ఏ బురఖానూ వేసుకోకుండానే ప్రజాకళాకారుణ్ణయాను : వరంగల్ శ్రీనివాస్
ఏ బురఖానూ వేసుకోకుండానే ప్రజాకళాకారుణ్ణయాను : వరంగల్ శ్రీనివాస్
Published Mon, Aug 26 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
పాట ఎక్కడ ఉంటే శ్రీనివాస్ అక్కడ ఉంటాడు. అతనికి ప్రాంతంతో పనిలేదు. కులమతజాతి వివక్ష అసలే లేదు. శ్రీనివాస్ లక్ష్యం ఒక్కటే.. ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ పాటతో ప్రతిఘటించడం. అలాగని తను కమ్యూనిస్ట్ కాదు, మావోయిస్ట్ అంతకన్నా కాదు. అతనో హ్యూమనిస్ట్. పాటతో జనహృదయాల్లో ఎర్రగులాబీలు పూయిస్తున్న ప్రజాకళాకారుడు వరంగల్ శ్రీనివాస్ సినిమాల్లో కూడా రచయితగా తనదైన ముద్రను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయనతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ...
*** మీ అసలు పేరేంటి?
బొడ్డు శ్రీనివాస్. దాసరిగారు ‘వరంగల్ శ్రీనివాస్’ అని పిలిచేవారు. ఇక అందరూ అలాగే పిలవడం మొదలుపెట్టారు. మాది వరంగల్ జిల్లా. నా జిల్లా పేరు నా పేరు ముందుండటం గర్వకారణమే కదా. అందుకే అలాగే కొనసాగుతున్నా.
*** కమ్యూనిస్ట్ కాని మీకు వామపక్ష భావజాలం ఎలా అలవడింది?
మాది ఆత్మకూరు మండల్, తక్కెళ్లపాడు. పల్లె జానపదాలకు మా ఊరు పేరెన్నికగన్నది. మా అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ నారు పోసేటప్పుడూ వడ్లు దంచేటప్పుడూ తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడూ.. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా మా ఊళ్లో పాట వినిపిస్తూ ఉండేది. అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. పాట వినడమే కాదు, వాళ్లతో పాటు చిన్నప్పట్నుంచే గొంతు కలిపేవాణ్ణి. అలా పాట అనేది నా జీవితంలో భాగం అయిపోయింది. నా ఏడోతరగతిలోనే సొంతంగా పాట రాశాను. రాసిన తొలిపాటకే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి నా రచనా ప్రస్థానం మొదలైంది. పల్లె జానపదాల బాణీలను తీసుకొని ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాసేవాణ్ణి. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాను. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్... ఇలా ఏ బురఖా వేసుకోకుండానే... నేను కూడా ప్రజాకళాకారుణ్ణి అయ్యాను.
*** మొత్తం ఎన్ని భాషల్లో పాటలు రాశారు?
తెలుగు, బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు భాషల్లో ఎన్నో పాటలు రాయడమే కాదు, సొంతంగా పాడేవాణ్ణి కూడా.
*** సినీ గీతరచయిగా తొలి అవకాశం ఎలా వచ్చింది?
వరంగల్ నెహ్రూగారు.. నన్ను దర్శక, రచయిత సంజీవిగారికి పరిచయం చేశారు. ఆయన ద్వారానే దాసరిగారికి దగ్గరవ్వగలిగాను. సినీ రచయితగా నేను తొలి అడుగు వేసింది దాసరిగారి ద్వారానే. ‘అడవి చుక్క’ చిత్రంలో ‘తయ్యుందత్తై.. తయ్యుందత్తై నేను రాసిన తొలి పాట. అదే సినిమాలో నేను రాసిన ‘ఎవరు అన్నారమ్మ మేమూ... గరీబోళ్లనీ’ పాటైతే పెద్ద హిట్. అలాగే దాసరిగారి ‘చిన్నా’ చిత్రంలో నేను రాసిన ‘గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా ఏడికే సిరిసిరి మువ్వా’ పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్.నారాయణమూర్తి కూడా నన్నెంతో ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ, వేగుచుక్కలు, ఊరు మనదిరా, అడవిబిడ్డలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, అమ్మమీద ఒట్టు చిత్రాలతోపాటు రేపు రాబోతున్న ‘నిర్భయభారతం’ చిత్రానికి కూడా పాటలు రాశాను. ఇందులో అడవిబిడ్డలు, వీరతెలంగాణ చిత్రాల్లో నటించాను కూడా. ఎర్ర సినిమాలే కాక, ఫూల్స్, ఆయుధం, ఈ వయసులో, రెండేళ్ల తర్వాత, రఘుపతి లాంటి వాణిజ్య చిత్రాలక్కూడా పాటలు రాశాను.
*** ఓ కళాకారునిగా మీ లక్ష్యం?
గీత రచయితగా అన్ని రకాల పాటలు రాయాలనుంది. డ్యూయెట్స్, ఐటమ్ సాంగ్‌స కూడా నేను రాయగలను. అవకాశం వస్తే నేనేంటో రుజువు చేసుకుంటా. అలాగే... సంగీత దర్శకత్వం వహించాలని ఉంది. గతంలో ఓసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. త్వరలో నా కోరిక తీరబోతోంది.
Advertisement
Advertisement