మార్క్సిజానికి పునరంకితం కావాలి
క్యాడర్కు గణపతి పిలుపు
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు మరిచిపోలేని నాలుగు ముఖ్య చరిత్రాత్మక ఘట్టాలున్నాయని, ఈ ఘట్టాల వార్షికోత్సవాలను పురస్కరించుకొని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానానికి మావోయిస్టులందరు పునరంకితం కావాలని సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి గణపతి బహిరంగ లేఖలో పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు.
చైనాలో అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థకు తిలోదకాలిచ్చి కమ్యూనిస్టు పాలనకు తెరలేపిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవెల్యూషన్-జీపీసీఆర్) 50వ వార్షికోత్సవాన్ని, భారత్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ పోరాటం 50వ వార్షికాత్సవాన్ని, ప్రపంచాన్నే కుదిపేసిన రష్యా సోషలిస్ట్ విప్లవం శతవార్షికోత్సవాన్ని, కాలం ప్రసవించి కారల్ మార్క్స్ కని రెండు శతాబ్దాలు అవుతున్న సందర్భమే ఈ నాలుగు ప్రధాన చరిత్రాత్మక ఘట్టాలని, ఈ వార్శికోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని, 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు (గడిచిపోయిన కాలం), దేశంలో నక్సల్బరి సాయుధ తిరుగుబాటు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది 23మే నెల నుంచి మే 29వ తేదీ వరకు, రష్యా సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది నవంబర్ ఏడు నుంచి 13వ తేదీ వరకు, కారల్ మార్క్స్ ద్విశత జయంతిని పురస్కరించుకొని 2018, మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ ప్రజా సంఘటిత కార్యక్రమాలను నిర్వహించాలని మావోయిస్టు నేత గణపతి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల తాను సూచించిన తేదీల్లో వార్షిక వారోత్సవాలను నిర్వహించడం కుదరకపోతే అనువైన తేదీల్లో నిర్వహించాలని ఆయన సూచించారు.
నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు. దేశంలో జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాలను శక్తులను కూడగట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో కొంత వెసలుబాటు దోరణి అవలింబించినప్పటికీ నక్సలిజం లక్ష్యానికి మాత్రం దూరం వెళ్లకూడదని చెప్పారు. నక్సలిజాన్ని ఏదోరకంగా సమర్ధించే శక్తులతోనే మమేకం కావాలని అన్నారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా నయా పెట్టుబడిదారి విధానం రాజ్యమేలుతున్న కారణంగా ప్రజల్లో అసహన పరిస్థితులు, కొన్ని చోట్ల తిరుగుబాటు పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కమ్యూనిజానికి, సోషలిస్టు విప్లవాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి సమాజం దుష్ర్పచారం సాగిస్తోందని, తాను చెప్పిన నాలుగు కమ్యూనిస్టు చారిత్రక ఘట్టాలను పురస్కరించుకొని ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. మేధోపరంగా, రాజకీయంగా, ప్రజా ఉద్యమాలపరంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.