ఇందిర.. నా సోదరి!
అలీనోద్యమం జోరుగా నడుస్తున్న రోజులవి.. భారత రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా నిలిచింది. వందకు పైగా దేశాధినేతలు, పరిశీలకులు పాల్గొన్న ఈ సదస్సులో ఫిడెల్ క్యాస్ట్రో చర్య.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇరుకున పెట్టేసింది. అప్పటివరకూ అలీనోద్యమానికి చైర్మన్‌గా వ్యవహరించిన క్యాస్ట్రో... ఢిల్లీ సదస్సులో ఆ బాధ్యతలను ప్రధాని ఇందిరాగాంధీకి అప్పగించాలి. ‘‘నా సోదరికి ఈ బాధ్యతలు అప్పగించడం నాకు ఆనందం కలిగిస్తోంది’’ అని క్యాస్ట్రో ప్రకటించారు. వేదికపైనే ఉన్న ఇందిర అధికార దండం (న్యాయమూర్తుల వద్ద ఉండే కలప సుత్తి లాంటిది)ను అందుకునేందుకు దగ్గరకు వచ్చారు. చేయి చాచారు. కానీ క్యాస్ట్రో వైపు నుంచి అసలు కదలిక లేదు. చేతిలో దండం అలాగే ఉంది. రెండోసారి చేయి చాచినా.. స్పందన లేదు. క్యాస్ట్రో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కానీ దండం మాత్రం చేతులు దాటి రావడం లేదు. ఏం చేయాలబ్బా అని ఇందిర తటపటాయిస్తున్న సమయంలో క్యాస్ట్రో హఠాత్తుగా ముం దుకు కదిలారు. ఇందిరను రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో అధికార దండాన్ని ఆమె చేతుల్లో పెట్టాడు. ఈ పరిణామంతో ఇందిర ఒకింత షాక్‌కు గురైనా... ఆ వెంటనే తేరుకుని... చిరునవ్వులు చిందిస్తూ నిలబడిపోరుుంది. ఈలోపు... విజ్ఞాన్ భవన్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోరుుంది.
అలిగిన అరాఫత్
1983లో ఢిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సులో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా విమోచనోద్యమ నేత యాసర్ అరాఫత్ ఏదో ఒక విషయమైన అలక వహించారు. సదస్సు నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నట్వర్ సింగ్‌కు ఆ విషయం తెలిసింది. ఆతిథ్య దేశంగా భారత్‌కు చెడ్డపేరు వస్తుందని, వెంటనే ఆ విషయాన్ని ప్రధాని ఇందిరకు తెలియజేశారు. అరాఫత్‌ను సముదారుుంచాలని సూచించారు. వెంటనే ఇందిర రంగంలోకి దిగారు. క్యాస్ట్రోను వెంటబెట్టుకుని అరాఫత్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత సంభాషణ ఇలా సాగింది...
క్యాస్ట్రో: మిత్రమా.. ఇందిర నీ స్నేహితురాలేనా?
అరాఫత్: మిత్రమా... ఇందిరాగాంధీ నా పెద్దక్కతో సమానం. ఆమె కోసం ఏమైనా చేస్తా
క్యాస్ట్రో: అరుుతే మంచి తమ్ముడి మాదిరిగా... సదస్సులో పాల్గొను
అంతే... అరాఫత్ తన వాకౌట్ ఆలోచనలన్నింటినీ పక్కనబెట్టేశారు. సదస్సులో పాల్గొన్నారు.
నెహ్రూ మెచ్చిన సాహసి..
1960లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నెహ్రూ న్యూయార్క్ వెళ్లారు. ఆ సందర్భంలో క్యాస్ట్రోను స్వయంగా వెతుక్కుంటూ వెళ్లి మరీ కలిశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. ‘ప్రపంచంలోనే అత్యంత సాహసిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అప్పుడు క్యాస్ట్రో 34 ఏళ్ల కుర్రాడు!!