సమన్వయంతోనే సాఫల్యం | P venu gopal reddy column on marxism | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే సాఫల్యం

Published Wed, Sep 27 2017 12:55 AM | Last Updated on Wed, Sep 27 2017 12:56 AM

P venu gopal reddy column on marxism

సందర్భం

మనిషికి కూడు, గుడ్డ, గూడు కల్పించి, భౌతిక అవసరాలను తీర్చడమే ఆదర్శ పాలనగా ప్రపంచం భావిస్తున్న రోజుల్లో మనిషికి కేవలం శరీరమే కాక బుద్ధి, మనసు, ఆత్మ ఉన్నాయని, వాటిని కూడా తృప్తి పరచే మార్గంతో పాటు సమస్త జీవులకు సంపూర్ణ కల్యాణాన్ని సమకూర్చే దిశగా పాలకుల ఆలోచన సాగాలని, ‘ఏకాత్మ మానవ దర్శనం’ పేరిట దీనదయాళ్జీ ప్రపంచ రాజకీయాలకు నూతన దిశా నిర్దేశనం చేశారు. ఆ ఆలోచననే  నేటి భారతీయ జనతాపార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది.

స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి దేశ ప్రజలను, ప్రత్యేకించి వారి ఆలోచనా విధానాన్ని రెండు భిన్న భావజాల స్రవంతులు బలంగా ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. వాటిలో ఒకటి పాశ్చాత్య, పారిశ్రామిక సమాజంలో పుట్టి, పెరిగి మన దేశంలో వేళ్లూనుకున్నది కాగా, మరొకటి నేటికీ సజీవంగా నిలి చిన ప్రాచీన భారత నాగరికత, సంస్కృతులలో వేళ్లూనుకుని వృద్ధి చెందినది. మార్క్సిజం, కమ్యూనిజంగా ఒకటి ప్రచారంలో ఉంటే, మరొకటి భారత జాతీయతావాదంగా ప్రాచుర్యం పొందింది. దేశ ప్రజలనే గాక ప్రపంచ ప్రజ లను సైతం ప్రభావితం చేసిన, చేస్తున్న 20వ శతాబ్దపు రెండు సిద్ధాంతాలతో స్థూల పరిచయమైనా లేకుండానే అతి తరచుగా ఇరు పక్షాల విమర్శకులు, సమర్థకులు కూడా వాదోపవాదాలకు, ఖండనమండనలకు దిగుతుంటారు. అందువల్ల ఈ రెండింటిని తులనాత్మకంగా పరిశీలించి, చర్చించడం నేటి యువతరానికే గాక, భావితరాలకు సైతం ఉపయోగకరం.

మార్క్సిజం జననం
పశ్చిమ దేశాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం వంటి ప్రజాస్వామిక భావనలకు ఆదరణ లభిస్తున్న తరుణంలో కార్ల్‌ మార్క్స్‌ వర్గకలహ సిద్ధాం తాన్ని ముందుకు తెచ్చారు. రాజ్య విహీన సమాజం అనే అనివార్య గమ్యాన్ని వర్గకలహ సాధనంతో త్వరితం చేసి, శ్రామిక నియంతృత్వం నెలకొల్పి, సమసమాజ నిర్మాణం జరపాలని సూచించారు. ఆయన ప్రవచించిన సిద్ధాంతం మార్క్సిజం కాగా, దాన్ని అనుసరించే వారు మార్క్సిస్టులయ్యారు. వారు స్థాపించిన రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ. లెనిన్‌ నాయకత్వంలో 1917లో సోవియట్‌ రష్యాలో, మావో నాయకత్వంలో 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రష్యా విప్లవ స్ఫూర్తితో 1920లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) ప్రారంభమైంది. రష్యా, చైనాల మార్గాల్లో దేన్ని అనుసరించాలి అనే సిద్ధాంత విభేదంతో 1964లో సీపీఐలో వచ్చిన తొలి చీలికతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు) ఏర్పడి, íసీపీఎంగా ప్రసిద్ధమైంది. ఆ తరువాత సీపీఎం నుంచి నక్సలైట్లు చీలిపోయారు. వారిలో సైతం మరెన్నో చీలిక వర్గాలు ఏర్పడ్డాయి.

మార్క్సిజం – భారతీయత
తమదే సత్యమని, తద్విరుద్ధ విశ్వాసాలు, సిద్ధాంతాలు, వ్యక్తులను తమ దారి లోకి తెచ్చుకోవాలని, సమస్త ప్రకృతి మానవుని కోసమే కనుక దానిపై ఆధిపత్యం వహించడం మానవునికి లభించిన హక్కుగా మార్క్సిస్టులు భావిస్తారు. ప్రకృతిలోని లక్షలాది జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవి మాత్రమే అని, జీవరాశులన్నీ సుఖసమృద్ధులతో జీవించాలి అనేది భారతీయ దృక్పథం. ఆయుధాలే అధికారానికి ఆధారమనేది మార్క్సిస్టు భావన కాగా, సత్సంకల్పంతో కూడిన శక్తే ప్రపంచ శ్రేయస్సుకు ఆలంబన కాగలదని భారతీయత భావిస్తుంది. ఫలితం పెట్టుబడిదారుదా, ప్రభుత్వానిదా అనే తేడా మినహా,  ప్రకృతిని కొల్లగొట్టడంలో తప్పు లేదని మార్క్సిస్టులు భావిస్తారు. ప్రకృతిని తల్లిగా భావిస్తూ మనిషి మనుగడ సాగించాలన్నదే భారతీయ భావన.

ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆవిర్భావం
1925 అక్టోబరులో విజయదశమి నాడు నాగపూర్‌లోని ఒక మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రారంభమైంది. వైద్యవిద్యలో పట్టభద్రుడైన కేశవరావ్‌ బలీరావ్‌ు హెడ్గేవార్‌ అనే యువకుడు పిడికెడు యువకులతో కలసి వ్యాయామం, ఆట పాటల అనంతరం దేశ రాజకీయాలు, సామాజిక పరిస్థితులపై చర్చలు జరుపుకోవడంగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారతదేశం మన మాతృభూమి దీని మేలు కోరే వారందరూ నాకు మిత్రులు, నాశనం కోరే వారందరూ నాకు శతృవులు, అనే ఒకే శతృ, మిత్ర భావన కలిగి, ఈ దేశ సంస్కృతిని, ఇక్కడ జన్మించిన మహా పురుషుల వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించడమే ‘జాతీయత’ అని అది భావించింది. ఆస్తికుడైనా, నాస్తికుడైనా, మతమేదైనాసరే, భారతదేశంలో పుట్టి ఈ మౌలిక సత్యాన్ని అంగీకరించి, ఆచరించే వారందరూ హిందువులు, భారతీయులేననే అవగాహనతో ముందుకు సాగింది.

ఆర్‌.ఎస్‌.ఎస్‌ వికాసం
హిందువుల అనైక్యతే భారత్‌ పరాధీనతకు కారణమని, గత వైభవాన్ని ప్రాప్తింపజేయడానికి వారిని ఐక్యం చేయడమే ఏకైక మార్గమని నమ్మి, స్వచ్ఛందంగా ఈ కార్యాన్ని స్వీకరించిన వారిని ‘స్వయంసేవక్‌’లని, వారితో కూడిన సంఘాన్ని ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌’(సంఘం) అని పిలుస్తారు. సమస్త ప్రాణులన్నీ సుఖంగా జీవించాలని ఆకాంక్షించే హిందువులు శక్తిశాలురైనప్పుడే ప్రపంచం అంతటా శాంతి సౌభాగ్యాలు, సహోదర భావం వెల్లివిరుస్తాయనే భావన సిద్ధాంతంగా సంఘం రూపుదిద్దుకొన్నది. సమయ పాలన, స్వయం ప్రేరిత అనుశాసనం నియమాలు అయ్యాయి. సంఘం ఒక సామాజిక సంస్థగా రూపుదిద్దుకోవడంలోనూ, ఒక సిద్ధాంతాన్ని, కార్యాచరణను ఏర్పరచుకోవడంలోనూ డాక్టర్జీగా ప్రసిద్ధులైన కేశవరావు బలీరావ్‌ హెడ్గేవార్‌ కేవలం నిమిత్త మాత్రులయ్యారు. అప్పటి వరకు జరిగిన నిర్ణయాలన్నీ స్వయం సేవకులు చర్చించి అందరి ఆమోదంతో తీర్మానించినవే. హిందూ సంస్కృతికి ప్రతీక అయిన కాషాయ పతాకాన్ని సంఘానికి గురువుగా చేసుకున్నారు. సంఘశిబిరాల్లో శిక్షణ పొంది, సంఘ కార్యానికి పూర్తి సమయం స్వయం సేవకులుగా పనిచేస్తామని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్యకర్తలతో ‘ప్రచారక్‌’ వ్యవస్థ ప్రారంభమైంది. 1940లో డాక్టర్జీ మరణానంతరం గురూజీగా ప్రసిద్ధులైన మాధవ సదాశివ గోళ్వల్కర్‌ సంఘ్‌ అధ్యక్ష (సర్‌సంఘ్‌చాలక్‌) బాధ్యతలను చేపట్టారు.

వివిధ క్షేత్రాలలో సంఘ ప్రవేశం
భరతమాత సర్వాంగీణ ఉన్నతి కోసం అన్ని రంగాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ప్రగతి సాధించాలన్న డాక్టర్జీ ఆకాంక్షల బీజాలు గురూజీ నేతృత్వంలో సాకారం కావడం మొదలైనాయి. విద్యార్థి రంగంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్‌ సంఘ్, ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, కర్షక రంగంలో భారతీయ కిసాన్‌ సంఘ్, రాజకీయ క్షేత్రంలో డా. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రారంభించిన భారతీయ జనసంఘ్‌ తదితర సంస్థలతో పాటు వివిధ రంగాల్లో సేవా సంస్థలు కూడా ప్రారంభమయ్యాయి. జనసంఘ్‌తో సహా ఈ సంస్థలన్నీ స్వీయ నిబంధనావళి, ప్రత్యేక సభ్యత్వం, కార్య నిర్వాహక వర్గం వంటి ఏర్పాట్లతో స్వయం ప్రతిపత్తి కలిగినవే. ఇవేవీ సంఘ్‌కు అనుబంధ సంస్థలు కావు.
దత్తో పంత్‌ ఠేగ్డే, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షులుగా కార్మిక రంగంలో విశేష సేవలను అందించారు. దేశ ప్రగతి సాధన జాతీయకరణ ద్వారా పూర్తిగా ప్రభుత్వ పెత్తనంలోనూ, పెట్టుబడులతోనూ జరగాలా? లేదా ప్రయివేటీకరణతో పూర్తిగా పెట్టుబడిదారీ తరహాలో జరగాలా? అని మల్లగుల్లాలు పడుతున్న దశలో సామాజికీకరణ ద్వారా దేశ ప్రగతి జరగాలనే నూతన ఆలోచనను వారు ప్రపంచానికి అందించారు. మనిషికి కూడు, గుడ్డ, గూడు కల్పించి, భౌతిక అవసరాలను తీర్చడమే ఆదర్శపాలనగా భావిస్తున్న రోజుల్లో మనిషికి కేవలం శరీరమే కాక బుద్ధి, మనసు, ఆత్మ ఉన్నాయని, వాటిని కూడా తృప్తి పరచడంతో పాటు సమస్త జీవులకు కల్యాణాన్ని సమకూర్చే దిశగా పాలకుల ఆలోచన సాగాలని, ‘ఏకాత్మ మానవ దర్శనం’ పేరిట దీనదయాళ్జీ ప్రపంచ రాజకీయాలకు నూతన దిశా నిర్దేశనం చేశారు. ఆ ఆలోచననే నేటి భారతీయ జనతాపార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది.

