పెనుకొండలోని గగన్‌మహల్ ఇదే
పెనుకొండ : రాజరికపు పుటల్లో చెక్కుచెదరని కట్టడాల్లో పెనుకొండ పట్టణంలోని గగన్‌మహల్ ఓ మధుర జ్ఙాపకంగా నిలిచింది. 14, 15, 16, 17 శతాబ్ధాల్లో ఓ వెలుగు వెలిగిన గగన్‌మమల్ నేడు మనకు నాటి తీపి గుర్తులను పంచుతోంది. ఇండో పార్సీయన్ ఆకారంలో గార, కోడిగుడ్డు సొన, బెల్లం, ఇసుక గవ్వలు, చలువరాయి మిశ్రమంలో దీన్ని నిర్మించారు. పోర్చుగీసు కాలంలో నిర్మించిన ఈ గగన్‌మహల్‌ను అనంతరం 14వ శతాబ్ధంలో మల్లికార్జున రాయలు, వీరవిజయరాయలు, ప్రతాపరుద్ర రాయలు ఎంతో అభివృద్ధి చేశారు.
దీన్ని వేసవి విడిదిగా అప్పటి రాజులు వినియోగించే వారు. శత్రుదుర్భేధ్యమైన కట్టడంగా, రాజుల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైభాగంలో పెద్దఎత్తున పహారా కాయడానికి రంధ్రాలతో దీన్ని నిర్మించారు. సైనికులు దీనిద్వారా సుదూరం నుంచి వచ్చే శత్రువులను కనిపెట్టే సౌకర్యం ఇందులో ఉండటం విశేషం. 300 సంవ త్సరాలకు పైగా అప్పటి రాజులు దీన్ని వాడుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 26 మంది చక్రవర్తులు గగన్‌మహల్‌ను కేంద్రబిందువుగా చేసుకుని తమ ప్రాంతాల్లో పాలన సాగించారట. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు సైతం ఉన్నారు.
పెనుకొండకు ప్రత్యేక స్థానమిచ్చిన రాయలు
1509 నుంచి 1523 వరకు పాలన సాగించిన కృష్ణదేవరాయలు హంపీ తరువాత అంతటి ప్రాధాన్యతను పెనుకొండకు ఇచ్చారు. ప్రతినెలా మూడు నెలల పాటు ఇక్కడి నుంచే ఆయన పాలన సాగించే వారని, కొండపై సైతం అనునిత్యం లక్ష్మీనరసింహస్వామిని పవిత్రంగా పూజించడమే కాదు కొండపై ఆలయాన్ని కూడా నిర్మించారు. గగన్‌మహల్ నుంచి కొండపైకి రహస్య మార్గాలు ఉండేవి. నేటికీ ఆ రహస్య మార్గాలు ఉన్నా ప్రమాదమని ప్రభుత్వం వాటిని మూసివేయించింది.
చల్లదనం దీని ప్రత్యేకం
గగన్‌మహల్ యొక్క ప్రత్యేకం చల్లదనాన్ని కలిగించడమే. విభిన్న మిశ్రమాలతో నిర్మించడంతో ఏ కాలంలో అయినా చల్లదనాన్ని కలిగిస్తుంది. నాటి రాజరికపు గుర్తులను మన కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.
ఎలా వెళ్లాలంటే...
ఈ కట్టడాన్ని సందర్శించాలంటే అనంతపురం వైపు నుంచి పెనుకొండకు చేరుకుంటే ఆటోలో సులువుగా వెళ్ళవచ్చు. జిల్లా కేంద్రం నుంచి 75 కిలో మీటర్ల దూరం ఉంది. దీన్ని సందర్శకుల కోసం నిత్యం తెరిచే ఉంచుతారు. అలాగే బెంగళూరు, హిందూపురం వైపు నుంచి పెనుకొండకు అనేక బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వస్తే మరెన్నో కట్టడాలు, నాటి రాజరికపు ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment