అనంత శోకం | AP: 12 people feared dead in Penukonda road accident | Sakshi
Sakshi News home page

అనంత శోకం

Published Thu, Jan 8 2015 3:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

AP: 12 people feared dead in Penukonda road accident

* ఏపీలోని పెనుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
* లోతైన గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు
* మృతుల్లో 12 మంది విద్యార్థులు.. 65 మందికి తీవ్ర గాయాలు
* రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
* హుటాహుటిన హైదరాబాద్ నుంచి దుర్ఘటన స్థలానికి వైఎస్ జగన్
* క్షతగాత్రులకు పరామర్శ, మృతుల కుటుంబాలకు ఓదార్పు

పెనుకొండ నుంచి సాక్షి ప్రతినిధి: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ‘షీప్-ఫామ్’. బుధవారం ఉదయం 8.24 గంటలు. మడకశిర నుంచి బయలుదేరిన ‘పల్లె వెలుగు బస్సు’ పెనుకొండకు వెళుతోంది. స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన వివిధ గ్రామాల విద్యార్థులతో పాటు 87 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. మరో 5 నిమిషాల్లో పెనుకొండకు చేరుతుందనగా.. ముందు వెళుతున్న ఆటోను దాటివెళ్లే క్రమంలో బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది.
 
 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. బస్సు ఇరుకు ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న సుమా రు 150 అడుగుల లోతైన గుంతలో పడిపోవడంతో కుప్పలా అయిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మా ర్మోగింది. 11మంది అక్కడికక్కడే మరణిం చగా, నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందు తూ మృతి చెందారు. డ్రైవర్, కండక్టర్ సహా 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెనుకొండ, హిందూపురం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. మరణించిన 15 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నారు.  
 
 నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది..
 ఏపీ 28 జెడ్ 1053 పల్లె వెలుగు బస్సు మడకశిర నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరింది. 7.50కి పెనుకొండ మండలం మావటూరుకు చేరింది. బండపల్లి, నాగలూరు, మావటూరు విద్యార్థులంతా బస్సు ఎక్కారు. కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో అనేకమంది నిలుచునే ప్రయాణిస్తున్నారు. మావటూరు నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన బస్సు ఘాట్ రోడ్డులోని షీప్ ఫామ్ (గొర్రెల పెంపక కేంద్రం) సమీపంలోకి చేరింది. అక్కడి నుండి మరో 4 కిలోమీటర్లు వెళితే పెనుకొండ వచ్చేస్తుంది. ఐదారు నిమిషాలు గడి స్తే గమ్యం చేరుతుందనగా ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఇరుకైన మట్టిరోడ్డు. పట్టుమని పది అడుగుల వెడల్పు కూడా లేదు.
 
  దీని పక్కనే కొత్త రోడ్డు కోసం లోతైన గుంత తవ్వారు. కానీ రోడ్డు పక్కన రక్షణ కోసం కనీసం రాళ్లు కూడా పెట్టలేదు. కాంట్రాక్టర్ హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. డ్రైవర్ గంగప్ప (లేపాక్షి మండలంలోని కల్లూరు స్వస్థలం) ఆటోను ఓవర్‌టేక్ చేయబోగా బస్సు అదుపు తప్పడంతో రోడ్డు కోసం తవ్విన లోయలాంటి గుంతలో పడిపోయింది. చేతులు, కాళ్లు, నడుం విరిగి పోరుు కొందరు, తల పగిలి మరికొందరు ఆర్తనాదాలు చేశారు. ఇంకొందరి శరీరంలో బస్సులోని ఇనుపరాడ్లు, రేకులు దిగబడిపోయాయి. 87 మంది ప్రయాణికుల్లో నలుగురు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు బస్సు పడిపోతున్న సమయంలో రోడ్డుపైకి దూకేశారు.
 
 ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి
 ఘటన జరిగిన వెంటనే 108 వాహనాలు, జీపులు, ఆటోల్లో క్షతగాత్రులందర్నీ 40 పడకల పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోని వరండాలో కుప్పగా పడేశారు. సుమారు 50 మందిని హిందూపురం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న బస్సు డ్రైవర్ గంగప్ప సహా 16 మందిని బెంగళూరు ఆస్పత్రి (నిమ్హాన్స్)కి తరలించారు. ఆస్పత్రిలో శ్రీనివాసులు, గంగాధర్ అనే ఇద్దరు చనిపోయారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు ఆస్పత్రి ప్రత్యేక హెల్ప్‌లైన్ (080-26995008, 26995021)ను ఏర్పాటు చేసింది. బస్సు దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిమ్హాన్‌‌సలో బాధితులను కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం 40 మంది హిందూపురంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేయగా వారిలో అశోక్‌కుమార్, గంగాధర్ అనే ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. సీరియస్‌గా ఉన్న జి.అశోక్‌కుమార్ అనే విద్యార్థిని కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రస్తుతం అనంతపురంలో నలుగురు చికిత్స పొందుతున్నారు.
 
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..: మంత్రి శిద్ధా
 డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. శిద్ధా తో పాటు జిల్లాకు చెం దిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
 కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం!
 పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. షీప్ ఫామ్ వద్ద ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం ఘాట్‌ను తవ్వి కొత్త రోడ్డు నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను మంత్రి పరిటాల సునీత సమీప బంధువైన ఎల్.నారాయణ చౌదరికి చెందిన శ్రీ కృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రోడ్డు వేయడం కోసం ఘాట్‌లో ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆనుకుని దాదాపు 150 అడుగుల లోతు గుంతలా తవ్వారు. ఇలాంటి చోట ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఉంచక పోవడం క్షమార్హం కాని నిర్లక్ష్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  
 
 బస్సు కండీషన్ డొల్ల
 ప్రమాదానికి కారణమైన పల్లె వెలుగు బస్సు మడకశిర డిపోకు చెందినది. ఏమాత్రం కండీషన్ బాగోలేదు. 8.75 లక్షల కిలోమీటర్లు తిరిగింది. స్క్రాప్‌కు దాదాపుగా దగ్గరలో ఉంది. పైగా స్థాయికి మించి ప్రయాణికులు ఎక్కారు. ఈ మార్గంలో ఆటోల రద్దీ ఎక్కువ. ఉదయం వేళ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులంతా పాసులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. చాలామంది డ్రైవర్లు విద్యార్థులు కన్పిస్తే బస్సు ఆపరనే ఆరోపణలున్నాయి. మరో బస్సు వచ్చేలోపు సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో ఆగిన బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నా విద్యార్థులు అందులోనే ఎక్కుతుంటారు. నిత్యం బస్సు టాప్‌పైనా విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. కాగా డ్రైవర్ వేగంగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెప్పారు.
 
 మృతుల వివరాలు
 మురళి (11), నరేంద్ర (15), అనిల్ (16), లక్ష్మీనారాయణ (16), నరసింహమూర్తి (16), అశోక్‌కుమార్ (17), అనిత (17), దాసరి గంగాధర్ (17) (తండ్రి రామన్న, మావటూరు), శేఖర్ (17), హనుమంతరాయుడు (20), అశోక్‌కుమార్ (17), గంగాధర్ (17) (తండ్రి సజ్జప్ప, మావటూరు). వీరంతా విద్యార్థులు కాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ (47), డీఎస్సీ అభ్యర్థి శ్రీనివాసులు (35), గంగాధర్ (16) (తండ్రి ప్రభాకర్, బండపల్లి)
 
 రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు పంపిన సందేశంలో రాష్ట్రపతి సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సందేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
 
 ముందే హెచ్చరించిన ‘సాక్షి’
 పెనుకొండ: అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ రహదారిలో రోడ్డు నిర్మాణ పనుల వద్ద ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. అరుునా కాంట్రాక్టర్, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రోడ్డు పనుల వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదని దాదాపు నెలన్నర కిందట (2014 నవంబర్ 26న అనంతపురం టాబ్లారుుడ్ పెనుకొండ జోన్‌లో) ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని బుధవారం ఘటనా స్థలిలో పలువురు పేర్కొన్నారు. ‘సాక్షి’ కథనాన్ని గుర్తు చేసుకున్నారు.    
 
 కన్ను మూసి తెరిచేలోగా..: ప్రత్యక్ష సాక్షులు
 హిందూపురం అర్బన్: రెప్పపాటు కాలంలోనే బస్సు ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఈ మార్గంలో ఇటీవల రెండు సర్వీసులు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు, పెనుకొండకు వెళ్లే ప్రయాణికులు, కూలీలు ఈ బస్సులోనే ఎక్కారు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.
 
 కుదుపులు రాగానే దూకేశా
 సత్తారుపల్లి నుంచి బస్సు బయలుదేరిన కొంతసేపటికే ఆటోను ఓవర్‌టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి కుడివైపునకు ఒరిగిపోతుండడంతో ఎడమవైపు డోరు వద్దనే ఉన్న నేను ఒక్కసారిగా బయటికి దూకేశా. చూస్తుండగానే బస్సు పల్టీలుకొడుతూ గోతిలో పడిపోయింది.
  - నందీశ్వర్‌రెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి
 
 ఓవర్ టేక్ చేయబోతూ..
 బస్సు వేగంగా వెళుతోంది. ఎక్కువ మందితో కిక్కిరిసివుంది. ముందుపోతున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోయే ప్రమాదానికి గురైంది. ఓవర్ టేక్ చేయకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రమాదంలో నా చేయి విరిగింది. చిన్న గాయాలయ్యాయి.
 - రామిరెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి
 
 వేగం వల్లే పడిపోయింది
 బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ వెనుకనే నిలబడివున్నా. బస్సు వేగంగా పోతోంది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు గోతులపై నుంచి వెళ్లడంతో అదుర్లతో ఊగిపోయింది. అందరం కేకలు వేశాం. ఆటో పక్కనుంచి బస్సును రోడ్డుపైకి తీసుకొస్తాడని అనుకునేలోపే గోతిలోకి పడిపోయింది. తర్వాతేం జరిగిందో తెలీదు.    
 - లలిత, సుద్దపట్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement