకమైన అంశం కార్మికవర్గ ఐక్యత. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ మార్క్స్ ఇచ్చిన నినాదం కూడా కార్మిక వర్గం బలానికి ఆధారం ఐక్యతే అని తేల్చి చెబుతోంది. ఈ ఐక్యత సాధించనిదే కమ్యూనిస్టు విప్లవాన్ని గెలుచుకోలేం. చివరగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ చేసిన వ్యాఖ్యను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అభివృద్ధి చెందిన పశ్చిమ యూరప్‌ను దృష్టిలో పెట్టుకుని మార్క్స్, ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించారు. నిర్దిష్ట సమాజ భౌతిక వాస్తవికతను బట్టి కమ్యూనిస్టులు తమ ఆచరణలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశ సామాజిక నిర్మాణం ఇప్పటికీ కుల వ్యవస్థ రూపంలో ఘనీభవించిన సామాజిక సంబంధాలతో కూడి ఉంది. భాష, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, సాంప్రదాయాలు, సంస్కృతుల వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న జాతుల కలయికే భారతదేశం. భారత కమ్యూనిస్టు గ్రూపులతో కలిసి పోరాడుతున్న ప్రజానీకంలోని అనైక్యత కారణంగా సహజంగానే మార్క్సిజం ప్రాసంగికమైనది కాదని ఎవరికైనా అనిపించవచ్చు. అందుకే ఐక్య కమ్యూనిస్టు ఉద్యమం భారత విప్లవాన్ని ఐక్యపర్చడమే కాకుండా, భారత జాతీయ లక్షణాలకు చెందిన వాస్తవికతను కూడా పరిగణిస్తుందని ఆశిస్తున్నాను. మన దేశంలో మార్క్సిజానికి ప్రాసంగికత ఉంటుందని రుజువు చేయడంలో భారతీయ కమ్యూనిస్టులు విజయం పొందుతారని భావిస్తున్నాను. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇదే సరైన సమాధానంగా ఉంటుంది. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
గమ్యం గమనం మార్క్సిజమే..!
సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో మార్క్సిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారీ సమర్థకులు బృందగానాలు చేశారు. కేపిటలిజం ఆవిర్భవించి శతాబ్దాలవుతున్నా నిరుద్యోగ సమస్య, ఆకలి, దారిద్య్రం, ఆర్థిక సంక్షోభాల వంటి సమస్యలను నేటికీ పరిష్కరించలేకపోతోంది. కార్మికులను, సకల శ్రామికులను దోపిడీ చేయడం ద్వారానే పెట్టుబడిదారీ వర్గం బతుకుతోందని కార్ల్ మార్క్స్ చేసిన సూత్రీకరణ నేటికీ రుజువవుతూనే ఉంది. ఈ కోణంలో మార్క్సిజం అధ్యయనం, ఆచరణ మానవ సమాజానికి నేటికి ఆవశ్యకమే.ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, జర్నలిస్టు రాజకీయ సిద్ధాంతకర్త, విప్లవకర సోషలిస్టు, మహామేధావి, బహుభాషా కోవిదుడు, కార్ల్‌మార్క్స్ ద్విశతాబ్ది జయంతి వార్షికోత్సవాలు ప్రపంచ వ్యాపితంగా ఈనెల 5న జరుగనున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం జరిగిన తదనంతరం మార్క్సిజానికి కాలదోషం పట్టిందని, ఆధునిక ప్రపంచానికి అది వర్తించదని అనేక మంది ‘కుహనా మేధావులు’ సైతం పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాస్తూ బూర్జువా వ్యవస్థను యథాతథంగా కొనసాగించడానికి నానా తంటాలు పడుతున్నారు. సోవియట్ యూనియన్‌లో మార్క్స్ ప్రతిపాదించిన సోషలిస్టు వ్యవస్థ వైఫల్యం చెందిందనే విస్తృతమైన ప్రచారం అన్ని రకాల మీడియాలలో చక్కర్లు కొడుతున్నది. దీనికి క్యూబా విప్లవకారుడు ఫిడెల్ క్యాస్ట్రో దీటుగానే జవాబు చెప్పారు. ‘సోషలిజం వైఫల్యం చెందిందని కాకి గోల పెడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ విజయవంతమైనదెక్కడా?’ అని సూటిగానే ప్రశ్నిం చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలోకి వచ్చి శతాబ్దాలు గడుస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక నేరాలు కుంభకోణాలు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని మార్చడమే అసలైన ఆచరణ ఈ ప్రపంచాన్ని పలు తత్వవేత్తలు పలు రకాలుగా అభివర్ణించారు. అయితే కావల్సిందల్లా ఈ ప్రపంచాన్ని మార్చడమే అని మార్క్స్ సూత్రీకరించారు. ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు. ప్రపంచానికి ఆయన అందించిన చిన్న పుస్తకం ‘‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’’ రెండవది ‘‘పెట్టుబడి’’. ఈ గ్రంథాలలో అదనపు విలువ సిద్ధాంతాన్ని సూత్రీకరించారు. పెట్టుబడిదారీ విధానం తన గోతిని తానే ఎలా తవ్వుకుంటుందో, దానిలో అంతర్లీనమై ఉన్న వైరుధ్యాల ఫలితంగా ఎలా అంతరించి దాని స్థానంలో ఒక నూతన వ్యవస్థ ఎలా పుట్టుకొస్తుందనేది చక్కగా విశదీకరించారు. ‘‘సకల దేశ కార్మికులారా ఏకం కండి.. మీకు పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప’’ అంటూ ప్రపంచ కార్మిక వర్గానికి వర్గపోరాటాలను సాగించడంపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు. ప్రజలే చరిత్ర చోదక శక్తులంటూ సమాజ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్రే అన్నారు. ‘కమ్యూనిస్టు ప్రణాళిక’, ‘పెట్టుబడి’ గ్రంథాల స్ఫూర్తితో మొట్టమొదటి సారిగా రష్యాలో బోల్షివిక్కులు జారిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఒక జాతిని వేరొక జాతి, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయనటువంటి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, చేయడానికి గౌర వప్రదమైన ఉద్యోగం దొరికేటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఆవిర్భవించింది. సోవియట్ సోషలిస్టు సమాజం భూమిలేని పేదలకు భూమిని పంచడం, బ్యాంకులను, పరిశ్రమలను జాతీయం చేసి అనేక విజయాలు సాధించింది. అంతరిక్ష రంగంలో యూరిగగారిన్, వలంతెనా తెరిస్కోవాలు మొదటి అంతరిక్ష యాత్రికులుగా ప్రపంచ ఖ్యాతి పొందారు. భారీ పరిశ్రమల రంగంలో, వైద్య రంగంలో అనేక విజయాలు సాధించి అనేక బడుగు దేశాలకు ఆర్థిక, పాదార్థిక రంగాలలో సహకారమందించారు. అధికార కమ్యూనిస్టు పార్టీ యువతీ యువకులను క్రీడారంగంలో ప్రోత్సహించడం వల్ల సోవియట్ యూనియన్‌తో సహా ఇతర తూర్పు యూరప్ దేశాలు, చైనాలు కలిపి ఒలింపిక్స్‌లో మెజారిటీ 80% పైగానే స్వర్ణపతకాలను సాధిం చాయి. మార్క్సిజం స్ఫూర్తితో చైనాలో లాంగ్ మార్చ్ విజయవంతమై ప్రపంచంలోనే అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. చిన్న దేశాల్లోనూ సోషలిజం విజయం క్యూబాలో చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల నాయకత్వంలో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేసి, సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే వైద్య రంగంలో ముందడుగు వేసింది. ప్రపంచంలో ఏ మూలన ప్రకృతి వైపరీత్యం జరిగినా అందరి కంటే ముందు వైద్య బృందాన్ని పంపగలిగిన దేశం సోషలిస్టు క్యూబా. అమెరికాతో సహా 14 దేశాలు వియత్నాంపై దాడి చేసినా తాను నిలదొక్కుకొని ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం వియత్నాం. లావోస్ తనదైన శైలిలో సోషలిజాన్ని నిర్మించుకొంటున్నది. దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా, బొలీవియా, నికరాగువా తదితర దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఒత్తిడులకు లొంగకుండా నిలదొక్కుకొని తమదైన స్వంత బ్యాంకును నిర్మించుకున్నాయి. అయితే మార్క్స్ స్వయాన ‘‘మార్క్సిజం పిడివాదం కాదని, అది నిరంతరం పరిస్థితుల కనుగుణంగా మారుతూనే ఉంటుందని’’ విశదీకరించారు. కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భావం అనివార్యమంటూ నిరూపించాడు. ‘పెట్టుబడి’ గ్రంథంలో వర్గపోరాటాలను విశ్లేషించి అవి చివరికి ఈ వ్యవస్థను కూల్చివేసి నూతన వ్యవస్థను సృష్టిస్తుందని ఘంటాపదంగా మార్క్స్ వక్కాణించాడు. ఈ ఆధునిక ప్రపంచంలో కార్ల్‌మార్క్స్ చెప్పినట్లుగా అక్షర సత్యంగా మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలను కళ్ళారా చూస్తున్నాము. కార్మిక వర్గం ఆ రోజుల్లో 14 నుంచి 16 గంటలు పని చేయాల్సి వచ్చేది. మేడే స్ఫూర్తిగా పని గంటలు తగ్గించాలని కార్మిక వర్గం రక్తాన్ని చిందించింది. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినంలో కేవలం ఒకటి, రెండు గంటలు మాత్రమే తమ కుటుంబం కోసం వెచ్చిస్తే మిగతా గంటలు యాజమాన్యాలకు లాభాలు తెచ్చి పెట్టడానికే పని చేయాల్సి వస్తోందని మార్క్స్ ప్రబోధించారు. అయితే లాభాల వేటలో పెట్టుబడిదారులు కార్మికులతో ఓవర్ టైం (అదనపు గంటలు) పని చేయించి లాభాలు పొందేవారు. రానురాను యంత్రాల వేగాన్ని పెంచడం, ఆధునీకరించడం ద్వారా పెట్టుబడిదారీ విధానం తమ గోతిని తామే తవ్వుకొంటున్నదని మార్క్స్ నిరూపించాడు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థ అంతర్జాలాన్ని అభివృద్ధి చేసి తన గోతిని తానే తవ్వుకొంటోంది. అమెరికా గ్రంథాలయాల్లో మార్క్సిస్టు గ్రంథా లను ఎంత నిషేధించినప్పటికీ అంతర్జాలంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’, ‘పెట్టుబడి’తోపాటు ఇతర కమ్యూనిస్టు సాహిత్యమంతా లభిస్తూనే ఉంది. లాభాల వేటలో సాంప్రదాయ ఉత్పత్తులను మానేసి కంప్యూటర్ వృత్తినే అభివృద్ధి చేయటం వల్ల ప్రపంచానికంతా మార్క్సిజాన్ని అందచేసినట్లయింది. అయితే అందులో సైతం తమ కమ్యూనిస్టు వ్యతిరేక విషాన్ని విరజిమ్మడం కొనసాగుతూనే ఉంది. ‘ఇంటి నుంచి పని’ నయా దోపిడీలో భాగమే! సామ్రాజ్యవాద దేశాల్లో వలస కార్మికులను నియమించుకొని దోపిడీ రేటును నిరంతరం పెంచడం కొనసాగిస్తూనే ఉన్నారు. పరిశ్రమలలో సబ్సిడీతో కూడిన రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఓవర్ టైం వేతనాలు చెల్లించి, కార్మికులతో అధిక గంటలు పనిచేయించి దోపిడీ రేటును పెంచడం జరుగుతోంది. అలాగే ‘‘వర్క్ ఫ్రం హోం’’ (ఇంటి నుంచి పని) అనే సౌకర్యాన్ని కల్పించి కార్మికులను దోపిడీ చేసే రేటును పెంచడం జరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం తనగోతిని తానే తవ్వుకుంటుం దని ‘‘పెట్టుబడి’’ గ్రంథం నిరూపించింది. ‘‘కమ్యూనిస్టు ప్రణాళిక’’ కార్మిక వర్గం ఏ విధంగా అధికారాన్ని చేపడుతుందనేది నిరూపిస్తే ‘‘పెట్టుబడి’’ గ్రంథం పెట్టుబడిదారులు లాభాల వేటలో కార్మికులతో ఎలా పని గంటల కాలం పెంచుతారో, ఆ సమయంలో దోపిడీ రేటును ఎలా పెంచుతారో వివరించింది. ఈ పనిగంటలు పెంచడానికి పెట్టుబడిదారులు ఎంతటి నీచపు పనులకైనా ఎగబడతారని మార్క్స్ వివరించారు. మార్క్స్ దాదాపు 30 ఏళ్లపాటు వివిధ దేశాల కార్మిక వర్గ పని పరిస్థితులను అధ్యయనం చేశారు. దీని కోసం ఆయన అనేక భాషలు సైతం నేర్చుకున్నారు. మార్క్స్ ఊహించినట్లుగానే పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలతో పాటు అమెరికాలో సైతం కార్మిక వర్గం తమకు బేరసారాల హక్కు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే హక్కు ఉండాలని, కనీస వేతనాలు నిర్ధారించి చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వీధుల్లోకి రావటమే కాకుండా సమ్మెలు సైతం చేస్తున్నారు.మార్క్సిజంలో మూడు అంతర్భాగాలైన తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం, శాస్త్రీయ సోషలిజం అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి విరామ మెరుగకుండా మార్క్స్ శ్రమించాల్సి వచ్చింది. అనేక నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఇంటి అద్దెను.. కిరాయి యజమానికి చెల్లించలేని కడు పేదరికంలో మగ్గింది మార్క్స్ కుటుంబం. మార్క్స్ భార్య జెన్నీ తన సంతానానికి పాలు ఇస్తుంటే శరీరంలో పాలు లేక రక్తం స్రవించే హృదయ విదారక ఘట్టాలు ఎవరూ మరిచిపోలేని విషయాలు. అంతటి కడు పేదరి కంలో మార్క్స్ జీవించినప్పటికి తన పయనాన్ని ఆపకుండా దోపిడీ రహస్యాన్ని ఛేదించి ప్రపంచ కార్మిక వర్గానికి మార్క్సిజాన్ని అందించాడు. ఆ మార్క్సిజం అజేయమని ప్రపంచ పరిణామాలు నిరూపిస్తూనే ఉన్నాయి.కార్ల్‌మార్క్స్ యవ్వనంలోనే ఒక మాటంటాడు. ‘‘నిర్జీవపు, నిస్సారపు కాకి బ్రతుకు వద్దు ‘మనకు’ ఒక లక్ష్యంతో, గమ్యంతో ముందుకు సాగాలంటాడు. మార్క్స్ చెప్పినట్లుగా ఆశావాదంతో మరింత ముందుకు సాగుదాం. బానిస సంకెళ్ళను తెంపుకుంటూ సకల దేశ కార్మికులను ఏకం చేద్దాం. అమెరికా సామ్రాజ్యవాద నయావలసవాద విధానాలను బహిర్గతం చేస్తూ వాటిని ప్రతిఘటిస్తూ ఈ భూగోళంపై యుద్ధాలకు తావులేని ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పుదాం. - సురవరం సుధాకరరెడ్డి వ్యాసకర్త సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి (నేడు కార్ల్‌మార్క్స్ 200వ జయంతి సందర్భంగా) -
చైనాలో ప్రపంచ మార్క్సిజం సదస్సు
బీజింగ్: రెండో ప్రపంచ మార్క్సిజం సదస్సును 2018, మే 5–6 తేదీల్లో చైనాలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా మార్క్సిజం పరిశోధకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహక బోర్డ్ చీఫ్ గు హైలియాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కారల్‌మార్క్స్ 200వ జయంతి ఉత్సవాలతో పాటు చైనాలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశంలో 21 శతాబ్దంలో మార్క్సిజం, చైనాలో దాని అభివృద్ధిపై చర్చిస్తాం’ అని తెలిపారు. ఇందులో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆధునీకరణకు చైనా తరహా పరిష్కారంతో పాటు పలు అంశాలను చర్చిస్తామన్నారు. చైనా యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను అత్యున్నత నేతగా నిలబెట్టేందుకు కమ్యూనిస్ట్ పార్టీ చైనా కాంగ్రెస్ సమావేశాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగా, జిన్‌పింగ్ రాజకీయ విధానాల్ని స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. -
సమన్వయంతోనే సాఫల్యం
సందర్భం మనిషికి కూడు, గుడ్డ, గూడు కల్పించి, భౌతిక అవసరాలను తీర్చడమే ఆదర్శ పాలనగా ప్రపంచం భావిస్తున్న రోజుల్లో మనిషికి కేవలం శరీరమే కాక బుద్ధి, మనసు, ఆత్మ ఉన్నాయని, వాటిని కూడా తృప్తి పరచే మార్గంతో పాటు సమస్త జీవులకు సంపూర్ణ కల్యాణాన్ని సమకూర్చే దిశగా పాలకుల ఆలోచన సాగాలని, ‘ఏకాత్మ మానవ దర్శనం’ పేరిట దీనదయాళ్జీ ప్రపంచ రాజకీయాలకు నూతన దిశా నిర్దేశనం చేశారు. ఆ ఆలోచననే నేటి భారతీయ జనతాపార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి దేశ ప్రజలను, ప్రత్యేకించి వారి ఆలోచనా విధానాన్ని రెండు భిన్న భావజాల స్రవంతులు బలంగా ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. వాటిలో ఒకటి పాశ్చాత్య, పారిశ్రామిక సమాజంలో పుట్టి, పెరిగి మన దేశంలో వేళ్లూనుకున్నది కాగా, మరొకటి నేటికీ సజీవంగా నిలి చిన ప్రాచీన భారత నాగరికత, సంస్కృతులలో వేళ్లూనుకుని వృద్ధి చెందినది. మార్క్సిజం, కమ్యూనిజంగా ఒకటి ప్రచారంలో ఉంటే, మరొకటి భారత జాతీయతావాదంగా ప్రాచుర్యం పొందింది. దేశ ప్రజలనే గాక ప్రపంచ ప్రజ లను సైతం ప్రభావితం చేసిన, చేస్తున్న 20వ శతాబ్దపు రెండు సిద్ధాంతాలతో స్థూల పరిచయమైనా లేకుండానే అతి తరచుగా ఇరు పక్షాల విమర్శకులు, సమర్థకులు కూడా వాదోపవాదాలకు, ఖండనమండనలకు దిగుతుంటారు. అందువల్ల ఈ రెండింటిని తులనాత్మకంగా పరిశీలించి, చర్చించడం నేటి యువతరానికే గాక, భావితరాలకు సైతం ఉపయోగకరం. మార్క్సిజం జననం పశ్చిమ దేశాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం వంటి ప్రజాస్వామిక భావనలకు ఆదరణ లభిస్తున్న తరుణంలో కార్ల్ మార్క్స్ వర్గకలహ సిద్ధాం తాన్ని ముందుకు తెచ్చారు. రాజ్య విహీన సమాజం అనే అనివార్య గమ్యాన్ని వర్గకలహ సాధనంతో త్వరితం చేసి, శ్రామిక నియంతృత్వం నెలకొల్పి, సమసమాజ నిర్మాణం జరపాలని సూచించారు. ఆయన ప్రవచించిన సిద్ధాంతం మార్క్సిజం కాగా, దాన్ని అనుసరించే వారు మార్క్సిస్టులయ్యారు. వారు స్థాపించిన రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ. లెనిన్ నాయకత్వంలో 1917లో సోవియట్ రష్యాలో, మావో నాయకత్వంలో 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రష్యా విప్లవ స్ఫూర్తితో 1920లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రారంభమైంది. రష్యా, చైనాల మార్గాల్లో దేన్ని అనుసరించాలి అనే సిద్ధాంత విభేదంతో 1964లో సీపీఐలో వచ్చిన తొలి చీలికతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ఏర్పడి, íసీపీఎంగా ప్రసిద్ధమైంది. ఆ తరువాత సీపీఎం నుంచి నక్సలైట్లు చీలిపోయారు. వారిలో సైతం మరెన్నో చీలిక వర్గాలు ఏర్పడ్డాయి. మార్క్సిజం – భారతీయత తమదే సత్యమని, తద్విరుద్ధ విశ్వాసాలు, సిద్ధాంతాలు, వ్యక్తులను తమ దారి లోకి తెచ్చుకోవాలని, సమస్త ప్రకృతి మానవుని కోసమే కనుక దానిపై ఆధిపత్యం వహించడం మానవునికి లభించిన హక్కుగా మార్క్సిస్టులు భావిస్తారు. ప్రకృతిలోని లక్షలాది జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవి మాత్రమే అని, జీవరాశులన్నీ సుఖసమృద్ధులతో జీవించాలి అనేది భారతీయ దృక్పథం. ఆయుధాలే అధికారానికి ఆధారమనేది మార్క్సిస్టు భావన కాగా, సత్సంకల్పంతో కూడిన శక్తే ప్రపంచ శ్రేయస్సుకు ఆలంబన కాగలదని భారతీయత భావిస్తుంది. ఫలితం పెట్టుబడిదారుదా, ప్రభుత్వానిదా అనే తేడా మినహా, ప్రకృతిని కొల్లగొట్టడంలో తప్పు లేదని మార్క్సిస్టులు భావిస్తారు. ప్రకృతిని తల్లిగా భావిస్తూ మనిషి మనుగడ సాగించాలన్నదే భారతీయ భావన. ఆర్.ఎస్.ఎస్ ఆవిర్భావం 1925 అక్టోబరులో విజయదశమి నాడు నాగపూర్‌లోని ఒక మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ప్రారంభమైంది. వైద్యవిద్యలో పట్టభద్రుడైన కేశవరావ్ బలీరావ్ు హెడ్గేవార్ అనే యువకుడు పిడికెడు యువకులతో కలసి వ్యాయామం, ఆట పాటల అనంతరం దేశ రాజకీయాలు, సామాజిక పరిస్థితులపై చర్చలు జరుపుకోవడంగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారతదేశం మన మాతృభూమి దీని మేలు కోరే వారందరూ నాకు మిత్రులు, నాశనం కోరే వారందరూ నాకు శతృవులు, అనే ఒకే శతృ, మిత్ర భావన కలిగి, ఈ దేశ సంస్కృతిని, ఇక్కడ జన్మించిన మహా పురుషుల వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించడమే ‘జాతీయత’ అని అది భావించింది. ఆస్తికుడైనా, నాస్తికుడైనా, మతమేదైనాసరే, భారతదేశంలో పుట్టి ఈ మౌలిక సత్యాన్ని అంగీకరించి, ఆచరించే వారందరూ హిందువులు, భారతీయులేననే అవగాహనతో ముందుకు సాగింది. ఆర్.ఎస్.ఎస్ వికాసం హిందువుల అనైక్యతే భారత్ పరాధీనతకు కారణమని, గత వైభవాన్ని ప్రాప్తింపజేయడానికి వారిని ఐక్యం చేయడమే ఏకైక మార్గమని నమ్మి, స్వచ్ఛందంగా ఈ కార్యాన్ని స్వీకరించిన వారిని ‘స్వయంసేవక్’లని, వారితో కూడిన సంఘాన్ని ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’(సంఘం) అని పిలుస్తారు. సమస్త ప్రాణులన్నీ సుఖంగా జీవించాలని ఆకాంక్షించే హిందువులు శక్తిశాలురైనప్పుడే ప్రపంచం అంతటా శాంతి సౌభాగ్యాలు, సహోదర భావం వెల్లివిరుస్తాయనే భావన సిద్ధాంతంగా సంఘం రూపుదిద్దుకొన్నది. సమయ పాలన, స్వయం ప్రేరిత అనుశాసనం నియమాలు అయ్యాయి. సంఘం ఒక సామాజిక సంస్థగా రూపుదిద్దుకోవడంలోనూ, ఒక సిద్ధాంతాన్ని, కార్యాచరణను ఏర్పరచుకోవడంలోనూ డాక్టర్జీగా ప్రసిద్ధులైన కేశవరావు బలీరావ్ హెడ్గేవార్ కేవలం నిమిత్త మాత్రులయ్యారు. అప్పటి వరకు జరిగిన నిర్ణయాలన్నీ స్వయం సేవకులు చర్చించి అందరి ఆమోదంతో తీర్మానించినవే. హిందూ సంస్కృతికి ప్రతీక అయిన కాషాయ పతాకాన్ని సంఘానికి గురువుగా చేసుకున్నారు. సంఘశిబిరాల్లో శిక్షణ పొంది, సంఘ కార్యానికి పూర్తి సమయం స్వయం సేవకులుగా పనిచేస్తామని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్యకర్తలతో ‘ప్రచారక్’ వ్యవస్థ ప్రారంభమైంది. 1940లో డాక్టర్జీ మరణానంతరం గురూజీగా ప్రసిద్ధులైన మాధవ సదాశివ గోళ్వల్కర్ సంఘ్ అధ్యక్ష (సర్సంఘ్చాలక్) బాధ్యతలను చేపట్టారు. వివిధ క్షేత్రాలలో సంఘ ప్రవేశం భరతమాత సర్వాంగీణ ఉన్నతి కోసం అన్ని రంగాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ప్రగతి సాధించాలన్న డాక్టర్జీ ఆకాంక్షల బీజాలు గురూజీ నేతృత్వంలో సాకారం కావడం మొదలైనాయి. విద్యార్థి రంగంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, కర్షక రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, రాజకీయ క్షేత్రంలో డా. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించిన భారతీయ జనసంఘ్ తదితర సంస్థలతో పాటు వివిధ రంగాల్లో సేవా సంస్థలు కూడా ప్రారంభమయ్యాయి. జనసంఘ్‌తో సహా ఈ సంస్థలన్నీ స్వీయ నిబంధనావళి, ప్రత్యేక సభ్యత్వం, కార్య నిర్వాహక వర్గం వంటి ఏర్పాట్లతో స్వయం ప్రతిపత్తి కలిగినవే. ఇవేవీ సంఘ్‌కు అనుబంధ సంస్థలు కావు. దత్తో పంత్ ఠేగ్డే, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కార్మిక రంగంలో విశేష సేవలను అందించారు. దేశ ప్రగతి సాధన జాతీయకరణ ద్వారా పూర్తిగా ప్రభుత్వ పెత్తనంలోనూ, పెట్టుబడులతోనూ జరగాలా? లేదా ప్రయివేటీకరణతో పూర్తిగా పెట్టుబడిదారీ తరహాలో జరగాలా? అని మల్లగుల్లాలు పడుతున్న దశలో సామాజికీకరణ ద్వారా దేశ ప్రగతి జరగాలనే నూతన ఆలోచనను వారు ప్రపంచానికి అందించారు. మనిషికి కూడు, గుడ్డ, గూడు కల్పించి, భౌతిక అవసరాలను తీర్చడమే ఆదర్శపాలనగా భావిస్తున్న రోజుల్లో మనిషికి కేవలం శరీరమే కాక బుద్ధి, మనసు, ఆత్మ ఉన్నాయని, వాటిని కూడా తృప్తి పరచడంతో పాటు సమస్త జీవులకు కల్యాణాన్ని సమకూర్చే దిశగా పాలకుల ఆలోచన సాగాలని, ‘ఏకాత్మ మానవ దర్శనం’ పేరిట దీనదయాళ్జీ ప్రపంచ రాజకీయాలకు నూతన దిశా నిర్దేశనం చేశారు. ఆ ఆలోచననే నేటి భారతీయ జనతాపార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది. సేవా కార్యాలలో సంఘం సంఘ కార్యకర్తలు వివిధ సందర్భాలలో దేశానికి, సమాజానికి తమ సేవలు అందిస్తూనే వచ్చారు. 1948లో నాటి హోం మంత్రి పటేల్ అభ్యర్థన మేరకు గురూజీ కశ్మీర్ వెళ్లి, మహారాజుతో మాట్లాడి భారత్‌లో విలీనానికి ఒప్పిం చారు. 1962 నాటి చైనా యుద్ధ సమయంలో సంఘ స్వయం సేవకుల సేవలను గుర్తించి ప్రధాని నెహ్రూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనమని స్వయం సేవకులను ఆహ్వానించారు. 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కోరిక మేరకు గురూజీ పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి యుద్ధ సమయంలో సైన్యానికి తోడ్పాటు అందించడానికి ప్రజలను సమాయత్తం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో దివిసీమను తుపాను ముంచెత్తినప్పుడూ, గుజ రాత్లో మోర్వీ వరదల సమయంలోనూ స్వయం సేవకులు సేవలను అందించారు. ప్రధాని ఇందిరాగాంధీ రష్యా వెళ్ళినప్పుడు తడుముకోకుండా ‘ఆర్.ఎస్.ఎస్. భారత్‌లో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ’ అని చెప్పారు. అది సేవా సంస్థగా సంఘ నిబద్ధతకు కితాబు. కమ్యూనిస్టులది, హనుమంతునిది కూడా ఎర్రజెండానే అని, కమ్యూనిస్టులు కూడా హిందువులేనని, వారు కూడా రేపటి స్వయం సేవకులేననే గురూజీ చింతనలో పూర్తి సమన్వయ దృక్పథం వెల్లడవుతుంది. ఈ సమన్వయ దృక్పథమే క్రింది స్థాయి సంఘ కార్యకర్తలదాకా వ్యాపించింది. సంఘం మార్క్సిజం కమ్యూనిస్టుల్లో ఆర్థిక పరాధీనత ఒక బలహీనత. వారిని బలోపేతం చేయడానికి తోడ్పడే ప్రజా సంఘాలు పార్టీకి అనుబంధం కావడము, అధికార ప్రాప్తితో భ్రష్టమైనప్పుడు సరిదిద్దే నైతిక శక్తిగల కేంద్రం లేకపోవడమూ మరో పెద్ద లోపం. ఆరెస్సెస్‌కు ఆర్థిక పరాధీనత లేకపోవడమూ, అధికారానికి అది దూరంగా ఉండటమూ, సంఘ సిద్ధాంత స్ఫూర్తితో వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న సంస్థలు స్వతంత్రమైనవే అయినా నైతికత విషయంలో సంఘం వాటిని సరిదిద్దడంతో అవి సజావుగా ముందుకు సాగుతున్నాయి. ఒక్కసారి సంఘశాఖకు వచ్చి భగవధ్వజం ముందు నిలబడి ప్రణామం చేస్తే అతడు స్వయంసేవక్ అయి, సంఘ కుటుంబంలో సభ్యుడై పోతాడు. సభ్యత్వం రద్దు, బహిష్కరణ లాంటివేవీ సంఘంలో ఉండవు. కారణాంతరాల వల్ల కార్యక్రమాలకు రాలేక పోయినా వారిని సంఘ బంధువులుగానే భావించి, స్నేహాన్ని కొనసాగిస్తూ, వివిధ సందర్భాలలో సంఘం వారి సహకారాన్ని పొందుతూనే ఉంటుంది. సభ్యత్వం సంపాదించడం కూడా కష్టమైన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం మాజీ కమ్యూనిస్టును తమ మొదటి శతృవుగా భావిస్తున్నారు. నానాటికి సంఘ శక్తి పెరగడానికి, మార్క్సిస్టుల శక్తి తరగడానికి తగిన కారణాలను విశ్లేషించుకోవడం అవసరం. ప్రపంచ చరిత్రలో వంద సంవత్సరాలు అతి తక్కువ సమయమే కావచ్చు. కానీ, అనుభవాలను సమీక్షించుకొని, తప్పొప్పులను సవరించుకొని ముందుకు సాగడం ప్రజా శ్రేయస్సుకు ఎంతైనా అవసరం. పి. వేణుగోపాల్‌రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్ మొబైల్ : 94904 70064 (ఈ విజయదశమి రోజు ఆర్.ఎస్.ఎస్. 92వ వ్యవస్థాపక దినం సందర్భంగా) -
నిలకడగా ఉన్న మార్క్సిజమ్
► సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రపంచంలో అన్ని సిద్ధాతాలు మారినా... ఒక్క మార్క్సిజమ్ మాత్రం నిలకడగా ఉందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత అన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ సభ నిర్వహించారు. సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. దీనికి విముక్తి ఒక సోషలిజంతోనే సాధ్యమన్నారు. దోపిడీ సమాజంలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. 2016 నవంబర్ 07 నుంచి ప్రపంచమంతా అక్టోబర్ విప్లవ శతజయంతి సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల వ్యవస్థ అంతంకాక తప్పదన్నారు. 1917లో ప్రపంచంలో మొదటిసారిగా రష్యాలో కార్మికవర్గం నాయకత్వాన విప్లవం వచ్చిందని గుర్తు చేశారు. కార్మికవర్గమే అన్ని పోరాటాలకు ముందుంటోందని తెలిపారు. ఆ పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోగలుగుతున్నామని తెలిపారు. ఏ సిద్ధాంతం ప్రజల సమస్యలను తీర్చలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. ప్రజా, కార్మికుల సమస్యలు పరిష్కరించే సత్తా తమకే ఉందని తెలిపారు. ఉద్యమాలతోనే హక్కులను, సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, జిల్లా కార్యదర్శి రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, నాయకులు పాండురంగారెడ్డి, వెంకటరాజ్యం, వాజిద్, నాగేశ్వర్రావు, సాయిలు, యాదవరెడ్డి, పెంటయ్య, కోటేశ్వర్రావు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మార్క్సిజానికి పునరంకితం కావాలి
క్యాడర్‌కు గణపతి పిలుపు న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు మరిచిపోలేని నాలుగు ముఖ్య చరిత్రాత్మక ఘట్టాలున్నాయని, ఈ ఘట్టాల వార్షికోత్సవాలను పురస్కరించుకొని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానానికి మావోయిస్టులందరు పునరంకితం కావాలని సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి గణపతి బహిరంగ లేఖలో పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. చైనాలో అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థకు తిలోదకాలిచ్చి కమ్యూనిస్టు పాలనకు తెరలేపిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవెల్యూషన్-జీపీసీఆర్) 50వ వార్షికోత్సవాన్ని, భారత్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ పోరాటం 50వ వార్షికాత్సవాన్ని, ప్రపంచాన్నే కుదిపేసిన రష్యా సోషలిస్ట్ విప్లవం శతవార్షికోత్సవాన్ని, కాలం ప్రసవించి కారల్ మార్క్స్ కని రెండు శతాబ్దాలు అవుతున్న సందర్భమే ఈ నాలుగు ప్రధాన చరిత్రాత్మక ఘట్టాలని, ఈ వార్శికోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని, 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు (గడిచిపోయిన కాలం), దేశంలో నక్సల్బరి సాయుధ తిరుగుబాటు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది 23మే నెల నుంచి మే 29వ తేదీ వరకు, రష్యా సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది నవంబర్ ఏడు నుంచి 13వ తేదీ వరకు, కారల్ మార్క్స్ ద్విశత జయంతిని పురస్కరించుకొని 2018, మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ ప్రజా సంఘటిత కార్యక్రమాలను నిర్వహించాలని మావోయిస్టు నేత గణపతి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల తాను సూచించిన తేదీల్లో వార్షిక వారోత్సవాలను నిర్వహించడం కుదరకపోతే అనువైన తేదీల్లో నిర్వహించాలని ఆయన సూచించారు. నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు. దేశంలో జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాలను శక్తులను కూడగట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో కొంత వెసలుబాటు దోరణి అవలింబించినప్పటికీ నక్సలిజం లక్ష్యానికి మాత్రం దూరం వెళ్లకూడదని చెప్పారు. నక్సలిజాన్ని ఏదోరకంగా సమర్ధించే శక్తులతోనే మమేకం కావాలని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా నయా పెట్టుబడిదారి విధానం రాజ్యమేలుతున్న కారణంగా ప్రజల్లో అసహన పరిస్థితులు, కొన్ని చోట్ల తిరుగుబాటు పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కమ్యూనిజానికి, సోషలిస్టు విప్లవాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి సమాజం దుష్ర్పచారం సాగిస్తోందని, తాను చెప్పిన నాలుగు కమ్యూనిస్టు చారిత్రక ఘట్టాలను పురస్కరించుకొని ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. మేధోపరంగా, రాజకీయంగా, ప్రజా ఉద్యమాలపరంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.