సేవా కార్యాలలో సంఘం
సంఘ కార్యకర్తలు వివిధ సందర్భాలలో దేశానికి, సమాజానికి తమ సేవలు అందిస్తూనే వచ్చారు. 1948లో నాటి హోం మంత్రి పటేల్‌ అభ్యర్థన మేరకు గురూజీ కశ్మీర్‌ వెళ్లి, మహారాజుతో మాట్లాడి భారత్‌లో విలీనానికి ఒప్పిం చారు. 1962 నాటి చైనా యుద్ధ సమయంలో సంఘ స్వయం సేవకుల సేవలను గుర్తించి ప్రధాని నెహ్రూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనమని స్వయం సేవకులను ఆహ్వానించారు. 1965లో నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి కోరిక మేరకు గురూజీ పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి యుద్ధ సమయంలో సైన్యానికి తోడ్పాటు అందించడానికి ప్రజలను సమాయత్తం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో దివిసీమను తుపాను ముంచెత్తినప్పుడూ, గుజ రాత్‌లో మోర్వీ వరదల సమయంలోనూ స్వయం సేవకులు సేవలను అందించారు. ప్రధాని ఇందిరాగాంధీ రష్యా వెళ్ళినప్పుడు తడుముకోకుండా ‘ఆర్‌.ఎస్‌.ఎస్‌. భారత్‌లో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ’ అని చెప్పారు. అది సేవా సంస్థగా సంఘ నిబద్ధతకు కితాబు. కమ్యూనిస్టులది, హనుమంతునిది కూడా ఎర్రజెండానే అని, కమ్యూనిస్టులు కూడా హిందువులేనని, వారు కూడా రేపటి స్వయం సేవకులేననే గురూజీ చింతనలో పూర్తి సమన్వయ దృక్పథం వెల్లడవుతుంది. ఈ సమన్వయ దృక్పథమే క్రింది స్థాయి సంఘ కార్యకర్తలదాకా వ్యాపించింది.

సంఘం మార్క్సిజం
కమ్యూనిస్టుల్లో ఆర్థిక పరాధీనత ఒక బలహీనత. వారిని బలోపేతం చేయడానికి తోడ్పడే ప్రజా సంఘాలు పార్టీకి అనుబంధం కావడము, అధికార ప్రాప్తితో భ్రష్టమైనప్పుడు సరిదిద్దే నైతిక శక్తిగల కేంద్రం లేకపోవడమూ మరో పెద్ద లోపం. ఆరెస్సెస్‌కు ఆర్థిక పరాధీనత లేకపోవడమూ, అధికారానికి అది దూరంగా ఉండటమూ, సంఘ సిద్ధాంత స్ఫూర్తితో వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న సంస్థలు స్వతంత్రమైనవే అయినా నైతికత విషయంలో సంఘం వాటిని సరిదిద్దడంతో అవి సజావుగా ముందుకు సాగుతున్నాయి. ఒక్కసారి సంఘశాఖకు వచ్చి భగవధ్వజం ముందు నిలబడి ప్రణామం చేస్తే అతడు స్వయంసేవక్‌ అయి, సంఘ కుటుంబంలో సభ్యుడై పోతాడు. సభ్యత్వం రద్దు, బహిష్కరణ లాంటివేవీ సంఘంలో ఉండవు. కారణాంతరాల వల్ల కార్యక్రమాలకు రాలేక పోయినా వారిని సంఘ బంధువులుగానే భావించి, స్నేహాన్ని కొనసాగిస్తూ, వివిధ సందర్భాలలో సంఘం వారి సహకారాన్ని పొందుతూనే ఉంటుంది. సభ్యత్వం సంపాదించడం కూడా కష్టమైన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం మాజీ కమ్యూనిస్టును తమ మొదటి శతృవుగా భావిస్తున్నారు.

నానాటికి సంఘ శక్తి పెరగడానికి, మార్క్సిస్టుల శక్తి తరగడానికి తగిన కారణాలను విశ్లేషించుకోవడం అవసరం. ప్రపంచ చరిత్రలో వంద సంవత్సరాలు అతి తక్కువ సమయమే కావచ్చు. కానీ, అనుభవాలను సమీక్షించుకొని, తప్పొప్పులను సవరించుకొని ముందుకు సాగడం ప్రజా శ్రేయస్సుకు ఎంతైనా అవసరం.


పి. వేణుగోపాల్‌రెడ్డి
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్‌ అధ్యక్షులు, హైదరాబాద్‌
మొబైల్‌ : 94904 70064
(ఈ విజయదశమి రోజు ఆర్‌.ఎస్‌.ఎస్‌. 92వ వ్యవస్థాపక దినం సందర్భంగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement