నిలకడగా ఉన్న మార్క్సిజమ్
► సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రపంచంలో అన్ని సిద్ధాతాలు మారినా... ఒక్క మార్క్సిజమ్ మాత్రం నిలకడగా ఉందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత అన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ సభ నిర్వహించారు. సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. దీనికి విముక్తి ఒక సోషలిజంతోనే సాధ్యమన్నారు. దోపిడీ సమాజంలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు.
2016 నవంబర్ 07 నుంచి ప్రపంచమంతా అక్టోబర్ విప్లవ శతజయంతి సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల వ్యవస్థ అంతంకాక తప్పదన్నారు. 1917లో ప్రపంచంలో మొదటిసారిగా రష్యాలో కార్మికవర్గం నాయకత్వాన విప్లవం వచ్చిందని గుర్తు చేశారు. కార్మికవర్గమే అన్ని పోరాటాలకు ముందుంటోందని తెలిపారు. ఆ పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోగలుగుతున్నామని తెలిపారు. ఏ సిద్ధాంతం ప్రజల సమస్యలను తీర్చలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. ప్రజా, కార్మికుల సమస్యలు పరిష్కరించే సత్తా తమకే ఉందని తెలిపారు.
ఉద్యమాలతోనే హక్కులను, సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, జిల్లా కార్యదర్శి రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, నాయకులు పాండురంగారెడ్డి, వెంకటరాజ్యం, వాజిద్, నాగేశ్వర్‌రావు, సాయిలు, యాదవరెడ్డి, పెంటయ్య, కోటేశ్వర్‌రావు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.